అనంతపురం ఎడ్యుకేషన్: బీసీ సంక్షేమశాఖలో ఇటీవల చేసిన డిప్యుటేషన్లు వృథా ప్రయాసగా తయారయ్యాయి. అవసరం దృష్ట్యా కొందరు ఉద్యోగులను బీసీ కార్పొరేషన్‌కు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. వారి స్థానాల్లో ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్నవారు మిన్నకుండిపోవడంతో ఆయా హాస్టళ్లలో సంక్షేమం అటకెక్కుతోంది. మెనూ, బయోమెట్రిక్ అమలు అస్తవ్యస్తంగా మారుతోంది. కళ్యాణదుర్గం ఏబీసీడబ్ల్యూఓగా, ధర్మవరం డివిజన్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న నరసయ్యను, హిందూపురం ఏబీసీడబ్ల్యూఓగా, పెనుకొండ డివిజన్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న కృత్రికను డిప్యుటేషన్‌పై బీసీ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. అలాగే బీసీ సంక్షేమశాఖలో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌ను, జూనియర్ అసిస్టెంట్ రాణిని కూడా డిప్యుటేషన్‌పై కార్పొరేషన్‌కు మార్చారు. ఈ క్రమంలో బీసీ సంక్షేమశాఖకు సంబంధించి కళ్యాణదుర్గం, ధర్మవరం డివిజన్ల ఇన్‌చార్జ్ బాధ్యతలను తాడిపత్రి డివిజన్ ఏబీసీడబ్ల్యూఓ రామాంజనేయులుకు, హిందూపురం, పెనుకొండ డివిజన్ల ఇన్‌చార్జ్ బాధ్యతలను అనంతపురం ఏబీసీడబ్ల్యూఓ మల్లికార్జునకు అప్పగించారు. అయితే వీరు ఇప్పటిదాకా ఆయా డివిజన్లకు వెళ్లనేలేదు. ఒక్క హాస్టల్‌ను కూడా సందర్శించలేదు. దీంతో ఆయా హాస్టళ్లలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. దాదాపు ఏ హాస్టల్లోనూ మెనూ అమలు కావడం లేదు. కనీసం కొత్త మెనూ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.
మాతృశాఖపై మమకారం
డిప్యుటేషన్‌పై వెళ్లిన ఏబీసీడబ్ల్యూఓలు మాతృశాఖపై మమకారంతో తిరిగి వెనక్కు వచ్చేందుకు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు కూడా వారి గురించి పట్టించుకోలేదు. దీంతో వారు సొంతశాఖలో తమ పనుల్లోనే ఎక్కువగా నిమగ్నమవుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నా రోజులో ఎక్కువసేపు సంక్షేమశాఖ డీడీ కార్యాలయంలోనే ఉంటున్నారు. జూనియర్ అసిస్టెంట్ రాణిని ఇప్పటిదాకా కనీసం రిలీవ్ కూడా చేయలేదు. ఇటు బీసీ సంక్షేమం, అటు బీసీ కార్పొరేషన్ అధికారుల అలసత్వం కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు.
క్యాంపులు వెళ్తున్నారు
డిప్యుటేషన్‌పై వచ్చిన ఏబీసీడబ్ల్యూఓలు కళ్యాణదుర్గం, హిందూపురం డివిజన్లలో క్యాంపులు తిరుగుతున్నారు. అయినప్పటికీ కచ్చితంగా విధులు నిర్వర్తించాల్సిందే. ఆయా డివిజన్లలో రుణాల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఫార్వర్డ్ చేయాలి. అలాగే బ్యాంకు లింకేజీ విషయమై బ్యాంకు అధికారులతో చర్చించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలి.
– నాగముణి, బీసీ కార్పొరేషన్ ఈడీ
తిరగాలంటే ఇబ్బంది
డిప్యుటేషన్‌పై వెళ్లిన ఏబీసీడబ్ల్యూఓ స్థానాల్లో ఇన్‌చార్జ్ తీసుకున్నవారు ఆయా డివిజన్లలోని హాస్టళ్లను పర్యవేక్షించలేదనేది వాస్తవమే. ఒక్కొక్కరికి మూడు డివిజన్లు అప్పగించాం. తిరగాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఏదైనా అవసరముంటే డిప్యుటేషన్‌పై వెళ్లిన వారితోనే అనధికారికంగా సమాచారం తెప్పించుకుంటున్నాం.
– రమాభార్గవి, బీసీ సంక్షేమశాఖ డీడీ