aruri ramesh
-
బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’..
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నుంచి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఓటమికి సొంత పార్టీకి చెందిన వారే కొందరు కోవర్టుగా పని చేశారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోగా.. కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్ రావు కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు. అయినప్పటికీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రమేశ్ రాజీనామా చేశారు. ‘అరూరి’ రాజకీయ ప్రస్థానం.. అరూరి రమేశ్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరఫున స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2015 జనవరి 10 నుంచి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై హౌస్ కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2022 జనవరి 26న టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం ఈనెల 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. సుమారు ఆరు రోజులపాటు వరంగల్ పార్లమెంట్ పరిధి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసిన అనంతరం ఏకాభిప్రాయంతో పార్టీ అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
తర్జన భర్జన! తెరపైకి రోజుకో పేరు..
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మొదలైన వెంటనే వరంగల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ ముఖ్యుల్లో భేదాభిప్రాయాలున్నా.. అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కడియం కావ్యను ఖరారు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించేందుకు చేపట్టిన కసరత్తు తుది దశకు చేరే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతుండడంతో బ్రేక్ పడుతోంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ కీలక స్థానం కావడంతో బలమైన వ్యక్తులను బరిలో దింపేందుకు ఆ రెండు పార్టీలు యోచిస్తున్నందుకే తాత్సారం జరుగుతోంది. బీజేపీ ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ హోలీ తర్వాతే అని అనడంతో అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాలోతు కవిత, అజ్మీరా సీతారాంనాయక్, పోరిక బలరాంనాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించాయి. వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు జిల్లాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. స్టేషన్‌ఘన్‌పూర్ మినహా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బీజేపీ విషయానికొస్తే మొదట మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మంద కృష్ణమాదిగ తదితరుల పేర్లు వినిపించగా.. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కమలం గూటికి చేరడంతో సమీకరణలు, అంచనాలు తారుమారయ్యాయి. అదే విధంగా కాంగ్రెస్‌లో అద్దంకి దయాకర్ తర్వాత దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, సింగపురం ఇందిర పేర్లను మెజార్టీ నేతలు సూచించగా.. తాజాగా వరంగల్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అభ్యర్థి ప్రకటన విషయంలో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ పునరాలోచనలో పడింది. ‘హస్తిన’లోనే తుది నిర్ణయం.. బీజేపీలో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు 64 మంది దరఖాస్తు చేసుకోగా.. అర డజన్ మందికి పైగా సీరియస్‌గా పోటీపై ఆసక్తి చూపుతున్నారు. దొమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిర, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, ఎంపీ పసునూరి దయాకర్, హరికోట్ల రవి తదితరులు ఇంకా తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా కొందరు మంత్రులు.. ఎమ్మెల్యేలను కలిసిన పైన పేర్కొన్న ఆశావహులందరి ఆశలను సైతం కొట్టేయడం లేదు. దీంతో ఎవరికి వారుగా టికెట్ కోసం ఆశ పడుతుండగా.. పీఈసీ మాత్రం ముగ్గురు పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపించగా.. ఢిల్లీలో త్వరలోనే తుది నిర్ణయం జరుగుతుందంటున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్, మంద కృష్ణమాదిగ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బొజ్జపల్లి సుభాశ్లో ఒకరికి టికెట్ వస్తుందని భావించారు. అయితే.. ఈనెల 12న ఆ పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీలో చేరారు. దీంతో ఆయనకే దాదాపు వరంగల్ టికెట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు కాకుండా.. ఇటీవల పార్టీలో చేరిన వారికే టికెట్ ఇచ్చే పరిస్థితులు ఆ రెండు పార్టీలకు అనివార్యంగా మారాయి. ఈనేపథ్యంలో ఆశావహులు, పార్టీ కేడర్ నుంచి నిరసనలు ఎదురుకాకుండా ఉండేందుకు వారిని బుజ్జగించిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే ఉద్దేశంతో రెండు పార్టీలున్నాయి. ఇవి చదవండి: బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ -
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సమక్షంలో ఆరూరి కాషాయకండువా కప్పుకున్నారు. కాగా, ఆరూరి రమేష్ ఆదివారం బీజేపీలో చేరాలరు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి బీజేపీ కండువా కప్పి రమేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రమేష్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు, వరంగల్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆరూరి నిన్న బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆరూరి వరంగల్ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు. కాగా, బీజేపీ ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో వరంగల్ సీటు అభ్యర్థిని ప్రకటించలేదు. -
పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జెట్ స్పీడ్ వేగంతో మారిపోతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఏ క్షణంలోనైనా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ఆరూరి విషయంలో నిన్న(బుధవారం) హైడ్రామా జరిగింది. ఆరూరి బీజేపీలో చేరుతున్నాయనే సమాచారం రావడంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహా పలువురు నేతలు వెళ్లారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య ఆరూరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆరూరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆరూరి మాట్లాడినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. దీంతో, ఆరూరి బీఆర్ఎస్ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇక, అంతకుముందే ఆరూరి.. బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరూరి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా ఆరూరి కలిసే అవకాశం ఉంది. అనంతరం, ఆరూరి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
పార్టీ మారను..ఆరూరి రమేష్ క్లారిటీ
-
‘నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. బీఆర్ఎస్లోనే ఉన్నా’
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజులుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీ మారి బీజేపీలో చేరుతున్నారని చర్చ జరిగింది. ఆయన పార్టీ మార్పుపై వరంగల్‌లో ఈరోజు హైడ్రామా కొనసాగింది. ఏకంగా ఆయన్ను బీజేపీలో చేరకుండా బీఆర్ఎస్ నాయకులే కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరూరి.. బీఆర్ఎస్ పార్టీ సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మీడయాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్లోనే కోనసాగుతున్నా. అమిత్ షాను కలవలేదు.. కానీ, బీజేపీ నాయకులను మాత్రమే కలిశాను. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’ అని ఆరూరి స్పష్టత ఇచ్చారు. -
లోక్‌సభ ఎన్నికల పోటీపై ఆరూరి ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఏం కేసీఆర్ సమావేశం ముగిసింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదించగా.. ఆయన పోటీకి విముఖత చూపించారు. మరోసారి అవకాశం ఇవ్వాలని సిట్టింగ్ ఎంపీ దయాకర్ కోరగా.. త్వరలోనే నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ బదులిచ్చారు. అటు అనవసర నిర్ణయాలతో భవిష్యత్ పాడు చేసుకోవద్దని పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న ఆరూరి రమేశ్‌కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. భేటీకి ముందు బీజేపీ చేరినట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పందించారు. ‘నేను ఏ బీజేపీ నేతలను కలవలేదు. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’అని ఆరూరి తెలిపారు. అయితే గత రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆరూరి రమేష్‌ను బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్‌రావు హైదరాబాద్ తీసుకురావటంతో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. -
BRS: ఆరూరి ఇంటి వద్ద హైడ్రామా.. బీజేపీ నేతలు సీరియస్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు. ఇక, పరిణామాలపై బీజేపీ నేత సీతారాం నాయక్ స్పందించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరూరి రమేష్ ఇంటి వద్ద చోటుచేసుకున్న పరిణామాలు నాటకీయంగా ఉన్నాయి. నిన్న(మంగళవారం) అమిత్ షాను కలిసి బీజేపీలో చేరేందుకు రమేష్ రెడీ అయ్యారు. ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీలో జాయిన్ అవుతున్నా అని ప్రకటిస్తున్నానని మాకు చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లి ప్రవర్తించిన తీరు సరికాదు. రమేష్ తన ఇష్టంతో సొంత నిర్ణయం తీసుకుంటే వీరికి వచ్చిన బాధేంటి?. బీఆర్ఎస్ నేతలు రమేష్ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు చూస్తున్నారు. గతంలో నా రాజకీయ జీవితం కూడా బీఆర్ఎస్ నేతలే నాశనం చేశారు. నాకు BRS చేసిన అన్యాయంపై 151 బుక్స్ రాయవచ్చు. దళితులకు వీళ్ళు గతంలో ఏమి చేశారని ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ వాళ్లు ఎం హామీ ఇస్తారు?. గతంలో ఎప్పుడైనా ఆరూరికి ఎర్రబెల్లి మద్దతుగా ఉన్నాడా?. ఆరూరి జీవితంతో ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నేతలు ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి! అరూరికి కష్టకాలమేనా?
సాక్షి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలనుకుంటున్న బీఆర్ఎస్కు జిల్లాలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కొందరు పార్టీ ముఖ్యులతోపాటు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఇందుకు ఉదాహరణే ఇటీవల నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో పుట్టిన ముసలమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లో కార్పొరేటర్ల అనైక్యతా రాగాలు ఆ పార్టీకి బీటలు పడేలా చేస్తున్నాయి. చైర్మన్ల ఒంటెద్దు పోకడలు, ఏ విషయంలోనూ తమను పట్టించుకోవడం లేదని అప్పట్లో తమ ఎమ్మెల్యేల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. ఇప్పుడు వారే గళమెత్తుతుండడంతో ఆ పార్టీకి ఏంచేయాలో పాలుపోవడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు మాజీలు కావడంతో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గుంటి రజనిపై అవిశ్వాసం వీగిపోయినా కూడా ఆ పార్టీలో అలజడి చెలరేగింది. ఏకంగా 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో గులాబీ పార్టీకి ఊహించని దెబ్బ తగిలినట్లయ్యింది. అదేకోవలో ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం ఎటువైపు దారి తీస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. 12 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 9 మంది చైర్పర్సన్ ఆంగోతు అరుణపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ జనవరి 11న కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం సృష్టించిన రగడ ఆ పార్టీలో పెద్ద కలకలం రేపుతుండగా.. ఇక వర్ధన్నపేటలో రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందోనని గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అప్పట్లో అధికారం అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లను నియంత్రించారు. ఇప్పుడు వారు మాజీలు కావడంతో ఎవరిని నియంత్రించలేక పోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అరూరికి కష్టకాలమేనా? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను నియంత్రించడం కత్తిమీద సాముగా మారింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం కూడా ఆయనను టెన్షన్ పెట్టిస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి పేరును కూడా బీఆర్ఎస్ పరిగణనలోకి తీసుకునే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు పార్టీ జిల్లా బాధ్యతలు ఆయనకు తలనొప్పిగా మారాయని సమాచారం. ఒక్కొక్కరు సొంత పార్టీ వారిపైనే అవిశ్వాసం పెడుతుండడంతో అరూరితోపాటు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా పరిణమించిందని తెలుస్తోంది. ఈ ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా ముఖ్య నాయకులు ఏకతాటిపైకి వచ్చి అసంతృప్తులను నిలువరిస్తేనే పార్టీకి ఎంపీ ఎన్నికల్లో అవకాశాలుంటాయని, లేకపోతే పెద్ద మొత్తంలో ఎదురు దెబ్బతగిలే అవకాశముందని శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఎరబ్రెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లాకు చెందిన వారు కావడంతో బీఆర్ఎస్ బలోపేతంపై దృష్టిసారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇవి చదవండి: వినతులు పెండింగ్ ఉండొద్దు! : మంత్రి పొంగులేటి -
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం ఈ అభ్యర్థికి హ్యాట్రిక్ లభించనుందా..!
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం వర్ధన్న పేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆరూరి రమేష్ రెండోసారి విజయం సాదించారు.ఆయనకు 97670 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2014లో ఆయనకు 86వేలపైచిలుకు మెజార్టీ వస్తే 2018లో అది ఇంకా పెరిగింది. రమేష్ తన సమీప తెలంగాణ జనసమితి ప్రత్యర్ధి పి.దేవయ్యపై విజయం సాధించారు. మహాకూటమిలో బాగంగా ఇక్కడ టిజెఎస్ పోటీచేసింది.బిజెపి పక్షాన పోటీచేసిన కె.సారంగారావుకు సుమారు 5400 ఓట్లు వచ్చాయి.రమేష్ కు 128764 ఓట్లు రాగా, దేవయ్యకు 31094 ఓట్లు వచ్చాయి. వర్ధన్న పేట నియోజకవర్గంలో 2014లో అప్పటి సిటింగ్ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే కె.శ్రీధర్‌ను ఆరూరి రమేష్ 86349ఓట్ల తేడాతో ఓడిరచారు. రమేష్ 2009లో స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయినా, 2014, 2018లలో వర్దన్నపేట నుంచి విజయం సాధించారు. ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్యక్షుడు మందకృష్ణ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసి 2014లో ఇక్కడ పోటీచేసినా 20526 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి చెందారు. రెండువేల తొమ్మిదిలో మందకృష్ణ ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. కాగా 2009లో ఇక్కడ టిఆర్ఎస్ తరపున పోటీచేసిన సీనియర్ నేత విజయరామారావు తదుపరి పరిణామాలలో కాంగ్రెస్ ఐలో చేరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లో ఆయన ఘనపూర్ నుంచి గెలిచి టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. కొంతకాలం వై.ఎస్. మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికలలో వర్ధన్నపేటలో పోటీచేసి పరాజితులయ్యారు. ఈయన గతంలో మెదక్‌జిల్లా గజ్వేలు నుంచి ఒకసారి గెలిచారు. అలాగే సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి వర్ధన్నపేట దళితులకు రిజర్వు అయింది. దాంతో అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి కి మారి మరో మూడుసార్లు గెలిచి మొత్తం ఆరుసార్లు గెలిచిన నేతగా గుర్తింపు పొందారు. దయాకరరావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు గెలిచారు. దయాకరరావు2008లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. దయాకరరావు కొంతకాలం విప్‌గా పనిచేశారు. తెలంగాణ తొలి శాసనసభలో టిడిపి పక్ష నేత అయ్యారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి మారి, 2018 ఎన్నికలలో ఆ పార్టీ పక్షాన గెలిచి మంత్రి అయ్యారు. వర్ధన్నపేటలో ఒకసారి ఇండిపెండెంటుగా, మరోసారి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరుపున గెలిచిన టి.పురుషోత్తంరావు ఇంకోసారి వరంగల్ నుంచి కాంగ్రెస్ ఐ తరుపున గెలిచారు. అప్పట్లో తెలంగాణ వాదిగా వున్న పురుషోత్తంరావు, ఆ తర్వాత కాలంలో కోట్ల విజయ భాస్కరరెడ్డి క్యాబినెట్‌లోను, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చాక మారుమూల ప్రాంతాల అభివృద్ధి కమిటీ ఛెర్మన్గాను పనిచేశారు. ఇక్కడ నుంచి మాచర్ల జగన్నాథం ఒకసారి జనతా పక్షాన, మరోసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. వర్ధన్నపేటలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, ఎన్‌టిపిఎస్ ఒకసారి, జనతా ఒకసారి గెలవగా, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. 1952లోవర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ సీట్లను, వరంగల్ లోక్‌సభ సీటును గెలిచిన పెండ్యాల రాఘవరావు అసెంబ్లీ సీట్లను వదిలి లోక్‌సభకు వెళ్ళారు. వర్ధన్నపేట జనరల్‌గా ఉన్నప్పుడు ఆరుసార్లు వెలమ, రెండుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసిలు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి ఇతరులు గెలిచారు. వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయం కూల్చివేత
సాక్షి, వరంగల్ : వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు చెందిన హన్మకొండ హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం కూల్చివేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగగా నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలే కారణమని గుర్తించారు. ఇందులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ఉన్నట్లు ఇటీవల తేల్చారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి ఆదేశాలతో డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్మాణాన్ని పాక్షికంగా తొలగించారు. కాగా, నాలా విస్తరణ కోసం కార్యాలయ భవనాన్ని తొలగించడానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కాగా వరంగల్‌లో వరదల సంభవించిన సమయంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. (నాలాల ఆక్రమణపై కేటీఆర్ సీరియస్) నాలాలపై కొనసాగుతున్న కూల్చివేత వరంగల్ నగరంలోని నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, ప్రహారీల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం భద్రకాళి, ములుగు రోడ్డు, నయీంనగర్ నాలాలపై ఉన్న 22 ఆక్రమణలను బల్దియా సిబ్బంది తొలగించారు. ఇప్పటి వరకు 88 ఆక్రమణలు కూల్చివేసినట్లు ఏసీపీలు ప్రకాశ్ రెడ్డి, సాంబయ్య తెలిపారు. (ఓరుగల్లుపై కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ!) -
‘అరూరి’కి నిరసన సెగ
సాక్షి, వర్ధన్నపేట: వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్‌కు మంగళవారం నిరసన సెగ తగిలింది. మండలంలోని ఉప్పరపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న ఆయనను కాలనీవాసులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం అభివృద్ధి పనులు చేశారని, వెంటనే వెనక్కి వెళ్లాలని ‘అరూరి’ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఊహించని ఘటన చోటుచేసుకోవడవంతో పోలీసులు కాలనీ యువకులను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యువకుల ఆందోళన, పోలీసుల చర్యలతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో ప్రచార సభలో మాట్లాడినంత సేపు పోలీసులు ఆందోళనకారులను దగ్గరికి రాకుండా నిలువరించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం చేసిన వారికి బిల్లులు రాలేదని గ్రామ సర్పంచ్ దిగమింగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అప్పులు చేసి మరుగుదొడ్లు నిర్మించుకుంటే వచ్చిన మరుగుదొడ్లు బిల్లులు కాజేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కాలనీ యువకులు సీనపెల్లి కృష్ణ, శ్రీనివాస్, రాజు, సందీప్ మాట్లాడుతూ గ్రామంలో ఒక్కరోజైనా దళితకాలనీని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అరూరి రమేష్ సందర్శించారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల సాగు భూమి, ఇంటికో ఉద్యోగం అని మాయ మాటలు చెప్పి గ్రామంలో ఏమి చేశారని ఓటెయ్యాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో అరూరి రమేష్‌కు బుద్ధిచెప్పే విధంగా ఓడించి తమ సత్తా చూపుతామన్నారు. వీరి వెంట కాలనీ వాసులు సీనపెల్లి రాజు, బాస్కూరి రాజేందర్, కుమార్, అనిల్ గ్రామ పెద్దలు ఉన్నారు. -
హౌసింగ్ సొసైటీల అక్రమాలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో జరుగుతున్నఅక్రమాలకు చెక్ పెట్టే దిశలో కార్యాచరణ వేగం పుంజుకుంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఏర్పాటైన శాసన సభ కమిటీ (హౌస్ కమిటీ) గురువారం అసెంబ్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ ఆరూరి రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సరైన సమాచారం ఇవ్వకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ సొసైటీల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ఆరా తీసేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరపాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. వచ్చే నెల 1న మరోసారి భేటీ కావాలని, అదే రోజు జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ సొసైటీల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆయా సొసైటీల్లో అక్రమంగా భూములు చేజిక్కించుకుని నిర్మించిన పెద్ద భవనాలు, వాటి యజమానుల వివరాలను కూడా బయట పెట్టాలన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ద్వారా సమాచారం సేకరించామని, వాస్తవాలు రాబట్టి పూర్తి స్థాయి నివేదికను శాసనసభకు అందజేస్తామని రమేశ్ పేర్కొన్నారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
వరంగల్: వరంగల్ మండలంలోని శ్రీసాయినగర్‌కాలనీలో సీసీ రోడ్డు పనులను స్థానిక వర్ధన్న పేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల విలువైన రోడ్డు పనులను విడుదల చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఇటీవల సంక్రాంతి సందర్భంగా కాలనీలో నిర్వహించిన ముగ్గులు పోటీలు, ఆటల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో స్థానిక జడ్పీటీసీ నాయకులు పాల్గొన్నారు. (రంగశాయిపేట) -
కరువు పొంచి ఉంది: టీఆర్ఎస్ జిల్లా నేతలు
సీఎంకు విన్నవించిన టీఆర్ఎస్ జిల్లా నేతలు వరంగల్ : వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో కరువు నెలకొనే ప్రమాదం పొంచి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా టీఆర్ఎస్ నేతలు విన్నవించారు. సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎంను హైదరాబాద్‌లో సోమవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చందూలాల్, పార్టీ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. జిల్లాలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని, దీని వల్ల రైతాంగం ఇబ్బందులపాలవుతున్నారని వివరించారు. వర్షాలు లేక ఎండుతున్నాయని, తాగునీటి సమస్య ఏర్పడుతున్నదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు. -
రేపు టీఆర్ఎస్ సభ
వరంగల్, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ బహిరంగ సభాస్థలం మా రింది. సభ నిర్వహణ గురువారమే ఖాయమైనప్పటికీ... ఎన్నికల అధికారుల అభ్యంతరాలతో హన్మకొండ నుంచి మడికొండకు షిఫ్ట్ అరుుంది. ముందుగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించాలని భావించినప్పటికీ... భారీ జనం వస్తారని, వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, అంతేకాకుండా ప్రభుత్వ విద్యాసంస్థ ప్రాంగణంలో సభ నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో నగర శివారు మడికొండలోని టీఎన్జీవోస్ గ్రౌండ్లో సభ ఏర్పాటుకు టీఆర్ఎస్ నేతలు మంగళవారం సన్నాహాలు మొదలుపెట్టారు. సభా స్థలాన్ని చదును చేసే పనులును ముమ్మరం చేశారు. ఈ బహిరంగ సభకు టీఆ ర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. 17న సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానుండగా... కేసీఆర్ హెలికాప్టర్లో రానున్నారు. ఈ మేరకు హన్మకండలోని జేఎస్ఎం పాఠశాలలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఇక్కడకు చేరుకుని సభాస్థలికి వెళ్లనున్నారు. ఆరూరిపైనే భారం సభ నిర్వహణ వ్యయం వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్‌పైనే వేసినట్లు సమాచారం.తన నియోజకవర్గ పరిధిలో సభ నిర్వహిస్తున్నందున ఎన్నికల్లో ఆయనకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నందున ఈ భారం మోపినట్లు తెలిసింది. హన్మకొండలో సభ జరిగితే ఐదు నియోజకవర్గాలు వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ, తూర్పు, పరకాలపై ప్రభావం చూపేదని... ఇప్పుడు వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన మిగతా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.