వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం
వర్ధన్న పేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆరూరి రమేష్ రెండోసారి విజయం సాదించారు.ఆయనకు 97670 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2014లో ఆయనకు 86వేలపైచిలుకు మెజార్టీ వస్తే 2018లో అది ఇంకా పెరిగింది. రమేష్ తన సమీప తెలంగాణ జనసమితి ప్రత్యర్ధి పి.దేవయ్యపై విజయం సాధించారు. మహాకూటమిలో బాగంగా ఇక్కడ టిజెఎస్ పోటీచేసింది.బిజెపి పక్షాన పోటీచేసిన కె.సారంగారావుకు సుమారు 5400 ఓట్లు వచ్చాయి.రమేష్ కు 128764 ఓట్లు రాగా, దేవయ్యకు 31094 ఓట్లు వచ్చాయి.
వర్ధన్న పేట నియోజకవర్గంలో 2014లో అప్పటి సిటింగ్ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే కె.శ్రీధర్‌ను ఆరూరి రమేష్ 86349ఓట్ల తేడాతో ఓడిరచారు. రమేష్ 2009లో స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయినా, 2014, 2018లలో వర్దన్నపేట నుంచి విజయం సాధించారు. ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్యక్షుడు మందకృష్ణ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసి 2014లో ఇక్కడ పోటీచేసినా 20526 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి చెందారు. రెండువేల తొమ్మిదిలో మందకృష్ణ ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓడిపోయారు.
కాగా 2009లో ఇక్కడ టిఆర్‌ఎస్ తరపున పోటీచేసిన సీనియర్ నేత విజయరామారావు తదుపరి పరిణామాలలో కాంగ్రెస్ ఐలో చేరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లో ఆయన ఘనపూర్ నుంచి గెలిచి టిఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. కొంతకాలం వై.ఎస్. మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 2008లో టిఆర్‌ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికలలో వర్ధన్నపేటలో పోటీచేసి పరాజితులయ్యారు.
ఈయన గతంలో మెదక్‌జిల్లా గజ్వేలు నుంచి ఒకసారి గెలిచారు. అలాగే సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి వర్ధన్నపేట దళితులకు రిజర్వు అయింది. దాంతో అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి కి మారి మరో మూడుసార్లు గెలిచి మొత్తం ఆరుసార్లు గెలిచిన నేతగా గుర్తింపు పొందారు. దయాకరరావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు గెలిచారు. దయాకరరావు2008లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు.
దయాకరరావు కొంతకాలం విప్‌గా పనిచేశారు. తెలంగాణ తొలి శాసనసభలో టిడిపి పక్ష నేత అయ్యారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లోకి మారి, 2018 ఎన్నికలలో ఆ పార్టీ పక్షాన గెలిచి మంత్రి అయ్యారు. వర్ధన్నపేటలో ఒకసారి ఇండిపెండెంటుగా, మరోసారి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరుపున గెలిచిన టి.పురుషోత్తంరావు ఇంకోసారి వరంగల్ నుంచి కాంగ్రెస్ ఐ తరుపున గెలిచారు. అప్పట్లో తెలంగాణ వాదిగా వున్న పురుషోత్తంరావు, ఆ తర్వాత కాలంలో కోట్ల విజయ భాస్కరరెడ్డి క్యాబినెట్‌లోను, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చాక మారుమూల ప్రాంతాల అభివృద్ధి కమిటీ ఛెర్మన్‌గాను పనిచేశారు.
ఇక్కడ నుంచి మాచర్ల జగన్నాథం ఒకసారి జనతా పక్షాన, మరోసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. వర్ధన్నపేటలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, టిఆర్‌ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, ఎన్‌టిపిఎస్ ఒకసారి, జనతా ఒకసారి గెలవగా, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. 1952లోవర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ సీట్లను, వరంగల్ లోక్‌సభ సీటును గెలిచిన పెండ్యాల రాఘవరావు అసెంబ్లీ సీట్లను వదిలి లోక్‌సభకు వెళ్ళారు. వర్ధన్నపేట జనరల్‌గా ఉన్నప్పుడు ఆరుసార్లు వెలమ, రెండుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసిలు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి ఇతరులు గెలిచారు.
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment