
కొబ్బరికాయ కొట్టి ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న జేఏసీ నాయకులు
సీతమ్మధార(విశాఖపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించనున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు పరిపాలన వికేంద్రీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట కుట్రంలోని అన్ని జిల్లాలూ అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రికి అన్ని మతాల దేవుళ్లు ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ వందనం పేరిట ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. సంపత్ వినాయగర్ ఆలయం వద్ద శనివారం ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం కనకమహాలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. లజపతిరాయ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ జెండా, అజెండాలను పక్కన పెట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని బలపర్చాలని విన్నవించారు.
కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్, హ్యూమన్ రైట్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, ఏయూ ప్రొఫెసర్ షారోన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment