Co-operative Housing Society
-
ఆ రెండు సొసైటీల్లో ఉల్లంఘనలు
జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ సొసైటీల్లో నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించిన సభాసంఘం బాధ్యులకు నోటీసుల జారీకి ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు సభాసంఘం గుర్తించింది. రాష్ట్రంలోని కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో చోటు చేసుకున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ బుధవారం నగరంలో పర్యటించింది. క్షేత్ర పర్యటన తర్వాత అసెంబ్లీ సమావేశ మందిరంలో సభాసంఘం భేటీ అయ్యింది. నగరంలో మరో మారు క్షేత్రస్థాయి పర్యటన జరపాలని సభ్యులు నిర్ణయించారు. దానికంటే ముందు ఖమ్మం జిల్లాలోని హౌసింగ్ సొసైటీలను పరిశీలించనున్నారు. సొసైటీలకు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం భూములను కేటాయించిందో, ఏ కార్యక్రమాల కోసం ప్లాట్లను ఇచ్చారో వాటికి విరుద్ధంగా నిబంధనలను ఉల్లంఘించాయని , సొసైటీల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని సభాసంఘం చైర్మన్ ఆరూరి రమేశ్ చెప్పారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఉల్లంఘనలు జరిగాయని తేల్చారు. క్లబ్‌కు మూడున్నర ఎకరాలు కేటాయించగా అదనంగా రెండెకరాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు. బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లోనూ పర్యటించి అక్కడ నిర్మాణాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.1లో ఆరువేల గజాల విస్తీర్ణంలో అక్రమంగా నర్సరీ కొనసాగుతోందని, ఇదంతా సొసైటీలో ఓపెన్ ల్యాండ్ అని సభాసంఘం నిర్ధారణకు వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో జురాసిక్ పార్కు పక్కన నాలాను కూడా సభ్యులు పరిశీలించారు. పార్కు స్థలాలు, క్లబ్ హౌస్‌లు, కమర్షియల్ స్థలాలు, నాలాలు దురాక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని చైర్మన్ రమేశ్ చెప్పారు. కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా కలెక్టర్ నిర్మల, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి తదితరులు క్షేత్ర స్థాయి పర్యటనలో పాల్గొన్నారు. -
హౌసింగ్ సొసైటీల అక్రమాలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో జరుగుతున్నఅక్రమాలకు చెక్ పెట్టే దిశలో కార్యాచరణ వేగం పుంజుకుంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఏర్పాటైన శాసన సభ కమిటీ (హౌస్ కమిటీ) గురువారం అసెంబ్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ ఆరూరి రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సరైన సమాచారం ఇవ్వకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ సొసైటీల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ఆరా తీసేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరపాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. వచ్చే నెల 1న మరోసారి భేటీ కావాలని, అదే రోజు జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ సొసైటీల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆయా సొసైటీల్లో అక్రమంగా భూములు చేజిక్కించుకుని నిర్మించిన పెద్ద భవనాలు, వాటి యజమానుల వివరాలను కూడా బయట పెట్టాలన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ద్వారా సమాచారం సేకరించామని, వాస్తవాలు రాబట్టి పూర్తి స్థాయి నివేదికను శాసనసభకు అందజేస్తామని రమేశ్ పేర్కొన్నారు. -
‘సహకార’ నిబంధనల సరళీకరణ
ముంబై: రాష్ట్రంలో సహకార గృహ నిర్మాణ సంఘాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించనున్నట్లు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల్లో దీర్ఘకాలిక విధానాలను ప్రభుత్వం రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. విధానసభలో బుధవారం గవర్నర్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటివిధానాన్ని రూపొందించనున్నామన్నారు. అలాగే అడవులు, వన్యప్రాణ సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. విదర్భ, సహ్యాద్రి ఏరియాల్లోని పులుల సంరక్షణ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలకు పునరావాస చర్యలను ముమ్మరం చేస్తామన్నారు. అలాగే ఆ ప్రాంతంలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు తగిన కార్యాచరణ చేపడతామని గవర్నర్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తమ ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ స్మార్ట్ సిటీలను అభివృద్ధిచేస్తామని స్పష్టం చేశారు. ముంబై మహానగరంలో రవాణావ్యవస్థను పటిష్టంచే యడానికి రోడ్లు, రైల్వే వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు కృషిచేస్తామన్నారు. ‘2022 వరకల్లా అందరికీ ఇళ్లు’ అనే నినాదాన్ని నిజం చేసేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. మాడా, ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో, నాగపూర్ అభివృద్ధి ట్రస్ట్ వంటి ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ సంస్థల ద్వారా బహుళ అంతస్తులను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధి దిశలో శీఘ్రగతిన అడుగులు వేసేలా తమ ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. మరాఠీ మీడియం పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరాఠీ మీడియంనుంచి చాలా మంది పిల్లలు ఇంగ్లిష్ మీడియం వైపు తరలిపోతున్నట్లు సర్వేల్లో తేలిన నేపథ్యంలో మరాఠీ మీడియం పాఠశాలల్లోనే ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు పెంచుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మాతృభాషలో విద్య ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే అందరికి నాణ్యమైన విద్యను అందించడం తమ లక్ష ్యమని వివరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని పాఠశాలల స్థాయిని మదించేందుకు ‘స్టేట్ ఎక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్’ను ఏర్పాటుచేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. నాణ్యమైన ఉన్నతవిద్యను వీలైనంతమంది ఎక్కువమందికి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రెండు కొత్త ఐఐఐటీలు, ఒక ఐఐఎంను స్థాపించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రను, శివాజీ కాలం నాటి ప్రాభవాన్ని కన్నులకు కట్టినట్లు చూపించే కోటల సంరక్షణకు కమిటీని నియమించనున్నట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. రాష్ట్రంలో సాంస్కృతిక, కళా రంగాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు.