జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ సొసైటీల్లో నిబంధనలు అతిక్రమించినట్లు
గుర్తించిన సభాసంఘం
బాధ్యులకు నోటీసుల జారీకి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు సభాసంఘం గుర్తించింది. రాష్ట్రంలోని కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో చోటు చేసుకున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ బుధవారం నగరంలో పర్యటించింది. క్షేత్ర పర్యటన తర్వాత అసెంబ్లీ సమావేశ మందిరంలో సభాసంఘం భేటీ అయ్యింది. నగరంలో మరో మారు క్షేత్రస్థాయి పర్యటన జరపాలని సభ్యులు నిర్ణయించారు. దానికంటే ముందు ఖమ్మం జిల్లాలోని హౌసింగ్ సొసైటీలను పరిశీలించనున్నారు.
సొసైటీలకు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం భూములను కేటాయించిందో, ఏ కార్యక్రమాల కోసం ప్లాట్లను ఇచ్చారో వాటికి విరుద్ధంగా నిబంధనలను ఉల్లంఘించాయని , సొసైటీల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని సభాసంఘం చైర్మన్ ఆరూరి రమేశ్ చెప్పారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఉల్లంఘనలు జరిగాయని తేల్చారు. క్లబ్‌కు మూడున్నర ఎకరాలు కేటాయించగా అదనంగా రెండెకరాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు. బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లోనూ పర్యటించి అక్కడ నిర్మాణాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.1లో ఆరువేల గజాల విస్తీర్ణంలో అక్రమంగా నర్సరీ కొనసాగుతోందని, ఇదంతా సొసైటీలో ఓపెన్ ల్యాండ్ అని సభాసంఘం నిర్ధారణకు వచ్చింది.
జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో జురాసిక్ పార్కు పక్కన నాలాను కూడా సభ్యులు పరిశీలించారు. పార్కు స్థలాలు, క్లబ్ హౌస్‌లు, కమర్షియల్ స్థలాలు, నాలాలు దురాక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని చైర్మన్ రమేశ్ చెప్పారు. కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా కలెక్టర్ నిర్మల, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి తదితరులు క్షేత్ర స్థాయి పర్యటనలో పాల్గొన్నారు.
ఆ రెండు సొసైటీల్లో ఉల్లంఘనలు
Published Thu, Jul 2 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement