సాక్షి, వర్ధన్నపేట: వర్ధన్నపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేష్‌కు మంగళవారం నిరసన సెగ తగిలింది. మండలంలోని ఉప్పరపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న ఆయనను కాలనీవాసులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం అభివృద్ధి పనులు చేశారని, వెంటనే వెనక్కి వెళ్లాలని ‘అరూరి’ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఊహించని ఘటన చోటుచేసుకోవడవంతో పోలీసులు కాలనీ యువకులను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యువకుల ఆందోళన, పోలీసుల చర్యలతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గ్రామంలో ప్రచార సభలో మాట్లాడినంత సేపు పోలీసులు ఆందోళనకారులను దగ్గరికి రాకుండా నిలువరించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం చేసిన వారికి బిల్లులు రాలేదని గ్రామ సర్పంచ్ దిగమింగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అప్పులు చేసి మరుగుదొడ్లు నిర్మించుకుంటే వచ్చిన మరుగుదొడ్లు బిల్లులు కాజేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కాలనీ యువకులు సీనపెల్లి కృష్ణ, శ్రీనివాస్, రాజు, సందీప్ మాట్లాడుతూ గ్రామంలో ఒక్కరోజైనా దళితకాలనీని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అరూరి రమేష్ సందర్శించారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల సాగు భూమి, ఇంటికో ఉద్యోగం అని మాయ మాటలు చెప్పి గ్రామంలో ఏమి చేశారని ఓటెయ్యాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో అరూరి రమేష్‌కు బుద్ధిచెప్పే విధంగా ఓడించి తమ సత్తా చూపుతామన్నారు. వీరి వెంట కాలనీ వాసులు సీనపెల్లి రాజు, బాస్కూరి రాజేందర్, కుమార్, అనిల్ గ్రామ పెద్దలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment