ఇక ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ | Automatic mutation here after | Sakshi
Sakshi News home page

ఇక ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌

Published Tue, Feb 4 2020 5:27 AM | Last Updated on Tue, Feb 4 2020 5:27 AM

Automatic mutation here after - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ను పక్కాగా అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు కొనుగోలు చేసిన వారు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగానే రెవెన్యూ అధికారులే వారి పేరుతో రికార్డులను సవరించటాన్ని ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ అంటారు. తద్వారా కొనుగోలుదారులు రెవెన్యూ రికార్డుల్లో సవరణ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.  

ఇన్నాళ్లూ మీ–సేవే శరణ్యం  
ప్రస్తుతం భూములను కొన్నవారే రెవెన్యూ రికార్డుల్లో తమ పేరుతో మార్చాలని కోరుతూ నిర్దిష్ట రుసుము చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు, ఇతర పత్రాలను స్కాన్‌చేసి ఆధారాలుగా చూపాల్సి ఉంటుంది. అయితే ఇలా మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసినా రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముడుపులిస్తేనే మ్యుటేషన్లు చేస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి.  

సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి రోజూ వివరాలు.. 
అవినీతి రహితంగా, ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మార్గనిర్దేశం మేరకు రెవెన్యూ శాఖలో ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ దిశగా కసరత్తు ఆరంభమైంది. ఆటోమేటిక్‌ మ్యుటేషన్, ఇతర అంశాలపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాలను సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం ఏ రోజుకారోజు సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపుతుంది. తహసీల్దారు దీన్ని పరిశీలించి నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తారు.  

గ్రామ సచివాలయాల్లోనే 63 సర్టిఫికెట్ల జారీ 
ప్రజలకు ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ లాంటి 63 రకాల సర్టిఫికెట్లను గ్రామ సచివాలయాల్లోనే జారీ చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు సర్టిఫికెట్ల కోసం తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేశారు. చుక్కల భూముల పరిస్థితిపై కూడా ఆమె సమీక్షించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement