రిలీవ్.. ఏదీ బిలీవ్! | from the last one and half year 970 teachers waiting for releave | Sakshi
Sakshi News home page

రిలీవ్.. ఏదీ బిలీవ్!

Published Fri, Jan 23 2015 10:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

from the last one and half year  970 teachers waiting for releave

పిల్లలకుతొలిసారిగా సమాజాన్ని.. పరిసరాలను పరిచయం చేసేది పాఠశాల. తరగతి గదిలో ఉపాధ్యాయుడే విద్యార్థికి నాయకుడు. ఉపాధ్యాయుడు ఏమి చేస్తే విద్యార్థి దాన్ని ఆచరిస్తాడు. విద్యతో పాటు విలువలు కూడా బోధించాల్సిన విద్యాశాఖలో అక్రమాలప్రాక్టికల్స్ సాగుతున్నాయి. అవినీతి రాజ్యమేలుతోంది. ఉపాధ్యాయ బదిలీలతో మన విద్యార్థులకు తొలి అవినీతి పాఠాల బోధన జరుగుతోంది.  
  సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
 ధర్మబద్ధమైన కౌన్సెలింగ్ ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయకుండా పక్కన ఉంచేసి, పాత ముఖ్యమంత్రి పెషీలో పైరవీ చేసుకున్న వారిని రాజమార్గంలో బదిలీచేసి పైరవీ పవర్ ఏమిటో జిల్లా విద్యాశాఖ ప్రత్యక్షంగా పిల్లలకు చూపించింది. ఇక పని సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా అక్రమ డిప్యుటేషన్లుఇవ్వడంతో కొన్ని పాఠశాలలు మూత పడ్డాయి.
 2013 మార్చిలో జిల్లా విద్యాశాఖ  కౌన్సెలింగ్ విధానంలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది. ఉపాధ్యాయుని సీనియార్టీ, ఒక బడిలో అతను పని చేస్తున్న కాలం, బడికి ఉన్న రవాణా సౌకర్యం తదితర అంశాల పరిగణనలోకి తీసుకొని, వాటి ఆధారంగా పాయింట్లు కేటాయించి ఉపాధ్యాయుల్ని బదిలీలు చేశారు. దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా 1200 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిని ఉన్న పళంగా రిలీవ్ చేస్తే,ఉపాధ్యాయులు లేక  పాఠశాల నిర్వాహణ భారమై పోతుందన్న సాకుతో విద్యాశాఖ అధికారులు దాదాపు 970 మంది ఉపాధ్యాయులను ఇప్పటి వరకు పాత స్కూళ్ల

నుంచి రిలీవ్ చేయలేదు. రేపు చేస్తాం, మాపు చేస్తాం అంటూ వారిని ఏడాదిన్నరగా జరుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి అధికారులు స్పందిస్తూ.. బదిలీల విషయంపై విద్యాశాఖ కమిషన్ కార్యాలయానికి లేఖ రాశామని, లేఖకు సమాధానం వచ్చిన తర్వాత బదిలీయైన ఉపాధ్యాయుల రిలీవింగ్ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాజాగా వారి బదిలీని మరికొంత కాలం పాటు తాత్కాలికంగా నిలిపివేసి యథా స్థానంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. వారిని బదిలీ చేస్తే దాదాపు 110 పాఠశాలలు మూసివేయాల్సి వస్తుందని అధికారులు వెల్లడించారు. కొత్త డీఎస్సీ వేసి కొత్త ఉపాధ్యాయులను తీసుకున్న తర్వాతే పాత సార్లను రిలీవ్ చేయాలని నిర్ణయించారు.
 విద్యా వలంటీర్లతోనే బడి...
 దీంతో పాటు మరో 68మంది ఉపాధ్యాయులను కూడా వర్క్ అడ్జెస్టుమెంటు పేరుతో  డిప్యుటేషన్లు ఇచ్చారు. ఉన్నత పాఠశాలల్లో గణితం,సైన్స్,తెలుగు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను భర్తీ చేసేందుకు నాన్ సక్సెస్ పాఠశాల్లో రెండు పోస్టింగులు ఉన్న చోట నుంచి ఒకరిని డెప్యూటేషన్‌పై వేరొక పాఠశాలకు పంపించారు. ఈ ముసుగులోనే జిల్లా విద్యాధికారి కార్యాలయం చేతివాటం చూపించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరం తెచ్చి, దక్షిణ పెట్టిన వారికి ఏ నిబంధనలు లేకుండా డెప్యుటేషన్ ఇచ్చారు. ఇటీవల రాయ్‌కోడ్ మండలం అల్లాపూర్ ప్రాథమిక పాఠశాల నుంచి ఉపాధ్యాయురాలికి డెప్యుటేషన్ ఇచ్చారు. వర్క్ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా ఆమెను  పటాన్ చెరు మండలం కిష్టారెడ్డిపేట పాఠశాలకు పంపించడం తో పాఠశాల మూత పడింది. గ్రామస్థులే కొంత డబ్బు జమ
చేసుకొని విద్యావాలంటీర్‌ను పెట్టుకున్నారు. విద్యావాలంటీర్ నియామకంలో గ్రామసర్పంచుకు, ఎంపీటీసీకి మధ్య ఆధిపత్య పోరు ఏర్పడి రెండు నెలల కాలంలోనే ఇద్దరు వాలంటీర్లను మార్చివేశారు.
 పైరవీ సార్లకు ఇవేమీ ఉండవు..
 ఉపాధ్యాయులను కేవలం కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే బదిలీ చేయాలనే నిబంధన ఉంది. కానీ కొంత మంది ఉపాధ్యాయులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుకొని, ముఖ్యమంత్రి కార్యాలయంతో పైరవీ చేసుకొని బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేషీ నుంచి గత ఏడాది మార్చిలో  66 మంది ఉపాధ్యాయులు అడ్డదారిలో బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కౌన్సెలింగ్ ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి సవాలక్ష కారణాలు చూపించిన అధికారులు, పైరవీకారుల వద్దకు వచ్చే సరికి రెడ్‌కార్పెట్ పరిచారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా 66 మందికి అదే నెలలో మూడు రోజులు తిరక్కుండానే రిలీవ్ ఉత్తర్వులు ఇచ్చి బదిలీ చేశారు. దీనిపై జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు వివరణ కోరగా 270 మందిని మాత్రమే రిలీవ్ చేయాల్సి ఉందని, మిగిలిన వారిని రిలీవ్ చేశామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘం నేతలు మాత్రం అవి తప్పుడు అంకెలని మొత్తం 970 మంది రిలీవ్ కాలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement