రెవెన్యూలో పదోన్నతల జాతర
– అన్ని కేడర్ల వారికీ అవకాశం
– చర్యలు చేపట్టిన అధికారులు
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో పదోన్నతులు జాతర మొదలుకానుంది. అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో అటెండర్ స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు పదోన్నతులు లభించనున్నాయి. ఇప్పటికే నలుగురు డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించేందుకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే దివ్యాంగుల బ్యాక్‌ల్యాగ్ పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలు కలెక్టర్ ఆమోదం కోసం ఉంచినట్లు అధికావర్గాల ద్వారా సమాచారం.
15 మంది ఎస్‌ఏలకు పదోన్నతి
రెవెన్యూ శాఖలో 15మంది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహశీల్దారుగా పదోన్నతి కల్పించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందుకు సంబంధించి సీనియార్టీ జాబితాను సిద్ధం చేశారు. అభ్యంతరాల ప్రక్రియ పూర్తికాగానే కలెక్టర్ ఆమోదం తీసుకుని పదోన్నతలు కల్పిస్తామని అధికారవర్గాలు తెలిపాయి.
కింద కేడర్లకు పదోన్నతులు
సీనియర్ అసిస్టెంట్లకు(ఎస్‌ఏ) పదోన్నతులు కల్పించిన తరువాత ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకుని జూనియర్ అసిస్టెంట్లకు ఎస్‌ఏలుగా, రికార్డ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా, అటెండర్లకు రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. ఈ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది.
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ప్రక్రియ వేగవంతం చేశారు. ఒక కేడర్‌కు సంబంధించి అభ్యంతరం ఉండటంతో దానిపై క్లారిఫికేషన్ కోసం ప్రభుత్వానికి అధికారులు లేఖ రాశారు. ఆ కేడర్‌కి సంబంధించి ఉన్న ఒక్క పోస్టు మినహా మిగిలిన అన్ని పోస్టులు భర్తీ చేసేందుకు అవసరమైన ప్రక్రియ దాదాపు పూరైనట్లు అధికారవర్గాలు ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైలు కలెక్టర్‌కి పంపినట్లు సమాచారం.