సాక్షిప్రతినిధి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల కోసం ముందస్తుగా బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. ఇప్పుడు రాజకీయ పరిశీలకుల దృష్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపు మళ్లింది. అధికార బీఆర్‌ఎస్ జనగామ మినహా 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు సన్నద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ఈ నెల 18న మొదలైన ఈ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుండగా ఉమ్మడి వరంగల్‌లో ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలు మినహా 11 అసెంబ్లీ స్థానాల నుంచి టికెట్ కోసం ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. 25వ తేదీ తర్వాత దరఖాస్తులను పరిశీలించనున్న ఏఐసీసీ, సీడబ్ల్యూసీ, టీపీసీసీలు.. త్వరలోనే అభ్యర్థులను సైతం ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్‌లో లాబీయింగ్ ముమ్మరం చేశారు.
దరఖాస్తుల నుంచే వివాదాలకు ఆజ్యం..
దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితాను డీసీసీ, టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలు ఢిల్లీకి పంపేందుకు కూడా ఏర్పాట్లు జరిగాయి. దరఖాస్తుల దాఖలునుంచే కొన్ని నియోజకవర్గాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇది అధిష్టానానికి తలనొప్పిగా మారనుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందన్న సమయంలో జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం అప్పట్లో వివాదాస్పదమైంది. తాజాగా నాయినితోపాటు జంగా కూడా టికెట్ కోసం మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు.
జనగామ నుంచి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య గురువారం దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ తూర్పు టికెట్ కోసం బుధవారం కొండా సురేఖ దరఖాస్తు చేయనుండగా.. అదే రోజు వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అప్లికేషన్ పెట్టుకోనున్నారు. వర్ధన్నపేట నుంచి నమిండ్ల శ్రీనివాస్‌తోపాటు మాజీ పోలీస్ అధికారి కేఆర్.నాగరాజు దరఖాస్తు చేసుకోగా.. ఇక్కడినుంచి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా ఆశిస్తున్నారు.
పోటాపోటీగా దరఖాస్తులు..
ఉమ్మడి వరంగల్‌లో ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలు మినహా అన్ని స్థానాల నుంచి ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తులు చేస్తున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ దొమ్మాటి సాంబయ్య స్టేషన్ ఘన్‌పూర్ నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన తిరుగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సింగపురం ఇందిర ఆ తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నా.. మరోసారి టికెట్ కోసం శుక్రవారం దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిసింది.
పరకాల నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి టికెట్ ఆశిస్తుండగా.. కొండా మురళీధర్‌రావు కూడా బుధవారం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. డోర్నకల్ నియోజకవర్గం నుంచి యువ పారిశ్రామిక వేత్త నునావత్ భూపాల్ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడినుంచి మరో ముగ్గురు సీనియర్లు నేడు, రేపు దరఖాస్తు చేయనున్నారు.
మహబూబాబాద్ నుంచి అవకాశం ఇవ్వాలని కేంద్రమాజీ మంత్రి బలరాంనాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, డాక్టర్ మురళీనాయక్ అధిష్టానాన్ని కలిసి టికెట్ కోరారు. కాగా, హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితోపాటు ఒంటెల లింగారెడ్డి కూడా టికెట్ కోసం మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. మరో రెండు రోజుల గడువు ఉండటంతో ఇంకా కూడా దరఖాస్తులు దాఖలు కానున్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిల్లో లాబీయింగ్ ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment