ముంబై: రాష్ట్రంలో సహకార గృహ నిర్మాణ సంఘాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించనున్నట్లు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల్లో దీర్ఘకాలిక విధానాలను ప్రభుత్వం రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. విధానసభలో బుధవారం గవర్నర్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటివిధానాన్ని రూపొందించనున్నామన్నారు. అలాగే అడవులు, వన్యప్రాణ సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. విదర్భ, సహ్యాద్రి ఏరియాల్లోని పులుల సంరక్షణ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలకు పునరావాస చర్యలను ముమ్మరం చేస్తామన్నారు.
అలాగే ఆ ప్రాంతంలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు తగిన కార్యాచరణ చేపడతామని గవర్నర్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తమ ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ స్మార్ట్ సిటీలను అభివృద్ధిచేస్తామని స్పష్టం చేశారు. ముంబై మహానగరంలో రవాణావ్యవస్థను పటిష్టంచే యడానికి రోడ్లు, రైల్వే వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు కృషిచేస్తామన్నారు. ‘2022 వరకల్లా అందరికీ ఇళ్లు’ అనే నినాదాన్ని నిజం చేసేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. మాడా, ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో, నాగపూర్ అభివృద్ధి ట్రస్ట్ వంటి ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ సంస్థల ద్వారా బహుళ అంతస్తులను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధి దిశలో శీఘ్రగతిన అడుగులు వేసేలా తమ ప్రణాళికలు ఉంటాయని చెప్పారు.
మరాఠీ మీడియం పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరాఠీ మీడియంనుంచి చాలా మంది పిల్లలు ఇంగ్లిష్ మీడియం వైపు తరలిపోతున్నట్లు సర్వేల్లో తేలిన నేపథ్యంలో మరాఠీ మీడియం పాఠశాలల్లోనే ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు పెంచుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మాతృభాషలో విద్య ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే అందరికి నాణ్యమైన విద్యను అందించడం తమ లక్ష ్యమని వివరించారు.
ఈ మేరకు రాష్ట్రంలోని పాఠశాలల స్థాయిని మదించేందుకు ‘స్టేట్ ఎక్రిడిటేషన్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్’ను ఏర్పాటుచేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. నాణ్యమైన ఉన్నతవిద్యను వీలైనంతమంది ఎక్కువమందికి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రెండు కొత్త ఐఐఐటీలు, ఒక ఐఐఎంను స్థాపించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రను, శివాజీ కాలం నాటి ప్రాభవాన్ని కన్నులకు కట్టినట్లు చూపించే కోటల సంరక్షణకు కమిటీని నియమించనున్నట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. రాష్ట్రంలో సాంస్కృతిక, కళా రంగాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు.
‘సహకార’ నిబంధనల సరళీకరణ
Published Thu, Nov 13 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement