కుప్పకూలిన బతుకులు..
- ఫిల్మ్‌నగర్ ఎఫ్ఎన్సీసీలో అనుమతి లేకుండా పోర్టికో నిర్మాణం
- ఒక్కసారిగా పడిపోయిన పిల్లర్లు
- ఇద్దరు కూలీల దుర్మరణం,మరో 8 మందికి తీవ్రగాయాలు
- స్వల్ప వ్యవధిలో బీమ్స్, శ్లాబ్ వేయడం.. నాసిరకం పిల్లర్లే దుర్ఘటనకు కారణం
- కాంట్రాక్టర్, ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు, కార్యవర్గంపై కేసు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఓ అక్రమ నిర్మాణం ఆదివారం కుప్పకూలింది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ)లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న పోర్టికో పిల్లర్లతో పాటు ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృత్యువాతపడగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో బీమ్స్, శ్లాబ్ వేయడం, పిల్లర్లు నాసిరకంగా ఉండటమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అనుమతులు లేకుండా నిర్మాణం..
ఎఫ్ఎన్సీసీ కమిటీ మెయిన్ గేట్ ముందు నుంచి 500 గజాల స్థలంలో దాదాపు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పోర్టికో నిర్మాణం చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా వారం క్రితం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. ఈ కాంట్రాక్టును కొండలరావుకు అప్పగించగా.. సుధాకర్‌రావు అనే వ్యక్తి సైట్ ఇంజనీర్‌గా వ్యవహరిస్తున్నారు. పోర్టికో అక్రమ నిర్మాణం కావడంతో ఎవరైనా అడ్డుకుంటారని భావించిన ఎఫ్ఎన్సీసీ కమిటీ వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించింది. దీంతో నాలుగు రోజుల క్రితం బీమ్స్ నిర్మించి, శనివారం ఉదయం నుంచి శ్లాబ్ పని ప్రారంభించారు.
అయితే 30 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆరు పిల్లర్లనూ నాసిరకంగా కట్టారు. ఆదివారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో పది మంది కూలీలు పనిచేస్తుండగా.. సెంట్రింగ్ సపోర్ట్ కదలడంతో ఈ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కర్ణాటకలోని రాయచూరుకు చెందిన మాన్‌శేష్ అలియాస్ ఆనంద్(38), కోల్‌కతాకు చెందిన అనిసూర్ షేక్(40) అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాస్(29), శివ(31), మల్లేశం(25), అజిత్ బిశ్వాస్(24), సీతారాం(32), వీరప్ప(24), కోటేశ్వరరావు(35), సాహెబ్ మండల్(24) గాయపడ్డారు. క్షతగాత్రుల్ని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో శివ తల పగలడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్‌కు దవడ భాగం పూర్తిగా దెబ్బతింది. వీరిద్దరూ మినహా మిగిలిన వారిని డిశ్చార్జ్ చేశారు.
బాధితులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఎఫ్ఎన్సీసీ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ ప్రకటించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోపం ఎవరిదో గుర్తించేందుకు జేఎన్టీయూ నిపుణుల కమిటీకి ఈ వ్యవహారాన్ని అప్పగించామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు. కాగా, ఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు సందర్శించారు.
సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం
ఫిల్మ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ప్రాణాపాయం సంభవించడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరోవైపు ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి మృతిచెందిన కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాంట్రాక్టర్ కక్కుర్తే కారణమా..?
30 అడుగుల ఎత్తులో పోర్టికో నిర్మాణం చేపట్టడంతో దాదాపు 18 అంగుళాల చుట్టు కొలతతో ఆరు పిల్లర్లు నిర్మించారు. వీటి మధ్యలో ఆరంగుళాల చుట్టుకొలతతో ఉన్న ప్లాస్టిక్ గొట్టం ఏర్పాటు చేసి, అందులో ఇసుక నింపారు. కాంట్రాక్టర్ కక్కుర్తి కారణంగానే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టర్ విని యోగించిన ఇసుక, సిమెంట్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లూస్ టీమ్స్ వాటి నమూనాలను సేకరించాయి. క్షతగాత్రుడైన శ్రీనివాస్, జీహెచ్ఎంసీ సర్కిల్-10 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ కొండలరావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, లేబర్ కాంట్రాక్టర్ రవితో పాటు ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, కార్యవర్గంపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు సీల్
కాగా, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం రాత్రి సీల్ చేశారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాల మేరకు డీఎంసీ సామ్రాట్ అశోక్ గేట్లకు సీల్ వేశారు.