
వరంగల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ నేతలతో ముగిసిన కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఏం కేసీఆర్ సమావేశం ముగిసింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదించగా.. ఆయన పోటీకి విముఖత చూపించారు.
మరోసారి అవకాశం ఇవ్వాలని సిట్టింగ్ ఎంపీ దయాకర్ కోరగా.. త్వరలోనే నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ బదులిచ్చారు. అటు అనవసర నిర్ణయాలతో భవిష్యత్ పాడు చేసుకోవద్దని పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న ఆరూరి రమేశ్‌కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
భేటీకి ముందు బీజేపీ చేరినట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పందించారు. ‘నేను ఏ బీజేపీ నేతలను కలవలేదు. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’అని ఆరూరి తెలిపారు.
అయితే గత రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆరూరి రమేష్‌ను బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్‌రావు హైదరాబాద్ తీసుకురావటంతో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment