కాంగ్రెస్.. కమలం పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు
వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై వీడని ఉత్కంఠ
ఎటూ తేల్చలేకపోతున్న హైకమాండ్
పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో తాత్సారం
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మొదలైన వెంటనే వరంగల్ ఎంపీ స్థానానికి బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ ముఖ్యుల్లో భేదాభిప్రాయాలున్నా.. అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కడియం కావ్యను ఖరారు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నాయి.
అభ్యర్థులను ప్రకటించేందుకు చేపట్టిన కసరత్తు తుది దశకు చేరే సమయంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతుండడంతో బ్రేక్ పడుతోంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ కీలక స్థానం కావడంతో బలమైన వ్యక్తులను బరిలో దింపేందుకు ఆ రెండు పార్టీలు యోచిస్తున్నందుకే తాత్సారం జరుగుతోంది. బీజేపీ ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ హోలీ తర్వాతే అని అనడంతో అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
గెలుపే లక్ష్యంగా..
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం విషయంలో ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాలోతు కవిత, అజ్మీరా సీతారాంనాయక్, పోరిక బలరాంనాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించాయి. వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
వరంగల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు జిల్లాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. స్టేషన్‌ఘన్‌పూర్ మినహా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బీజేపీ విషయానికొస్తే మొదట మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మంద కృష్ణమాదిగ తదితరుల పేర్లు వినిపించగా.. ఇటీవలే బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కమలం గూటికి చేరడంతో సమీకరణలు, అంచనాలు తారుమారయ్యాయి.
అదే విధంగా కాంగ్రెస్‌లో అద్దంకి దయాకర్ తర్వాత దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, సింగపురం ఇందిర పేర్లను మెజార్టీ నేతలు సూచించగా.. తాజాగా వరంగల్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అభ్యర్థి ప్రకటన విషయంలో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ పునరాలోచనలో పడింది.
‘హస్తిన’లోనే తుది నిర్ణయం.. బీజేపీలో అదే పరిస్థితి
కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు 64 మంది దరఖాస్తు చేసుకోగా.. అర డజన్ మందికి పైగా సీరియస్‌గా పోటీపై ఆసక్తి చూపుతున్నారు. దొమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిర, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, ఎంపీ పసునూరి దయాకర్, హరికోట్ల రవి తదితరులు ఇంకా తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సహా కొందరు మంత్రులు.. ఎమ్మెల్యేలను కలిసిన పైన పేర్కొన్న ఆశావహులందరి ఆశలను సైతం కొట్టేయడం లేదు. దీంతో ఎవరికి వారుగా టికెట్ కోసం ఆశ పడుతుండగా.. పీఈసీ మాత్రం ముగ్గురు పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపించగా.. ఢిల్లీలో త్వరలోనే తుది నిర్ణయం జరుగుతుందంటున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్, మంద కృష్ణమాదిగ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బొజ్జపల్లి సుభాశ్‌లో ఒకరికి టికెట్ వస్తుందని భావించారు. అయితే.. ఈనెల 12న ఆ పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీలో చేరారు. దీంతో ఆయనకే దాదాపు వరంగల్ టికెట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు కాకుండా.. ఇటీవల పార్టీలో చేరిన వారికే టికెట్ ఇచ్చే పరిస్థితులు ఆ రెండు పార్టీలకు అనివార్యంగా మారాయి. ఈనేపథ్యంలో ఆశావహులు, పార్టీ కేడర్ నుంచి నిరసనలు ఎదురుకాకుండా ఉండేందుకు వారిని బుజ్జగించిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే ఉద్దేశంతో రెండు పార్టీలున్నాయి.
ఇవి చదవండి: బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్
Comments
Please login to add a commentAdd a comment