సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో డిప్యుటేషన్ల వ్యహారం చిచ్చురేపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. సమగ్ర వివరాలు అందించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారంఊ ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా మండిపడుతున్నాయి. సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పలు సంఘాల నేతలు ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. సాధారణ బదిలీలు చేపట్టకుండా, అయినవారు, ముడుపులు ఇచ్చి న వారిని కోరుకున్న ప్రాంతానికి పంపుతు న్నారని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో టీచర్లు సిటీకి.. చదువులు గాలికి’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ వార్తపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.
కొత్త వివాదానికి దారి తీస్తున్న డిప్యుటేషన్లు
టీచర్ల డిప్యుటేషన్ అంశం అధికారుల మధ్య కొత్త వివాదానికి దారి తీస్తోంది. విద్యాశాఖలో ఉన్నతాధికారులు కొంతమంది ఈ తంతుతో తమకు సంబంధమే లేదని చెబుతున్నారు. తాను వ్యతిరేకించినా డిప్యుటేషన్ ఆర్డర్ ఎలా వచ్చిందో తెలియదని ఓ అధికారిణి తెలిపారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నా, ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోందని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, విద్యాశాఖ ఉన్నతాధికారి మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు.
ఫైల్ సంబంధిత అధికారిణి ద్వారానే తనకు వస్తుందని, ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మానవతకోణంలో బదిలీలు చేస్తున్న విషయాన్ని ఆమె ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారో తెలియడం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పరస్పరం సీఎంఓకు ఫిర్యాదులు చేసుకుంటున్న వైనం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది.
రంగంలోకి మధ్యవర్తులు
తీవ్ర విమర్శలు వస్తున్నా డిప్యుటేషన్ వ్యవహారం ఆగడం లేదు. ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు గత నెల 11వ తేదీన ఓ టీచర్‌ను డిప్యుటేషన్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవే కాకుండా మరికొన్ని డిప్యుటేషన్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యుటేషన్ల బేరసారాలు పలు జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయని టీచర్లు అంటున్నారు. అనారోగ్య సర్టీఫికెట్లు సృష్టించి మరీ డిప్యుటేషన్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారని వారు చెబుతున్నారు. కొంతమంది రాజకీయ పలుకుబడిని ముందుకు తెస్తుంటే, మరికొంతమంది తమకు విద్యాశాఖలో ఉన్నతాధికారి తెలుసునని, ఆయనకు కొంత ముట్టజెబితే డిప్యుటేషన్ సులభమని నమ్మిస్తున్నారని పలువురు టీచర్లు తెలిపారు.
ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలి
ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత పాటించి విశ్వసనీయతను కాపాడుకోవాలి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులకు డిప్యుటేషన్ పేరిట జిల్లాలు దాటించి బదిలీలు చేయటం సమంజసం కాదు. అనారోగ్యం, భార్యభర్తలు తదితర సహేతుక కారణాలతో బదిలీలు చేయాలనుకుంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని అవసరమైన, అర్హులైన ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వటం సమంజసం. ఉపాధ్యాయులు బదిలీలకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి కల్పించారు. నూతనంగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ ప్రధానకార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment