
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, స్థలాల క్రమబద్ధీకరణకుగాను నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జీవో 58, 59లకు అనుగుణంగా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు మరోమారు అవకాశమిస్తూ ఈ నెల 14న ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా వ్యక్తిగత ధ్రువీకరణతో పాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్టు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2014 జూన్ 2వ తేదీనాటికి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల్లో ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం వర్తించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారం 125 గజాలలోపు స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వాటిని ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 చదరపు గజాలలోపు ప్రభుత్వ విలువలో 50 శాతం, 250–300 గజాల్లోపు 75 శాతం, 500–1000 గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్న వారు 100 శాతం ప్రభుత్వ విలువను చెల్లిస్తే క్రమబద్ధీకరించనున్నారు. అయితే, గృహేతర భూములు ఆక్రమణలో ఉంటే విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వ విలువ చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు/ఏదైనా డాక్యుమెంట్), స్థలం అధీనంలో ఉన్నట్లుగా ఆస్తిపన్ను చెల్లించిన రశీదు/విద్యుత్ బిల్లు/ తాగునీటి బిల్లు/రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌లలో ఏదైనా ఒకటి జత చేయాల్సి ఉంటుంది. గతంలోని ఉత్తర్వుల ప్రకారం అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. అయితే, ఈ దరఖాస్తులను ఎవరు పరిశీలించాలి, ఏ స్థాయిలో దరఖాస్తును ఎవరు పరిష్కరించాలనే నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం నేడు విడుదల చేయనుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.