అల్లాదుర్గం (మెదక్) : ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేయడంపై ఆగ్రహించిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్ కుటుంబ సభ్యులతో కార్యాలయానికి వచ్చి దాడికి యత్నించడమే కాక, పెట్రోల్ పోసి చంపుతానని బెదిరించిన సంఘటన అల్లాదుర్గంలో సోమవారం చోటు చేసుకుంది. అల్లాదుర్గం సీడీపీఓ సోమ శేఖరమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద శంకరంపేట మండలం మల్కపూర్ సెక్టార్ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శ్రీశైల శనివారం ఆమె భర్త వీరయ్య స్వామి, ఇద్దరు కూతుళ్లు, అల్లుడు కలిసి అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయానికి వచ్చి దాడికి యత్నించారు. తన చాంబర్‌లో నిర్భందించేందుకు ప్రయత్నించగా మరో గదిలోకి వెళ్లే క్రమంలో సూపర్‌వైజర్ కూతురు భుజం పట్టుకొని దాడి చేశారు.
శ్రీశైలను రేగోడ్ నుంచి పెద్ద శంకరంపేట సెక్టార్‌కు బదిలీ చేయడంతో కక్ష కట్టి దాడికి పాల్పడింది. కుటుంబ సభ్యులతో వచ్చి పెట్రోల్ పోసి చంపేస్తామని సిబ్బంది ముందే బెదిరించింది. సోమవారం సూపర్‌వైజర్ కార్యాలయ ఆవరణలోనే తిరుగుతూ ఉందని, తనపై దాడి చేసేందుకు యత్నిస్తున్నట్టు సోమ శేఖరమ్మ చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కార్యాలయానికి రాగానే సూపర్‌వైజర్ వెళ్లిపోయినట్టు తెలిపారు. ప్రాణ భయం ఉండడంతో పై అధికారులకు తెలియజేసి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సంఘటనపై సీడీపీఓ ఫిర్యాదు మేరకు శ్రీశైల భర్త శంకరయ్య, ఇద్దరు కూతుళ్లు, అల్లుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ గంగయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment