ఎట్టకేలకు ప్రకటించిన అధిష్టానం
ఇటీవలే కమలం పార్టీలో చేరిన రమేశ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) పార్టీ నుంచి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఓటమికి సొంత పార్టీకి చెందిన వారే కొందరు కోవర్టుగా పని చేశారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోగా.. కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్ రావు కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు. అయినప్పటికీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రమేశ్ రాజీనామా చేశారు.
‘అరూరి’ రాజకీయ ప్రస్థానం..
అరూరి రమేశ్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరఫున స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2015 జనవరి 10 నుంచి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై హౌస్ కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2022 జనవరి 26న టీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
అనంతరం ఈనెల 16న బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. సుమారు ఆరు రోజులపాటు వరంగల్ పార్లమెంట్ పరిధి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసిన అనంతరం ఏకాభిప్రాయంతో పార్టీ అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment