AP CM YS Jagan Mohan Reddy Write A letter To PM Narendra Modi - Sakshi
Sakshi News home page

ఏఐఎస్‌ క్యాడర్‌ డిప్యుటేషన్‌కు ఓకే

Published Fri, Jan 28 2022 8:56 PM | Last Updated on Sat, Jan 29 2022 4:39 PM

CM YS Jagan Mohan Reddy Write A letter To PM Modi - Sakshi

సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీసు అధికారుల కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌ నిబంధనలకు సవరణల ప్రతిపాదనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సవరణలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

కేంద్రంలో కొరత లేకుండా పని చేసేందుకు రాష్ట్రాలకు చెందిన ఏఐఎస్‌ అధికారులను  డిప్యుటేషన్‌పై పంపించాలనే సవరణను స్వాగతిస్తున్నానని, అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం  లేకుండా డిప్యుటేషన్‌పై అధికారులను తీసుకోవాలనే సవరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్షన్‌ సర్టిపికెట్లను ఇచ్చి, అనుమతించిన అధికారులనే కేంద్ర డిప్యుటేషన్‌కు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఈ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఈ లేఖలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రాలకు కూడా ప్రయోజనమే కానీ..
సెంట్రల్‌ డిప్యుటేషన్లో భాగంగా తగిన సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులను అందుబాటులో ఉంచేలా ఈ సవరణలను ప్రతిపాదించినట్లు కేంద్ర డీఓపీటీ శాఖ ఇటీవల రాష్ట్రాలకు తెలిపింది. తద్వారా కేంద్ర ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వివిధ స్థాయిల్లో పని చేసే రాష్ట్ర క్యాడర్‌ ఐఏఎస్‌లు.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సహాయం చేయగలుగుతారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని నమ్ముతూ పూర్తి మద్దతు తెలుపుతున్నాను. 
► అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలకు నేతృత్వం వహించే రాష్ట్ర ఐఏఎస్‌ క్యాడర్‌ అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యక్రమాల నిర్వహణలో, వివిధ ప్రాజెక్టుల అమలులో ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు. క్లిష్టమైన ప్రాజెక్టులను, ఇతర అంశాలను నిర్వహించడానికి వారి నైపుణ్యం, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి బాధ్యతలు అప్పగిస్తుంటారు.
► కేంద్రం డిప్యుటేషన్‌ కోసం అభ్యర్థించే ఐఏఎస్‌ అధికారుల నైపుణ్యం, అనుభవం అంచనా వేశాకే రాష్ట్రం నో అబ్జెక్షన్‌ పత్రం జారీ చేస్తుంది. అలాంటి వారిని డిప్యుటేషన్‌పై పంపడం వల్ల రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది. 
► ఇది రాష్ట్ర ప్రయోజనాలను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా కేంద్ర డిప్యుటేషన్‌ రిజర్వు అవసరాలను సక్రమంగా తీర్చగలుగుతుంది. అయితే కేంద్రం తాజాగా చేసిన సవరణ ప్రతిపాదన వల్ల ఇటువంటి సౌలభ్యం రాష్ట్రాలకు దూరమవుతుంది. ఒక అధికారిని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే రిలీవ్‌ చేయాల్సి వస్తుంది. 

సరైన రీతిలో సేవలకు విఘాతం
► రాష్ట్రంలో కీలకమైన శాఖలకు, ప్రాజెక్టులకు నేతృత్వం వహిస్తున్న ఇలాంటి అధికారులు అప్పటికప్పుడు కేంద్ర డిప్యుటేషన్‌కు వెళ్లడం వల్ల రాష్ట్రం చేపట్టే ముఖ్యమైన, కీలకమైన ప్రాజెక్టులు పట్టాలు తప్పుతాయి. అధికారుల వ్యక్తిగత జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. వారి కుటుంబాలు, పిల్లల విద్య వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ అధికారి సామర్థ్యం ఉత్తమంగా ఉన్నప్పటికీ సరైన రీతిలో సేవలను అందించలేకపోవచ్చు.
► ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పై సవరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్లే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌ఓసీ జారీ చేయాల్సిన ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని అభ్యర్థిస్తున్నా. భారత్‌ను మరింత మెరుగైన దేశంగా మార్చేందుకు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అత్యధిక మద్దతు ఉంటుందని మీకు హామీ ఇస్తున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement