Vardhannapeta
-
మౌనిక ఊపిరి వదిలేసింది.. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు
సాక్షి, వర్ధన్నపేట: తమ కలల పంటను చూసుకోవాలని ఆ గర్భిణి కలలుకన్నది. ఇంతలోనే కరోనా ఆమెపై పంజా విసిరింది. మహమ్మారిపై ధైర్యంగా పోరాడి బిడ్డకు జన్మనిచ్చినా.. పుట్టిన బిడ్డను చూసుకునేలోపే మృత్యుఒడికి చేరుకుంది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగల శ్రీనివాస్–సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఝాన్సీ, మౌనిక (21). గత ఏడాది చిన్న కుమార్తె మౌనికను వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన పాముల సురేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. మౌనిక ఇటీవలే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ఈనెల 8న మౌనికకు జ్వరం రావడంతో రెండు రోజులు స్థానిక వైద్యులు ఇచ్చిన మందులు వాడగా జ్వరం తగ్గింది. తిరిగి రెండు రోజులకే మళ్లీ జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందింది. ఈ క్రమంలో ఈనెల 22న మౌనికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడగా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి, ఆపై 23న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు చేయిస్తే నెగెటివ్ వచ్చింది. దీంతో 24వ తేదీన తిరిగి సీకేఎం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. అదే రోజు రాత్రి మళ్లీ మౌనిక ఆరోగ్యం క్షీణించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న వైద్యుల సూచనలతో అంబులెన్సులో తరలించారు. ఎంజీఎంలో వైద్యులు ఆక్సిజన్ ఫ్లో మీటర్ లేదని, కొనుగోలు చేసి తీసుకురావాలని చెప్పారు. మౌనిక తండ్రి ఆ ప్రయత్నాల్లో ఉండగానే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి ఆ తల్లి ఊపిరి వదిలేసింది. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు ఓ పక్క మౌనిక మృతదేహం.. మరో పక్క ఆమెకు పుట్టిన ఆడ శిశువును ఎత్తుకుని మౌనిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మౌనికకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినా బంధువులెవరూ దగ్గరకు రాలేదు. మౌనిక భర్తకు సమాచారం ఇచ్చినా ఆయన సైతం మృతదేహాన్ని చూసేందుకు సుముఖత చూపలేదు. దీంతో మంగళవారం ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ స్వగ్రామం కట్య్రాలకు తీసుకెళ్లి మౌనిక అంత్యక్రియలు పూర్తిచేశారు. -
కార్యకర్తలు దుమ్ము దులపాలి: ఎర్రబెల్లి
సాక్షి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రోడ్ షో నిర్వహించారు. మంత్రితోపాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస కార్యకర్తలందరు దుమ్ము దులపాలని పేర్కొన్నారు. కొనారెడ్డి చెరువు నింపినా ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. చెరువులు కుంటలు నింపామని, కేసిఆర్ నాయకత్వాన్ని రైతులందరూ బలపరుస్తున్నారన్నారు. (మంత్రి గంగుల వివాదాస్పద వ్యాఖ్యలు) అందరిని ఆదుకున్న మహానుభావుడు కేసిఆర్ అని.. వర్ధన్నపేట తనకు కన్నతల్లి లాంటిదని భావోద్వేగానికి లోనయ్యారు. వర్ధన్నపేట లో 12 వార్డులు దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి కౌన్సిలర్‌కు రూ. కోటి 50 లక్షలు ఇవ్వబోతున్నమని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు వద్దని కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయారని, మున్సిపాలిటీలో గెలిచి పనిచేయని వారిని తోలింగించే అధికారం తాము తీసుకు వచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉన్న 12 సీట్లు వన్ సైడ్ రావాలని, ఒక్కటి పోవద్దని అన్నారు. టిక్కెట్ రానివారికి సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి తెలిపారు. చదవండి : మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు -
‘అరూరి’కి నిరసన సెగ
సాక్షి, వర్ధన్నపేట: వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్‌కు మంగళవారం నిరసన సెగ తగిలింది. మండలంలోని ఉప్పరపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న ఆయనను కాలనీవాసులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం అభివృద్ధి పనులు చేశారని, వెంటనే వెనక్కి వెళ్లాలని ‘అరూరి’ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఊహించని ఘటన చోటుచేసుకోవడవంతో పోలీసులు కాలనీ యువకులను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యువకుల ఆందోళన, పోలీసుల చర్యలతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో ప్రచార సభలో మాట్లాడినంత సేపు పోలీసులు ఆందోళనకారులను దగ్గరికి రాకుండా నిలువరించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం చేసిన వారికి బిల్లులు రాలేదని గ్రామ సర్పంచ్ దిగమింగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అప్పులు చేసి మరుగుదొడ్లు నిర్మించుకుంటే వచ్చిన మరుగుదొడ్లు బిల్లులు కాజేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కాలనీ యువకులు సీనపెల్లి కృష్ణ, శ్రీనివాస్, రాజు, సందీప్ మాట్లాడుతూ గ్రామంలో ఒక్కరోజైనా దళితకాలనీని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అరూరి రమేష్ సందర్శించారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల సాగు భూమి, ఇంటికో ఉద్యోగం అని మాయ మాటలు చెప్పి గ్రామంలో ఏమి చేశారని ఓటెయ్యాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో అరూరి రమేష్‌కు బుద్ధిచెప్పే విధంగా ఓడించి తమ సత్తా చూపుతామన్నారు. వీరి వెంట కాలనీ వాసులు సీనపెల్లి రాజు, బాస్కూరి రాజేందర్, కుమార్, అనిల్ గ్రామ పెద్దలు ఉన్నారు. -
కేసీఆరే మా బలం..
గోదావరి జలాలతో ఒక్క వర్ధన్నపేట నియోజకవర్గంలోనే 11 వేల ఎకరాలు తడుస్తోంది. 24 గంటల కరెంటుతో గజం భూమి కూడా ఎంyì పోట్లేదు. రైతు బీమా, రైతు బంధు, సకాలంలో ఎరువులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పింఛన్లు ఇవి చాలవా ప్రజలు తిరిగి మాకు పట్టం కట్టడానికి.. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టింది.. నా నియోజకవర్గం నుంచే ఈ ఏడాది రూ.520 కోట్ల విలువైన ధాన్యం దిగుబడి వచ్చిందని వర్ధన్నపేట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి, తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచార బిజీలో ఉన్న ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. –వర్ధన్నపేట వర్ధన్నపేట నియోజకవర్గంలో దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారు 11 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కాల్వల కింద 38 చెరువులు నింపుతున్నాం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. వీటి ద్వారా సుమారు 5వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఇక ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారు 6వేల సాగు నీరు అందుతుంది. నియోజకవర్గంలో 32 చెరువులు నింపుతున్నారు. హసన్‌పర్తి, హన్మకొండ, వరంగల్, ఐనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని చెరువుల్లో ఎస్సారెస్పీ నీటిని మళ్లిస్తున్నారు. గతంలో వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఎస్సారెస్పీ జలాలు అందలేదు. నాకున్న సమాచారం మేరకు ఈ ఏడాది రూ.520 కోట్ల విలువైన పంట దిగుబడి వచ్చింది. ప్రతి రైతు ఇంట చిరునవ్వులే ఉన్నాయి. డబుల్ బెడ్రూం పథకం పనుల వేగం ఇప్పుడిప్పుడే అందుకుంటోంది. వరంగల్ రెవెన్యూ మండలం ఎస్సార్‌నగర్‌లో సుమారు 800 ఇళ్లు. హసన్çపర్తి మండలం సిద్ధాపురం, అర్వపల్లిల్లో 40 డబుల్‌బెడ్ రూం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. కాట్య్రాలపల్లి 28 డబుల్ బెడ్రూంల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. చింత నెక్కొండ 60డబుల్ బెడ్రూంలు, తుర్కల సోమారంలో 30 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే వ్యక్తిగత ప్లాట్లలో కూడా ఇళ్ల నిర్మాణం చేయడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన వందల కొద్ది సంక్షేమ పథకాలు ఇవాల ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నాయి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌కు నిధులు, బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్‌కు నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కరెంటు చార్జీలు పెంచకుండా చేయడం వంటి సంక్షేమ పథకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల కరెంటు, రూ.లక్ష రుణమాఫి, రూ.వెయ్యి పింఛన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వీర్యమైన యువత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కృషి ఫలితంగా సంపదను సృష్టించగలుగుతోంది. నేను గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రజల మధ్యనే ఉంటున్నాను. వాళ్ల కష్టం, వాళ్ల సుఖం నాది అనుకొని జనంలో తిరుగుతున్నాను. ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు. విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు దృష్టి పెట్టాను. ఈ దఫా విలీన గ్రామాలను అభివృద్ధి చేసి తీరుతా. -
ప్రసవాలపై ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేక శ్రద్ధ
-
కుటుంబ కలహాలతో వైద్యుడి ఆత్మహత్య
వరంగల్(వర్ధన్నపేట): వర్ధన్నపేట మండలానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రవీంద్రా రెడ్డి(50) సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబాల కలహాలతో పాయిజన్‌ను ఇంజక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఆయనను వరంగల్‌లోని మాక్స్‌కేర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దారిలోనే ముగిసిన..జీవన పయనం
మండపేట : ‘అమ్మా.. అల్లరి చేయకుండా ఆడుకోండే. నేను త్వరగా వచ్చేస్తాను. మీకు చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొస్తాను’ అని చెప్పి వెళ్లిన ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషయం ఆ చిన్నారులకు తెలియదు. ఉద్యోగం కోసం వెళుతున్న కుమారుడికి ఆనందంగా వీడ్కోలు పలికిన ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి బిడ్డ మృత్యుఒడికి చేరుకున్నాడు. ‘త్వరగా వచ్చేస్తానులే’ అని చెప్పిన భర్తకు నవ్వుతూ వీడ్కోలు పలికిన ఆ భార్యను అతడు ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మండపేటకు చెందిన ముగ్గురు మృత్యువాత పడగా, ఒకరు గాయపడ్డారు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పలాస సమీపంలోని తాటిపట్టికి చెందిన బొగ్గు సోమేశ్వరరావు (32) బ్రాయిలర్ కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం మండపేటకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పనుల్లో సబ్ కాంట్రాక్టు తీసుకున్నట్టు తెలిసింది. తమ పనులకు అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో పది రోజుల క్రితం జీపును తీసుకున్నారు. కాంట్రాక్టు పనుల్లో సైట్ ఇంజనీర్‌గా పని చేసేందుకు పట్టణంలోని న్యూకాలనీకి చెందిన విప్పర్తి పుణ్యరాజు (23), డ్రైవర్లు వల్లూరివారి వీధికి చెందిన గరిగపర్తి నాగభూషణం (20), రావులపేటకు చెందిన అల్లబోయిన మనోహర్‌తో కలిసి ఆదివారం రాత్రి మండపేట నుంచి జీపులో బయలుదేరి వెళ్లారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో సోమేశ్వరరావు, పుణ్యరాజు, నాగభూషణం అక్కడికక్కడే మరణించగా, మనోహర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో మండపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సమాచారం తెలిసినా వారి బంధువులు మృతుల తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు విషయం తెలియనీయలేదు. గాయాలతోనైనా తమ వారు సురక్షితంగా ఇంటికి చేరుకుంటారన్న ఆశతో కుటుంబ సభ్యులు వారి రాక కోసం ఎదురు చూస్తుండడం చూపరులను కలచివేసింది. కాగా సోమేశ్వరరావుకు భార్య దుర్గ, ఆరు, నాలుగేళ్ల కుమార్తెలు మానస, హాసిని ఉన్నారు. తమ తండ్రి ఇకలేడన్న విషయం తెలియని ఆ చిన్నారులు ఇంటి బయట తోటి చిన్నారులతో ఆడుకుంటుండడం స్థానికులను కంటతడి పెట్టించింది. చుట్టుపక్కల వారితో కలుపుగోలుగా ఉండే సోమేశ్వరరావు మరణ వార్త స్థానికులను కలచివేసింది. భార్య దుర్గ తన భర్త క్షేమంగా వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది. పిల్లలంటే ఎంతో ప్రాణంగా చూసుకునేవారని, ఆ కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందోనంటూ స్థానికులు విచారం వ్యక్తం చేశారు. బీటెక్ పూర్తి చేసి.. మృతుడు పుణ్యరాజు బీటెక్ పూర్తి చేశాడు. తండ్రి రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ రాజారావు. తల్లి, ఇద్దరు అక్కలు, ఓచెల్లెలు ఉన్నారు. సైట్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేందుకు సోమేశ్వరరావు వెంట హైదరాబాద్ బయలుదేరాడు. ఉద్యోగంలో చేరేందుకు వెళుతున్న కుమారుడికి కుటుంబ సభ్యులు ఆనందంగా వీడ్కోలు పలికారు. ఉదయం ప్రమాద ఘటన తెలుసుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న రాజారావు సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కొల్లి నిర్మలకుమారి మండపేటకు చేరుకున్నారు. ఫోన్లో పరిస్థితిని తెలుసుకున్నారు. తమతో ఎంతో కలివిడిగా ఉండే పుణ్యరాజు ఇక లేడన్న విషయం తెలిసి అతడి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం తన భర్తకు ఏమైందంటూ నాగభూషణం భార్య భవాని విలపిస్తుండడం, తన బిడ్డ క్షేమంగా వస్తాడని తల్లి భాగ్యలక్ష్మి ఎదురుచూస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. నాగభూషణం, భవాని ఏడాది క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. వారు అన్యోన్యంగా ఉండేవారని, చిన్న వయసులో ఆమెకు ఎంత కష్టం వచ్చిందోనంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భవానీ మాలలో ఉన్న నాగభూషణం ఆదివారం రాత్రి సరదాగా వెళ్లొస్తానని చెప్పి బయలుదేరాడని తల్లి రోదించింది. -
11న టీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను రిటర్నింగ్ ఆఫీసర్, వర్ధన్నపేట ఎస్పీహెచ్ఓ డాక్టర్ ఎ.సాంబశివరావు ఆదివారం విడుదల చేశారు. ఈనెల 6, 7వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 8న నామినేషన్ల పరిశీలన, 9న నామినేషన్ల ఉపసంహరణ, 10న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్న ట్లు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఎంహెచ్ఓ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ముంచెత్తిన ముసురు
జిల్లా అంతటా వాన =అత్యధికంగా వర్ధన్నపేటలో 6 సెం.మీ. =పంటలకు మళ్లీ నష్టం =నల్లబడుతున్న పత్తి =నేలవాలిన వరి వరంగల్, న్యూస్‌లైన్ : అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు సగటున 11.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొత్తం 46 మండలాల్లో వర్షం కురువగా... వర్ధన్నపేటలో అత్యధికంగా 6 సెంటీ మీటర్లు కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురుతో రహదారులు జలమయమయ్యాయి. నర్సంపేట, ములుగు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, ఏటూర్‌నాగారం ఏజెన్సీలో వర్షం పడింది. ఏజెన్సీతో పాటు నర్సంపేట, ములుగు, పరకాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో 33 కేవీ లైన్లు బ్రేక్‌డౌన్ అయ్యాయి. దీంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో ముందస్తుగానే సరఫరాను నిలిపేశారు. లూజ్‌లైన్ల కారణంగా వర్షంతో ఇబ్బం దులు ఏర్పడుతాయని సరఫరా కట్ చేశారు. మంగపేట, ఏటూర్నగారం, తాడ్వాయి, గణపురం, చెల్పూర్ ప్రాంతాలకు రాత్రి వరకు విద్యుత్ సరఫరా చేశారు. వరంగల్ కార్పొరేషన్లో సాయంత్రం రెండు గంటల పాటు సరఫరాను ఆపేశారు. కార్పొరేషన్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్న వడ్డేపల్లి చెరువు, కాశిబుగ్గ, వివేకానంద కాలనీ, శాంతినగర్, పద్మనగర్, ఎంహెచ్ నగర్, సుందరయ్య నగర్, దేశాయిపేట, సమ్మయ్యనగర్, నయీంనగర్, గోపాల్పూర్ ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. పంటలకు ప్రమాదమే.. రెండు రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వానలకు పత్తికి పెను ప్రమాదం వాటిల్లుతోంది. ఇప్పటికే వివిధ తెగుళ్లు పంటలను నాశనం చేస్తుండగా... ఈ వానలతో మరింత పెరిగే ప్రమాదముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడిప్పుడు పత్తి కాయలు పగులుతుండగా... బయటకు వచ్చిన పత్తి మొత్తం నల్లబడుతోంది. కాయలు సైతం నల్లబారుతున్నాయి. రెండు రోజులు పత్తి కాయలు నీటితో నానడంతో మొదటి దిగుబడి గణనీయంగా తగ్గనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పొట్ట దశలో ఉన్న వరికి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వర్షానికి వరి నేలకు వంగుతోంది. దీంతో గొలుసులు కిందకు వేలాడి నీటిలో నానుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప పంట పూత దశలో, పసుపు దుంప పోసుకునే దశలోఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి చేనుల్లో పలు రకాల తెగుళ్లు సోకే అవకాశాలున్నాయని వరంగల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర డాక్టర్ రావుల ఉమారెడ్డి తెలిపారు. తెగుళ్ల వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని రైతులు తెగుళ్ల ఉనికిని సకాలంలో గుర్తించాలని ఆయన సూచించారు. మొక్కజొన్న కంకులు కోసిన రైతులు.. అవి ఎండక నష్టపోతున్నారు. వర్షం వల్ల మొక్కజొన్న కంకులు తడిసి మొలకెత్తే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో అధికం అత్యధికంగా వర్దన్నపేటలో 60.6మి.మి. కురిసింది. అదే విధంగా ఆత్మకూర్‌లో 36.2 మి.మి, శాయంపేటలో 32, దేవరుప్పులలో 28.2, గూడూరులో 24.2, నెక్కొండలో 23.2, పాలకుర్తిలో 26.2, జఫర్గడ్లో 14.6, చేర్యాలలో 16.4, నర్మెట్టలో 17.8, బచ్చన్నపేటలో 12.4, ధర్మసాగర్లో 14.4, లింగాలఘన్‌పూర్‌లో10, హసన్‌పర్తిలో14.4, హన్మకొండలో10.2, రాయపర్తిలో 18.2, కొత్తగూడలో 12.8, ఖానాపూర్‌లో 7.2, నర్సంపేట, చెన్నారావుపేటల్లో 11.6, పర్వతగిరిలో 16.4, సంగెంలో 14.2, గీసుగొండలో 15.2, గోవిందరావుపేటలో 11.6, వరంగల్‌లో 8.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.