
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కన్నెర్ర జేసినా.. లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినా.. ఆఖరికి భౌతికదాడులు జరిగినా.. చాలామంది రెవెన్యూ అధికారుల పనితీరు మారడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పక్షం రోజుల్లోనే మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో భూ యాజమాన్య హక్కుల కోసం పట్టాదారులు తహసీళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మ్యుటేషన్లు, విరాసత్‌ల అమలు ఆలస్యానికి కరోనా వ్యాప్తి కూడా ఒక కారణమే అయినా.. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది.
రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే 24 గంటల్లోనే ఆన్‌లైన్ మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తుండగా క్షేత్రస్థాయి యంత్రాంగం మాత్రం షరా మామూలుగానే స్పందిస్తున్నట్లు పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మీ–సేవలో దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం.. మ్యుటేషన్ల జారీలో జాప్యం చేస్తోంది. దీంతో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలోనూ ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 16,14,725 దరఖాస్తులు భూ యాజమాన్య హక్కులు, వారసత్వ భూ బదలాయింపులు కోరుతూ ప్రభుత్వానికి రాగా.. వాటిలో ఇప్పటివరకు 11,89,951 దరఖాస్తులకు మోక్షం కలిగింది. ఇంకా 1,16,476 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 74,610 దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
తహసీళ్ల చుట్టూ చక్కర్లు : సుపరిపాలన, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఆన్‌లైన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినా చాలా మంది అధికారులు ఇంకా వాటికి అలవాటుపడలేదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే మ్యుటేషన్ వ్యవహారం కొలిక్కి రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు సహా సేల్‌డీడ్, 1బీ, పహాణీ నకలు జతపరిస్తే.. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. భూ యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం రెవెన్యూ అధికారుల విధి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడంలేదు.
మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన కాపీల నకళ్లను తహసీల్దార్ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేస్తే తప్ప వాటికి మోక్షం కలగడంలేదు. పట్టాదార్లను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దనే ఉద్ధేశంలో దాదాపుగా అన్ని సేవలను ప్రభుత్వం ఆన్‌లైన్ చేసింది. మీ–సేవలో చేసుకున్న అర్జీ జత పరిచిన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసే వాటికి జిరాక్స్‌ల కోసం రెవెన్యూ శాఖ నెలవారీగా నిధులు విడుదల చేస్తోంది. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ నెపంతో దరఖాస్తుదారులను కార్యాలయాలకు పిలిపించి.. బేరసారాలు మొదలుపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment