కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో జరుగుతున్నఅక్రమాలకు చెక్ పెట్టే దిశలో కార్యాచరణ వేగం పుంజుకుంది.
సాక్షి, హైదరాబాద్: కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో జరుగుతున్నఅక్రమాలకు చెక్ పెట్టే దిశలో కార్యాచరణ వేగం పుంజుకుంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఏర్పాటైన శాసన సభ కమిటీ (హౌస్ కమిటీ) గురువారం అసెంబ్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ ఆరూరి రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సరైన సమాచారం ఇవ్వకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హౌసింగ్ సొసైటీల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ఆరా తీసేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరపాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. వచ్చే నెల 1న మరోసారి భేటీ కావాలని, అదే రోజు జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ సొసైటీల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆయా సొసైటీల్లో అక్రమంగా భూములు చేజిక్కించుకుని నిర్మించిన పెద్ద భవనాలు, వాటి యజమానుల వివరాలను కూడా బయట పెట్టాలన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ద్వారా సమాచారం సేకరించామని, వాస్తవాలు రాబట్టి పూర్తి స్థాయి నివేదికను శాసనసభకు అందజేస్తామని రమేశ్ పేర్కొన్నారు.