‘రెవెన్యూ’లో సిబ్బంది కొరత
– పదోన్నతుల కల్పనలో నిర్లక్ష్యం
– జాప్యంపై ఉద్యోగవర్గాల్లో అసంతృప్తి
– పట్టించుకోవడం లేదంటూ వ్యాఖ్యలు
జిల్లా యంత్రాగంలో కీలకమైన రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కొరతను అధిగమించే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారు. పదోన్నతులలో జరుగుతున్న జాప్యం... అధికారుల తీరుపై ఉద్యోగవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు దాదాపు 44 వరకు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఎస్‌ఏలకు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తే మరో 16 పోస్టులు ఖాళీ ఏర్పడతాయి. అలా మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎస్‌ఏలుగా పదోన్నతులు పొందేందుకు నిబంధనల ప్రకారం అన్ని అర్హతలూ ఉన్నవారు 50 మంది ఉన్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. జానియర్ అసిస్టెంట్లకు (జేఏ)లకు ఎస్‌ఏలుగా పదోన్నతి కల్పించడం ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేయవచ్చని పేర్కొంటున్నాయి. అయితే ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదని అంటున్నాయి.
మూడు నెలలైనా అతీగతీ లేదు
పదోన్నతులకు సంబంధించి జేఏల సీనియార్టీ జాబితాను విడుదల చేసి మూడు నెలలవుతున్నా ప్రక్రియ అమలు అతీగతీ లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. సీనియార్టీ జాబితాపై రెండు అంశాల్లో అభ్యంతరాలను 70 రోజుల్లోనే తెలిపామని జేఏలు చెబుతున్నారు. ఏపీపీఎస్‌సీ ద్వారా నేరుగా నియామకం జరిగిన వారిని సీనియార్టీలో ముందుగా చూపాలని, కారుణ్య నియామకం పొందిన వారిని తరువాతి స్థానంలో ఉంచాలనే నిబంధనను అమలు చేయాలని ఒక అభ్యంతరం, ఒకే సమయంలో ఉద్యోగంలో చేరిన వారి విషయంలో జనన తేదీని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ నిర్ధారించాలని మరో అభ్యంతరం తెలిపామంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని జేఏ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతులు కల్పించాలని ఐదు సార్లు అర్జీలు ఇచ్చినా స్పందన లేదని జేఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిప్యుటేషన్ల జోరు..
రెవెన్యూ శాఖలో డిప్యుటేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. కలెక్టరేట్‌లోని విభాగాల్లో సీనియర్ అసిస్టెంట్లు ఉండాలి. అయితే ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్లను డిప్యుటేషన్‌పై నియమించారు. ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని కూడా కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై నియమించారని చెబుతున్నారు. జిల్లాలోని 63 తహసీల్దార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు ఉండాలని, అయితే 50 శాతం కార్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటున్నారు. జూనియర్ అసిస్టెంట్లకు ఎస్‌ఏగా పదోన్నతి కల్పిస్తే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. డిప్యుటేషన్‌పై నియమించే అవసరం ఉండదని, అయితే అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఉద్యోగవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
పదోన్నతుల అంశాన్ని పరిశీలిస్తున్నాం
జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.
– సి.మల్లీశ్వరిదేవి, జిల్లా రెవెన్యూ అధికారి