సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ వర్గాల్లో బదిలీల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల సెగ పది రోజుల్లో జిల్లాలను తాకవచ్చన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని కొందరు డీసీపీలతోపాటు వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలోని పలువురు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం తప్పదన్న చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు పదేళ్లపాటు కమిషనరేట్ పరిధిలో కీలక ఠాణాలు, సబ్‌డివిజన్‌లలో పనిచేసిన అధికారులకు బదిలీలు తప్పవంటున్నారు.
ఇటీవల ఎన్నికల్లో ఫలితాలు తారుమారవడంతో రూటు మార్చిన కొందరు ‘కౌంటింగ్ సెంటర్’లనుంచే లాబీయింగ్ మొదలెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసినప్పటికీ స్పష్టమైన హామీ దొరకలేదన్న ప్రచారం ఉంది. బదిలీలపై ప్రభుత్వ పాలసీ తేలడం లేదని దాటవేస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం లూప్‌లైన్‌లో ఉండి కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగించని అఽధికా రులను ఇప్పుడు తెరపైకి తెచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా త్వరలోనే పోలీసు అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా కమిషనరేట్‌లో పలువురికి స్థాన చలనం కలగనుంది.
బదిలీ ఎవరెవరికో..?
అసెంబ్లీతో మొదలైన ఎన్నికల ప్రక్రియ సర్పంచ్‌లు మొదలు పార్లమెంట్, జిల్లా, మండలపరిషత్‌ల వరకు సాగనుంది. వచ్చే నెలాఖరుకు క్షేత్రస్థాయిలో పాలనకు కీలకమైన సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీల వారీగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికలు తప్పవంటున్నారు.
ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖలోని వివిధ స్థాయిల అధికారుల మార్పు ఉండవచ్చని చెబుతున్నారు. కొన్ని నెలల్లో పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నవారు మినహా చాలామందికి స్థాన చలనం ఉంటుందంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కమిషనరేట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వారిని పూర్తిగా మార్చి తమకు అనుకూలమైన వారిని తీసుకొచ్చే అవకాశం ఉందని సీనియర్ కీలక ప్రజాప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు.
బదిలీల ప్రచారంలో డీసీపీలు, ఏసీపీలు..
వరంగల్ కమిషనరేట్‌లో కీలకమైన సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్‌లకు ఎంఏ బారీ, పి.రవిందర్, పి.సీతారాంలు డీసీపీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పోటాపోటీ ప్రయత్నాల మధ్య ఈ పోస్టింగ్‌లు సాధించారన్న ప్రచారం ఉంది. ఈ మూడు జోన్ల పరిధిలోని 9 సబ్ డివిజన్లలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)లు పలువురు గత ప్రభుత్వం హయాంలో బీఆర్‌ఎస్ నేతలతో అంటకాగారన్న ఆరోపణలు ఉన్నాయి.
సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్‌ల పరిధిలోని ఇద్దరు ఏసీపీలు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదులున్నాయి. ఈస్ట్‌జోన్‌లోని ఓ ఏసీపీపైనా ఇవే ఆరోపణలు ఉన్నాయి. కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఏసీపీలకు ఎన్నికలకు ముందు బదిలీ అయినా.. బీఆర్‌ఎస్ పెద్దల ప్రమేయంతో తిరిగి ఆ బదిలీలను రద్దు చేసుకుని అవే స్థానాల్లో కొనసాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులకు దగ్గరగా ఉండేవారిని బెదిరింపులకు గురి చేశారన్న ఫిర్యాదులున్నాయి.
అదే విధంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట, నర్సంపేట, పరకాల, మామునూరు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట సబ్ డివిజన్ల పరిధిలో పని చేసిన కొందరు ఇన్‌స్పెక్టర్లు అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి వ్యతిరేక పార్టీకి చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వారు సైతం మంచి పోస్టింగ్‌ల్లో కొనసాగేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతుండటం పోలీస్‌శాఖలో చర్చనీయాంశం అవుతోంది.
బాస్ మార్పు ఉంటుందా...?
ఎన్నికల సంఘం ఆదేశానుసారం షెడ్యూల్ విడుదల అనంతరం పలు కమిషనరేట్‌లు, జిల్లాలకు నాన్ కేడర్ అధికారుల స్థానంలో ఐపీఎస్ అధికారులను పోలీస్ బాస్‌లుగా నియమించారు. ఈ క్రమంలో వరంగల్ సీపీగా ఉన్న ఏవీ రంగనాథ్ అక్టోబర్ 11న బదిలీ కాగా ఆయన స్థానంలో అంబర్ కిషోర్ ఝాను నియమించారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న సీపీ అంబర్ కిషోర్‌కు నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారనే పేరుంది. అధి కార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుతీరును పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో వారే కొనసాగుతారా..? కొత్తవారు వస్తారా అనేది కొంతకాలం ఆగితేనే తెలుస్తుంది.
ఇవి చదవండి: ‘రాజకీయ బదిలీ’లపై కొత్త పోలీసు కమిషనర్ల దృష్టి
Comments
Please login to add a commentAdd a comment