సాక్షి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలనుకుంటున్న బీఆర్‌ఎస్‌కు జిల్లాలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కొందరు పార్టీ ముఖ్యులతోపాటు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఇందుకు ఉదాహరణే ఇటీవల నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో పుట్టిన ముసలమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల అనైక్యతా రాగాలు ఆ పార్టీకి బీటలు పడేలా చేస్తున్నాయి.
చైర్మన్ల ఒంటెద్దు పోకడలు, ఏ విషయంలోనూ తమను పట్టించుకోవడం లేదని అప్పట్లో తమ ఎమ్మెల్యేల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. ఇప్పుడు వారే గళమెత్తుతుండడంతో ఆ పార్టీకి ఏంచేయాలో పాలుపోవడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు మాజీలు కావడంతో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ గుంటి రజనిపై అవిశ్వాసం వీగిపోయినా కూడా ఆ పార్టీలో అలజడి చెలరేగింది. ఏకంగా 13 మంది కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో గులాబీ పార్టీకి ఊహించని దెబ్బ తగిలినట్లయ్యింది. అదేకోవలో ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం ఎటువైపు దారి తీస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
12 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 9 మంది చైర్‌పర్సన్ ఆంగోతు అరుణపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ జనవరి 11న కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం సృష్టించిన రగడ ఆ పార్టీలో పెద్ద కలకలం రేపుతుండగా.. ఇక వర్ధన్నపేటలో రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందోనని గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అప్పట్లో అధికారం అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లను నియంత్రించారు. ఇప్పుడు వారు మాజీలు కావడంతో ఎవరిని నియంత్రించలేక పోతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
అరూరికి కష్టకాలమేనా?
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను నియంత్రించడం కత్తిమీద సాముగా మారింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం కూడా ఆయనను టెన్షన్ పెట్టిస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి పేరును కూడా బీఆర్‌ఎస్ పరిగణనలోకి తీసుకునే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు పార్టీ జిల్లా బాధ్యతలు ఆయనకు తలనొప్పిగా మారాయని సమాచారం. ఒక్కొక్కరు సొంత పార్టీ వారిపైనే అవిశ్వాసం పెడుతుండడంతో అరూరితోపాటు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా పరిణమించిందని తెలుస్తోంది.
ఈ ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా ముఖ్య నాయకులు ఏకతాటిపైకి వచ్చి అసంతృప్తులను నిలువరిస్తేనే పార్టీకి ఎంపీ ఎన్నికల్లో అవకాశాలుంటాయని, లేకపోతే పెద్ద మొత్తంలో ఎదురు దెబ్బతగిలే అవకాశముందని శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఎరబ్రెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లాకు చెందిన వారు కావడంతో బీఆర్‌ఎస్ బలోపేతంపై దృష్టిసారించాలని కార్యకర్తలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment