deputations
-
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారు. తక్షణమే రద్దు ఆదేశా లు అమలులోకి వ చ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యుటేషన్లలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగులు వెంటనే తమ ఒరిజినల్ పోస్టింగుల్లో చేరాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.ఎస్.క్రిస్టినా చోంగ్తు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని వైద్య సిబ్బంది తక్షణమే రిలీవ్ అయి బుధవారం సాయంత్రమే అసలు పోస్టింగ్ స్థలంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివిధ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ కేడర్‌లో ఉన్న డాక్టర్లను రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు డీఎంఈ డాక్టర్ త్రివేణి మెమో జారీ చేశారు. ఇక ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్య సిబ్బంది గురువారం సాయంత్రానికి తమ ఒరిజినల్ పోస్టింగ్‌లలో చేరాలని ప్రజా రోగ్య సంచాలకులు ఆదేశించారు. డిప్యుటేషన్లు లేదా వర్క్ ఆర్డర్లు రద్దయిన ఉద్యోగుల జాబితాను సంబంధిత విభాగాల అధిపతులు గురువారం సాయంత్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు. తమ విభాగాల్లో డిప్యుటేషన్లలో ఎవరూ లేరన్న ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపాలని కోరారు. ‘అవసరాల మేరకు డిప్యుటేషన్లు అంటూ’పైరవీలకు రంగం సిద్ధం... జిల్లా కలెక్టర్లు లేదా ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆమోదంతో అవసరాల మేరకు ఆయా శాఖల అధిపతులు డిప్యుటేషన్లు జారీ చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవైపు డిప్యుటేషన్లను రద్దు చేస్తూనే ఈ మెలిక పెట్టడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ డిప్యుటేషన్లు తీసుకోవడానికే ఈ మెలిక అన్న చర్చ జరుగుతోంది. 2 వేల మందికిపైగా డిప్యుటేషన్లలోనే.. ఒక అంచనా ప్రకారం వైద్య,ఆరోగ్యశాఖలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దాదాపు 2 వేల మందికి పైగా డిప్యుటేషన్లలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేయడం వెనుక కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేసి, కొత్తగా ఇవ్వడం ద్వారా పైరవీలకు తెరలేపాలన్నదే కొందరు అధికారుల ఉద్దేశమన్న విమర్శలున్నాయి. ఆ మేరకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. సొమ్ములు చేతులు మారేందుకేనా అవసరాల మేరకు ప్రభుత్వ రాతపూర్వక అనుమతితో డిప్యుటేషన్లు ఇవ్వొచ్చన్న నిబంధన పెద్ద ఎత్తున దుర్వినియోగం కానుందని అంటున్నారు. సాధారణ సిబ్బంది డిప్యుటేషన్లకు రూ.లక్ష, స్టాఫ్‌నర్సులకు రూ.లక్షన్నర, డాక్టర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిమాండ్ ఉంటుంది. అలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకే అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరాల మేరకు తీసుకోవచ్చని ఉత్తర్వులో చెప్పాల్సిన అవసరమేంటి? ఒకవేళ అవసరాలున్నచోట ఇప్పటికే ఉన్నవారిని తొలగించి వెనక్కు పంపించాల్సిన అవసరమేంటన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆ 18 మంది డీఎంహెచ్‌వోల మాటేమిటి కాగా, డిప్యుటేషన్‌పై ఉన్న దాదాపు 18 మంది జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్‌వో) వెనక్కు పంపించాలన్న ఆదేశాలు వెలువడలేదని ఒక అధికారి వెల్లడించారు. దీనికి కారణాలు ఏంటో అంతుబట్టడంలేదన్న వాదనలున్నాయి. ఉద్యోగులు... సంఘాల అభ్యంతరం ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఒక్కసారిగా డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. వివిధ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా యి. విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, పదో తరగతి, ఇంటర్, ఎంసెట్ వంటి పరీక్షలు ఉన్న నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దు చేయడం వల్ల గందరగోళం నెలకొంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే అమలు చేయడం వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తన ఆదేశాలను వచ్చే జూన్ వరకు నిలి పివేయాలని కోరుతున్నారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, స్పౌజ్ గ్రౌండ్లలో ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడం సమంజసం కాదంటున్నారు. విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు సమయం ఇవ్వాలని, సాధారణ బదిలీలను చేపట్టాలని కోరుతున్నారు. -
తప్పు.. మీదంటే మీదే
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో డిప్యుటేషన్ల వ్యహారం చిచ్చురేపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. సమగ్ర వివరాలు అందించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారంఊ ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా మండిపడుతున్నాయి. సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు సంఘాల నేతలు ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. సాధారణ బదిలీలు చేపట్టకుండా, అయినవారు, ముడుపులు ఇచ్చి న వారిని కోరుకున్న ప్రాంతానికి పంపుతు న్నారని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో టీచర్లు సిటీకి.. చదువులు గాలికి’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ వార్తపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొత్త వివాదానికి దారి తీస్తున్న డిప్యుటేషన్లు టీచర్ల డిప్యుటేషన్ అంశం అధికారుల మధ్య కొత్త వివాదానికి దారి తీస్తోంది. విద్యాశాఖలో ఉన్నతాధికారులు కొంతమంది ఈ తంతుతో తమకు సంబంధమే లేదని చెబుతున్నారు. తాను వ్యతిరేకించినా డిప్యుటేషన్ ఆర్డర్ ఎలా వచ్చిందో తెలియదని ఓ అధికారిణి తెలిపారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నా, ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోందని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, విద్యాశాఖ ఉన్నతాధికారి మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఫైల్ సంబంధిత అధికారిణి ద్వారానే తనకు వస్తుందని, ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మానవతకోణంలో బదిలీలు చేస్తున్న విషయాన్ని ఆమె ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారో తెలియడం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పరస్పరం సీఎంఓకు ఫిర్యాదులు చేసుకుంటున్న వైనం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. రంగంలోకి మధ్యవర్తులు తీవ్ర విమర్శలు వస్తున్నా డిప్యుటేషన్ వ్యవహారం ఆగడం లేదు. ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు గత నెల 11వ తేదీన ఓ టీచర్‌ను డిప్యుటేషన్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవే కాకుండా మరికొన్ని డిప్యుటేషన్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యుటేషన్ల బేరసారాలు పలు జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయని టీచర్లు అంటున్నారు. అనారోగ్య సర్టీఫికెట్లు సృష్టించి మరీ డిప్యుటేషన్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారని వారు చెబుతున్నారు. కొంతమంది రాజకీయ పలుకుబడిని ముందుకు తెస్తుంటే, మరికొంతమంది తమకు విద్యాశాఖలో ఉన్నతాధికారి తెలుసునని, ఆయనకు కొంత ముట్టజెబితే డిప్యుటేషన్ సులభమని నమ్మిస్తున్నారని పలువురు టీచర్లు తెలిపారు. ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలి ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత పాటించి విశ్వసనీయతను కాపాడుకోవాలి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులకు డిప్యుటేషన్ పేరిట జిల్లాలు దాటించి బదిలీలు చేయటం సమంజసం కాదు. అనారోగ్యం, భార్యభర్తలు తదితర సహేతుక కారణాలతో బదిలీలు చేయాలనుకుంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని అవసరమైన, అర్హులైన ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వటం సమంజసం. ఉపాధ్యాయులు బదిలీలకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి కల్పించారు. నూతనంగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ ప్రధానకార్యదర్శి -
ఏఐఎస్ క్యాడర్ డిప్యుటేషన్‌కు ఓకే
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీసు అధికారుల కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్ నిబంధనలకు సవరణల ప్రతిపాదనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సవరణలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేంద్రంలో కొరత లేకుండా పని చేసేందుకు రాష్ట్రాలకు చెందిన ఏఐఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై పంపించాలనే సవరణను స్వాగతిస్తున్నానని, అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా డిప్యుటేషన్‌పై అధికారులను తీసుకోవాలనే సవరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిపికెట్లను ఇచ్చి, అనుమతించిన అధికారులనే కేంద్ర డిప్యుటేషన్‌కు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఈ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఈ లేఖలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రాలకు కూడా ప్రయోజనమే కానీ.. ► సెంట్రల్ డిప్యుటేషన్లో భాగంగా తగిన సంఖ్యలో ఐఏఎస్ అధికారులను అందుబాటులో ఉంచేలా ఈ సవరణలను ప్రతిపాదించినట్లు కేంద్ర డీఓపీటీ శాఖ ఇటీవల రాష్ట్రాలకు తెలిపింది. తద్వారా కేంద్ర ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వివిధ స్థాయిల్లో పని చేసే రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్‌లు.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సహాయం చేయగలుగుతారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని నమ్ముతూ పూర్తి మద్దతు తెలుపుతున్నాను. ► అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలకు నేతృత్వం వహించే రాష్ట్ర ఐఏఎస్ క్యాడర్ అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యక్రమాల నిర్వహణలో, వివిధ ప్రాజెక్టుల అమలులో ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు. క్లిష్టమైన ప్రాజెక్టులను, ఇతర అంశాలను నిర్వహించడానికి వారి నైపుణ్యం, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. ► కేంద్రం డిప్యుటేషన్ కోసం అభ్యర్థించే ఐఏఎస్ అధికారుల నైపుణ్యం, అనుభవం అంచనా వేశాకే రాష్ట్రం నో అబ్జెక్షన్ పత్రం జారీ చేస్తుంది. అలాంటి వారిని డిప్యుటేషన్‌పై పంపడం వల్ల రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది. ► ఇది రాష్ట్ర ప్రయోజనాలను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా కేంద్ర డిప్యుటేషన్ రిజర్వు అవసరాలను సక్రమంగా తీర్చగలుగుతుంది. అయితే కేంద్రం తాజాగా చేసిన సవరణ ప్రతిపాదన వల్ల ఇటువంటి సౌలభ్యం రాష్ట్రాలకు దూరమవుతుంది. ఒక అధికారిని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే రిలీవ్ చేయాల్సి వస్తుంది. సరైన రీతిలో సేవలకు విఘాతం ► రాష్ట్రంలో కీలకమైన శాఖలకు, ప్రాజెక్టులకు నేతృత్వం వహిస్తున్న ఇలాంటి అధికారులు అప్పటికప్పుడు కేంద్ర డిప్యుటేషన్‌కు వెళ్లడం వల్ల రాష్ట్రం చేపట్టే ముఖ్యమైన, కీలకమైన ప్రాజెక్టులు పట్టాలు తప్పుతాయి. అధికారుల వ్యక్తిగత జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. వారి కుటుంబాలు, పిల్లల విద్య వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ అధికారి సామర్థ్యం ఉత్తమంగా ఉన్నప్పటికీ సరైన రీతిలో సేవలను అందించలేకపోవచ్చు. ► ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పై సవరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్లే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఓసీ జారీ చేయాల్సిన ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని అభ్యర్థిస్తున్నా. భారత్‌ను మరింత మెరుగైన దేశంగా మార్చేందుకు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అత్యధిక మద్దతు ఉంటుందని మీకు హామీ ఇస్తున్నా. -
వేధించే ఎత్తుగడే.. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్) కేడర్ రూల్స్–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీసుల అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన బాధ్యతల నేపథ్యంలోనే.. వారిని డిప్యుటేషన్‌పై పంపడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమయ్యేలా నిబంధ నలు ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ ఈ విధా నాన్ని ఏకపక్షంగా మార్చేసి.. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత కోల్పోయి నామమాత్రపు సంస్థలుగా మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రధాన అంశాలివీ.. ఇది రాజ్యాంగాన్ని మార్చడమే.. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 312లో ఉన్న నిబంధ నల ప్రకారం పార్లమెంటు ఆలిండియా సర్వీసెస్– 1951 చట్టాన్ని చేసింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించింది. కానీ రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా, దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా అఖిల భారత సర్వీసుల (కేడర్) రూల్స్–1954కు రంగు లద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రతిపాదిత సవరణ అంటే.. కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు సం బంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడం తప్ప మరొకటి కాదు. ఈ సవరణలను ఇలా దొడ్డిదారిన కాకుండా.. ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించాలి. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలగకుండా ఉండాలంటే.. రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నాకే రాజ్యాంగ సవరణలు చేపట్టాలి. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో ఈ నిబంధనను ఆర్టికల్ 368 (2)లో పొందుపరిచారని కేంద్ర ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి. సవరణలను విరమించుకోండి రాష్ట్రాల పాలనా అవసరాలను చిన్నచూపు చూసేలా కేంద్ర ప్రతిపాదనలున్నాయి. అఖిల భారత సేవల అధికారుల విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పరస్పర సర్దుబాటుకు గొడ్డలిపెట్టుగా ఈ సవరణలున్నాయి. వీటితో కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతింటాయి. అధికారుల సేవలను సామరస్యంగా, సమతుల్యంగా వినియోగించుకోవడానికి ప్రస్తుత ఏఐఎస్ (కేడర్) నిబంధనలు సరిపోతాయి. పారదర్శకత, రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కేంద్రం ప్రతిపాదిత సవరణలను విరమించుకోవాలి.’’ అని ప్రధానికి లేఖలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పరోక్ష నియంత్రణ కోసమే.. అఖిల భారత సర్వీసుల (కేడర్) రూల్స్‌ను సవ రించి.. రాష్ట్రాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవాలనుకోవడం ప్రమాదకరం. ఇది రాజ్యాంగ చట్రం, సహకార సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చడమే. రాష్ట్రాల్లో పనిచేసే అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి, పరోక్షంగా నియంత్రించడానికి, వారిని చెప్పుచేతుల్లో ఉంచు కోవడానికి కేంద్రం ఈ ఎత్తుగడ వేసింది. అధికారుల ముందు రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సహాయులుగా చేసే ఆలోచన ఇది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు జవాబుదారీతనంగా ఉండటంపైనా ఇది ప్రభావం చూపుతుంది. – కేసీఆర్ -
సంక్షేమ డిప్యుటేషన్లకు.. సవా‘లక్ష’ మార్గాలు..!
సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగుల డిప్యుటేషన్లపై పైరవీలు జోరందుకున్నాయి.సీడీపీఓ(శిశు అభివృద్ధి ప్రాజెక్టు) కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ , జూనియర్ అసిస్టెంట్లతో పాటు టైపిస్టులు దాదాపు 110 మందికి గతేడాది డిసెంబర్లో డిప్యుటేషన్లు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణను జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించడంతో సీడీపీఓ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య కుదించారు. నిర్దేశించిన సంఖ్యకు మించి ఉన్న సిబ్బందిని సంబంధిత జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ) కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. ఇలా వచ్చిన వారి సమ్మతి ఆధారంగా స్థాన మార్పిడి చేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయించింది.అనారోగ్య సమస్యలు, స్పౌజ్ వంటి కారణాలతో పాటు సిబ్బంది ఆవశ్యకత ఆధారంగా డిప్యుటేషన్లు ఇవ్వాలని భావిస్తోంది.ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. దీంతో హైదరాబాద్, వరంగల్ ఆర్జేడీ పరిధిలో ఈమేరకు దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించారు. ఇదే అదనుగా కొందరు పైరవీకారులు తమవారికి కోరిన చోట పోస్టింగ్ ఇప్పించేందుకు రంగంలోకి దిగారు.తన అనుయాయులకు అనువైన చోట పోస్టింగ్ ఇప్పించేందుకు వారు నడుంకట్టారు. ‘లక్ష’ణమైన డిప్యుటేషన్...! సీడీపీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు టైపిస్టుల్లో ఇప్పటివరకు 110 మంది జిల్లా కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. వారంతా డీడబ్ల్యూఓలో విధుల్లో చేరారు. తాజాగా వీరి పరిస్థితి ఆధారంగా మార్పులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కుటుంబ అవసరాలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు తదితర అంశాల ఆధారంగా ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు వినతులు సమర్పిస్తున్నారు. వాటికి సంబంధిత సీడీపీఓ లేదా డీడబ్ల్యూఓ అంగీకారం ఉండాలనే నిబంధన ఉంది. దీంతో కొందరు కోరిన చోట పోస్టింగ్ కోసం సీడీపీఓలు, డీడబ్ల్యూఓలపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు సన్నిహితుడైన ఉద్యోగికి అనువైన చోట పోస్టింగ్‌కు పైరవీ ముమ్మరంగా చేస్తున్నారు. దీనికోసం కొందరు రూ.లక్ష వరకు ముట్టజెపుతున్నట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకరిద్దరు అధికారులకు ఫిర్యాదులు సైతం చేసినట్లు తెలుస్తోంది. -
కేంద్ర ఉద్యోగుల డిప్యుటేషన్ భత్యం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న భత్యాన్ని రూ.2 వేల నుంచి రూ.4,500కు పెంచుతున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ(డీవోపీటీ) తెలిపింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపు చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలోనే డిప్యుటేషన్‌పై వెళ్లే కేంద్ర ఉద్యోగులకు వారి మూలవేతనంలో 5% లేదా గరిష్టంగా నెలకు రూ.4,500 చెల్లిస్తామని తెలిపింది. ఒకవేళ ఉద్యోగులు మరో ప్రాంతానికి డిప్యుటేషన్‌పై వెళితే..వారి మూలవేతనంలో 10% లేదా గరిష్టంగా రూ.9 వేలు చెల్లిస్తామంది. -
డిప్యుటేషన్లు వృథా ప్రయాసే!
అనంతపురం ఎడ్యుకేషన్: బీసీ సంక్షేమశాఖలో ఇటీవల చేసిన డిప్యుటేషన్లు వృథా ప్రయాసగా తయారయ్యాయి. అవసరం దృష్ట్యా కొందరు ఉద్యోగులను బీసీ కార్పొరేషన్‌కు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. వారి స్థానాల్లో ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నవారు మిన్నకుండిపోవడంతో ఆయా హాస్టళ్లలో సంక్షేమం అటకెక్కుతోంది. మెనూ, బయోమెట్రిక్ అమలు అస్తవ్యస్తంగా మారుతోంది. కళ్యాణదుర్గం ఏబీసీడబ్ల్యూఓగా, ధర్మవరం డివిజన్‌కు ఇన్చార్జ్గా ఉన్న నరసయ్యను, హిందూపురం ఏబీసీడబ్ల్యూఓగా, పెనుకొండ డివిజన్‌కు ఇన్చార్జ్గా ఉన్న కృత్రికను డిప్యుటేషన్‌పై బీసీ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. అలాగే బీసీ సంక్షేమశాఖలో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌ను, జూనియర్ అసిస్టెంట్ రాణిని కూడా డిప్యుటేషన్‌పై కార్పొరేషన్‌కు మార్చారు. ఈ క్రమంలో బీసీ సంక్షేమశాఖకు సంబంధించి కళ్యాణదుర్గం, ధర్మవరం డివిజన్ల ఇన్చార్జ్ బాధ్యతలను తాడిపత్రి డివిజన్ ఏబీసీడబ్ల్యూఓ రామాంజనేయులుకు, హిందూపురం, పెనుకొండ డివిజన్ల ఇన్చార్జ్ బాధ్యతలను అనంతపురం ఏబీసీడబ్ల్యూఓ మల్లికార్జునకు అప్పగించారు. అయితే వీరు ఇప్పటిదాకా ఆయా డివిజన్లకు వెళ్లనేలేదు. ఒక్క హాస్టల్‌ను కూడా సందర్శించలేదు. దీంతో ఆయా హాస్టళ్లలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. దాదాపు ఏ హాస్టల్లోనూ మెనూ అమలు కావడం లేదు. కనీసం కొత్త మెనూ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. మాతృశాఖపై మమకారం డిప్యుటేషన్‌పై వెళ్లిన ఏబీసీడబ్ల్యూఓలు మాతృశాఖపై మమకారంతో తిరిగి వెనక్కు వచ్చేందుకు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు కూడా వారి గురించి పట్టించుకోలేదు. దీంతో వారు సొంతశాఖలో తమ పనుల్లోనే ఎక్కువగా నిమగ్నమవుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నా రోజులో ఎక్కువసేపు సంక్షేమశాఖ డీడీ కార్యాలయంలోనే ఉంటున్నారు. జూనియర్ అసిస్టెంట్ రాణిని ఇప్పటిదాకా కనీసం రిలీవ్ కూడా చేయలేదు. ఇటు బీసీ సంక్షేమం, అటు బీసీ కార్పొరేషన్ అధికారుల అలసత్వం కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు. క్యాంపులు వెళ్తున్నారు డిప్యుటేషన్‌పై వచ్చిన ఏబీసీడబ్ల్యూఓలు కళ్యాణదుర్గం, హిందూపురం డివిజన్లలో క్యాంపులు తిరుగుతున్నారు. అయినప్పటికీ కచ్చితంగా విధులు నిర్వర్తించాల్సిందే. ఆయా డివిజన్లలో రుణాల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఫార్వర్డ్ చేయాలి. అలాగే బ్యాంకు లింకేజీ విషయమై బ్యాంకు అధికారులతో చర్చించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలి. – నాగముణి, బీసీ కార్పొరేషన్ ఈడీ తిరగాలంటే ఇబ్బంది డిప్యుటేషన్‌పై వెళ్లిన ఏబీసీడబ్ల్యూఓ స్థానాల్లో ఇన్చార్జ్ తీసుకున్నవారు ఆయా డివిజన్లలోని హాస్టళ్లను పర్యవేక్షించలేదనేది వాస్తవమే. ఒక్కొక్కరికి మూడు డివిజన్లు అప్పగించాం. తిరగాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఏదైనా అవసరముంటే డిప్యుటేషన్‌పై వెళ్లిన వారితోనే అనధికారికంగా సమాచారం తెప్పించుకుంటున్నాం. – రమాభార్గవి, బీసీ సంక్షేమశాఖ డీడీ -
రెవెన్యూలో పదోన్నతల జాతర
– అన్ని కేడర్ల వారికీ అవకాశం – చర్యలు చేపట్టిన అధికారులు అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో పదోన్నతులు జాతర మొదలుకానుంది. అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో అటెండర్ స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు పదోన్నతులు లభించనున్నాయి. ఇప్పటికే నలుగురు డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే దివ్యాంగుల బ్యాక్‌ల్యాగ్ పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలు కలెక్టర్ ఆమోదం కోసం ఉంచినట్లు అధికావర్గాల ద్వారా సమాచారం. 15 మంది ఎస్‌ఏలకు పదోన్నతి రెవెన్యూ శాఖలో 15మంది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహశీల్దారుగా పదోన్నతి కల్పించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందుకు సంబంధించి సీనియార్టీ జాబితాను సిద్ధం చేశారు. అభ్యంతరాల ప్రక్రియ పూర్తికాగానే కలెక్టర్ ఆమోదం తీసుకుని పదోన్నతలు కల్పిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. కింద కేడర్లకు పదోన్నతులు సీనియర్ అసిస్టెంట్లకు(ఎస్ఏ) పదోన్నతులు కల్పించిన తరువాత ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకుని జూనియర్ అసిస్టెంట్లకు ఎస్ఏలుగా, రికార్డ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా, అటెండర్లకు రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. ఈ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ప్రక్రియ వేగవంతం చేశారు. ఒక కేడర్‌కు సంబంధించి అభ్యంతరం ఉండటంతో దానిపై క్లారిఫికేషన్ కోసం ప్రభుత్వానికి అధికారులు లేఖ రాశారు. ఆ కేడర్‌కి సంబంధించి ఉన్న ఒక్క పోస్టు మినహా మిగిలిన అన్ని పోస్టులు భర్తీ చేసేందుకు అవసరమైన ప్రక్రియ దాదాపు పూరైనట్లు అధికారవర్గాలు ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైలు కలెక్టర్‌కి పంపినట్లు సమాచారం. -
‘ప్రాథమికం'.. అయోమయం!
ప్రాథమిక విద్యను బలోపేతం చేసి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన సర్వశిక్షా అభియాన్ ప్రస్తుతం సంకటంలో పడింది. కేంద్రం ఏటా నిధులు కోత పెడుతుండడంతో క్రమంగా ఉనికి కోల్పోతున్న ఎస్ఎస్ఏకు తాజాగా రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం షాకిచ్చింది. జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పనిచే స్తున్న సెక్టోరియల్, సహాయ సెక్టోరియల్, క్లరికల్ సిబ్బందిని ఒక్కసారిగా తొలగిం చింది. డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వీరిని వెంటనే సొంత శాఖకు పంపించాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లా ఎస్ఎస్ఏలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారు ఒకట్రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు. ఇక.. ఆ కుర్చీలన్నీ ఖాళీ కావడంతో ప్రాజెక్టు కార్యక్రమాల అమలు అగమ్యగోచరంగా మారనుంది. * మూకుమ్మడిగా సెక్టోరియల్, సహాయకుల తొలగింపు * గడువు ముగిసిందంటూ డిప్యుటేషన్లు రద్దు * ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ * కొత్త నియామకాలపై స్పష్టత కరువు * అటకెక్కనున్న విద్యా కార్యక్రమాలు * సంకటంలో సర్వశిక్షా అభియాన్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో విద్యాశాఖకు సంబంధించిన పలువురు అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. హోదాకు తగినట్లు వారికి బాధ్యతలు అప్పగించారు. కమ్యునిటీ మొబిలైజేషన్ ఆఫీసర్, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికావిద్య విభాగాలకు ముగ్గురు గెజిటెడ్ ఉపాధ్యాయులు సెక్టోరియల్ అధికారులుగా పనిచేస్తున్నారు. అదే విధంగా సహాయ గణాంక అధికారి, సహాయ ప్లానింగ్ అధికారి, సహాయ పర్యవేక్షణ అధికారులుగా స్కూల్ అసిస్టెంట్లు కొనసాగుతున్నారు. ఇదే విభాగంలో నలుగు జూనియర్ అసిస్టెంట్లుగా విద్యాశాఖకు చెందిన వారున్నారు. తాజాగా వారి డిప్యుటేషన్ రద్దు చేస్తూ ఎస్పీడీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త వారిని నియమించొద్దని స్పష్టం చేశారు. టీచర్లంతా బడిలోనే పనిచేయాలనే ఆర్టీఈ నిబంధనలతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఔట్సోర్సింగ్ వాళ్లకు ఈ బాధ్యతలు అప్పగించేలా ఎస్ఎస్ఏ ఎస్పీడీ యోచిస్తున్నట్లు సమాచారం. కార్యక్రమాలు సాగేదెలా..? ఎస్ఎస్ఏలో కీలక విభాగాల అధికారుల తొలగింపుతో పలు కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. పాఠశాల యాజమాన్యాల ఏర్పాటు, బడిబాట, పిల్లల హక్కులు, స్కూల్ డ్రస్సులకు సంబంధించి కార్యక్రమాల పురోగతి అయోమయంలో పడింది. ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లలకు యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. బాలికా విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిలిచిపోనున్నాయి. వార్షిక ప్రణాళిక తయారీ, అమలు, పాఠశాలల వారీగా గణాంకాల సేకరణ.. తదుపరి కార్యచరణ.. పాఠశాలల పర్యవేక్షణ.... ఇలా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రశ్నార్థకం కానున్నాయి. కొత్తగా ఔట్సోర్సింగ్ వాళ్లను నియమించే చర్యలు తీసుకున్నా.. అందుకు మరింత సమయం పడుతుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లో పని చేస్తున్న ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను డెప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చే స్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి వెళుతున్న వారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కంట్రోలర్‌గా పనిచేస్తున్న సి.చంద్రశేఖర్‌రెడ్డి, రాజీవ్ విద్యా మిషన్‌లో అదనపు పీడీగా ఉన్న ఎం.వెంకటేశ్వర్లు, కరీంనగర్ ఎస్సార్ఎస్పీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న వి.నాగన్న, భూపరిపాలన విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్.హరీశ్‌తో పాటు వెయిటింగ్లో ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, జి.చ క్రధరరావు ఉన్నారు. -
రిలీవ్.. ఏదీ బిలీవ్!
పిల్లలకుతొలిసారిగా సమాజాన్ని.. పరిసరాలను పరిచయం చేసేది పాఠశాల. తరగతి గదిలో ఉపాధ్యాయుడే విద్యార్థికి నాయకుడు. ఉపాధ్యాయుడు ఏమి చేస్తే విద్యార్థి దాన్ని ఆచరిస్తాడు. విద్యతో పాటు విలువలు కూడా బోధించాల్సిన విద్యాశాఖలో అక్రమాలప్రాక్టికల్స్ సాగుతున్నాయి. అవినీతి రాజ్యమేలుతోంది. ఉపాధ్యాయ బదిలీలతో మన విద్యార్థులకు తొలి అవినీతి పాఠాల బోధన జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ధర్మబద్ధమైన కౌన్సెలింగ్ ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయకుండా పక్కన ఉంచేసి, పాత ముఖ్యమంత్రి పెషీలో పైరవీ చేసుకున్న వారిని రాజమార్గంలో బదిలీచేసి పైరవీ పవర్ ఏమిటో జిల్లా విద్యాశాఖ ప్రత్యక్షంగా పిల్లలకు చూపించింది. ఇక పని సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా అక్రమ డిప్యుటేషన్లుఇవ్వడంతో కొన్ని పాఠశాలలు మూత పడ్డాయి. 2013 మార్చిలో జిల్లా విద్యాశాఖ కౌన్సెలింగ్ విధానంలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది. ఉపాధ్యాయుని సీనియార్టీ, ఒక బడిలో అతను పని చేస్తున్న కాలం, బడికి ఉన్న రవాణా సౌకర్యం తదితర అంశాల పరిగణనలోకి తీసుకొని, వాటి ఆధారంగా పాయింట్లు కేటాయించి ఉపాధ్యాయుల్ని బదిలీలు చేశారు. దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా 1200 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిని ఉన్న పళంగా రిలీవ్ చేస్తే,ఉపాధ్యాయులు లేక పాఠశాల నిర్వాహణ భారమై పోతుందన్న సాకుతో విద్యాశాఖ అధికారులు దాదాపు 970 మంది ఉపాధ్యాయులను ఇప్పటి వరకు పాత స్కూళ్ల నుంచి రిలీవ్ చేయలేదు. రేపు చేస్తాం, మాపు చేస్తాం అంటూ వారిని ఏడాదిన్నరగా జరుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి అధికారులు స్పందిస్తూ.. బదిలీల విషయంపై విద్యాశాఖ కమిషన్ కార్యాలయానికి లేఖ రాశామని, లేఖకు సమాధానం వచ్చిన తర్వాత బదిలీయైన ఉపాధ్యాయుల రిలీవింగ్ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాజాగా వారి బదిలీని మరికొంత కాలం పాటు తాత్కాలికంగా నిలిపివేసి యథా స్థానంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. వారిని బదిలీ చేస్తే దాదాపు 110 పాఠశాలలు మూసివేయాల్సి వస్తుందని అధికారులు వెల్లడించారు. కొత్త డీఎస్సీ వేసి కొత్త ఉపాధ్యాయులను తీసుకున్న తర్వాతే పాత సార్లను రిలీవ్ చేయాలని నిర్ణయించారు. విద్యా వలంటీర్లతోనే బడి... దీంతో పాటు మరో 68మంది ఉపాధ్యాయులను కూడా వర్క్ అడ్జెస్టుమెంటు పేరుతో డిప్యుటేషన్లు ఇచ్చారు. ఉన్నత పాఠశాలల్లో గణితం,సైన్స్,తెలుగు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను భర్తీ చేసేందుకు నాన్ సక్సెస్ పాఠశాల్లో రెండు పోస్టింగులు ఉన్న చోట నుంచి ఒకరిని డెప్యూటేషన్‌పై వేరొక పాఠశాలకు పంపించారు. ఈ ముసుగులోనే జిల్లా విద్యాధికారి కార్యాలయం చేతివాటం చూపించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరం తెచ్చి, దక్షిణ పెట్టిన వారికి ఏ నిబంధనలు లేకుండా డెప్యుటేషన్ ఇచ్చారు. ఇటీవల రాయ్‌కోడ్ మండలం అల్లాపూర్ ప్రాథమిక పాఠశాల నుంచి ఉపాధ్యాయురాలికి డెప్యుటేషన్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా ఆమెను పటాన్ చెరు మండలం కిష్టారెడ్డిపేట పాఠశాలకు పంపించడం తో పాఠశాల మూత పడింది. గ్రామస్థులే కొంత డబ్బు జమ చేసుకొని విద్యావాలంటీర్‌ను పెట్టుకున్నారు. విద్యావాలంటీర్ నియామకంలో గ్రామసర్పంచుకు, ఎంపీటీసీకి మధ్య ఆధిపత్య పోరు ఏర్పడి రెండు నెలల కాలంలోనే ఇద్దరు వాలంటీర్లను మార్చివేశారు. పైరవీ సార్లకు ఇవేమీ ఉండవు.. ఉపాధ్యాయులను కేవలం కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే బదిలీ చేయాలనే నిబంధన ఉంది. కానీ కొంత మంది ఉపాధ్యాయులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుకొని, ముఖ్యమంత్రి కార్యాలయంతో పైరవీ చేసుకొని బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేషీ నుంచి గత ఏడాది మార్చిలో 66 మంది ఉపాధ్యాయులు అడ్డదారిలో బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కౌన్సెలింగ్ ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి సవాలక్ష కారణాలు చూపించిన అధికారులు, పైరవీకారుల వద్దకు వచ్చే సరికి రెడ్‌కార్పెట్ పరిచారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా 66 మందికి అదే నెలలో మూడు రోజులు తిరక్కుండానే రిలీవ్ ఉత్తర్వులు ఇచ్చి బదిలీ చేశారు. దీనిపై జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు వివరణ కోరగా 270 మందిని మాత్రమే రిలీవ్ చేయాల్సి ఉందని, మిగిలిన వారిని రిలీవ్ చేశామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘం నేతలు మాత్రం అవి తప్పుడు అంకెలని మొత్తం 970 మంది రిలీవ్ కాలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.