సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగుల డిప్యుటేషన్లపై పైరవీలు జోరందుకున్నాయి.సీడీపీఓ(శిశు అభివృద్ధి ప్రాజెక్టు) కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ , జూనియర్ అసిస్టెంట్లతో పాటు టైపిస్టులు దాదాపు 110 మందికి గతేడాది డిసెంబర్‌లో డిప్యుటేషన్లు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణను జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించడంతో సీడీపీఓ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య కుదించారు. నిర్దేశించిన సంఖ్యకు మించి ఉన్న సిబ్బందిని సంబంధిత జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ) కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. ఇలా వచ్చిన వారి సమ్మతి ఆధారంగా స్థాన మార్పిడి చేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయించింది.అనారోగ్య సమస్యలు, స్పౌజ్ వంటి కారణాలతో పాటు సిబ్బంది ఆవశ్యకత ఆధారంగా డిప్యుటేషన్లు ఇవ్వాలని భావిస్తోంది.ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. దీంతో హైదరాబాద్, వరంగల్ ఆర్జేడీ పరిధిలో ఈమేరకు దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించారు. ఇదే అదనుగా కొందరు పైరవీకారులు తమవారికి కోరిన చోట పోస్టింగ్ ఇప్పించేందుకు రంగంలోకి దిగారు.తన అనుయాయులకు అనువైన చోట పోస్టింగ్ ఇప్పించేందుకు వారు నడుంకట్టారు.
‘లక్ష’ణమైన డిప్యుటేషన్...!
సీడీపీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు టైపిస్టుల్లో ఇప్పటివరకు 110 మంది జిల్లా కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. వారంతా డీడబ్ల్యూఓలో విధుల్లో చేరారు. తాజాగా వీరి పరిస్థితి ఆధారంగా మార్పులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కుటుంబ అవసరాలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు తదితర అంశాల ఆధారంగా ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు వినతులు సమర్పిస్తున్నారు. వాటికి సంబంధిత సీడీపీఓ లేదా డీడబ్ల్యూఓ అంగీకారం ఉండాలనే నిబంధన ఉంది. దీంతో కొందరు కోరిన చోట పోస్టింగ్ కోసం సీడీపీఓలు, డీడబ్ల్యూఓలపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు సన్నిహితుడైన ఉద్యోగికి అనువైన చోట పోస్టింగ్‌కు పైరవీ ముమ్మరంగా చేస్తున్నారు. దీనికోసం కొందరు రూ.లక్ష వరకు ముట్టజెపుతున్నట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకరిద్దరు అధికారులకు ఫిర్యాదులు సైతం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment