సాక్షి, వర్ధన్నపేట: తమ కలల పంటను చూసుకోవాలని ఆ గర్భిణి కలలుకన్నది. ఇంతలోనే కరోనా ఆమెపై పంజా విసిరింది. మహమ్మారిపై ధైర్యంగా పోరాడి బిడ్డకు జన్మనిచ్చినా.. పుట్టిన బిడ్డను చూసుకునేలోపే మృత్యుఒడికి చేరుకుంది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగల శ్రీనివాస్–సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఝాన్సీ, మౌనిక (21). గత ఏడాది చిన్న కుమార్తె మౌనికను వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన పాముల సురేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. మౌనిక ఇటీవలే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ఈనెల 8న మౌనికకు జ్వరం రావడంతో రెండు రోజులు స్థానిక వైద్యులు ఇచ్చిన మందులు వాడగా జ్వరం తగ్గింది. తిరిగి రెండు రోజులకే మళ్లీ జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందింది.
ఈ క్రమంలో ఈనెల 22న మౌనికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడగా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి, ఆపై 23న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు చేయిస్తే నెగెటివ్ వచ్చింది. దీంతో 24వ తేదీన తిరిగి సీకేఎం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. అదే రోజు రాత్రి మళ్లీ మౌనిక ఆరోగ్యం క్షీణించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న వైద్యుల సూచనలతో అంబులెన్సులో తరలించారు. ఎంజీఎంలో వైద్యులు ఆక్సిజన్ ఫ్లో మీటర్ లేదని, కొనుగోలు చేసి తీసుకురావాలని చెప్పారు. మౌనిక తండ్రి ఆ ప్రయత్నాల్లో ఉండగానే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి ఆ తల్లి ఊపిరి వదిలేసింది.
కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు
ఓ పక్క మౌనిక మృతదేహం.. మరో పక్క ఆమెకు పుట్టిన ఆడ శిశువును ఎత్తుకుని మౌనిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మౌనికకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినా బంధువులెవరూ దగ్గరకు రాలేదు. మౌనిక భర్తకు సమాచారం ఇచ్చినా ఆయన సైతం మృతదేహాన్ని చూసేందుకు సుముఖత చూపలేదు. దీంతో మంగళవారం ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ స్వగ్రామం కట్య్రాలకు తీసుకెళ్లి మౌనిక అంత్యక్రియలు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment