
దారిలోనే ముగిసిన..జీవన పయనం
‘అమ్మా.. అల్లరి చేయకుండా ఆడుకోండే. నేను త్వరగా వచ్చేస్తాను. మీకు చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొస్తాను’ అని చెప్పి వెళ్లిన ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషయం ఆ చిన్నారులకు తెలియదు.
మండపేట : ‘అమ్మా.. అల్లరి చేయకుండా ఆడుకోండే. నేను త్వరగా వచ్చేస్తాను. మీకు చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొస్తాను’ అని చెప్పి వెళ్లిన ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషయం ఆ చిన్నారులకు తెలియదు. ఉద్యోగం కోసం వెళుతున్న కుమారుడికి ఆనందంగా వీడ్కోలు పలికిన ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి బిడ్డ మృత్యుఒడికి చేరుకున్నాడు. ‘త్వరగా వచ్చేస్తానులే’ అని చెప్పిన భర్తకు నవ్వుతూ వీడ్కోలు పలికిన ఆ భార్యను అతడు ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
ఈ ఘటనలో మండపేటకు చెందిన ముగ్గురు మృత్యువాత పడగా, ఒకరు గాయపడ్డారు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పలాస సమీపంలోని తాటిపట్టికి చెందిన బొగ్గు సోమేశ్వరరావు (32) బ్రాయిలర్ కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం మండపేటకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పనుల్లో సబ్ కాంట్రాక్టు తీసుకున్నట్టు తెలిసింది. తమ పనులకు అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో పది రోజుల క్రితం జీపును తీసుకున్నారు. కాంట్రాక్టు పనుల్లో సైట్ ఇంజనీర్‌గా పని చేసేందుకు పట్టణంలోని న్యూకాలనీకి చెందిన విప్పర్తి పుణ్యరాజు (23), డ్రైవర్లు వల్లూరివారి వీధికి చెందిన గరిగపర్తి నాగభూషణం (20), రావులపేటకు చెందిన అల్లబోయిన మనోహర్‌తో కలిసి ఆదివారం రాత్రి మండపేట నుంచి జీపులో బయలుదేరి వెళ్లారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో సోమేశ్వరరావు, పుణ్యరాజు, నాగభూషణం అక్కడికక్కడే మరణించగా, మనోహర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో మండపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సమాచారం తెలిసినా వారి బంధువులు మృతుల తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు విషయం తెలియనీయలేదు.
గాయాలతోనైనా తమ వారు సురక్షితంగా ఇంటికి చేరుకుంటారన్న ఆశతో కుటుంబ సభ్యులు వారి రాక కోసం ఎదురు చూస్తుండడం చూపరులను కలచివేసింది. కాగా సోమేశ్వరరావుకు భార్య దుర్గ, ఆరు, నాలుగేళ్ల కుమార్తెలు మానస, హాసిని ఉన్నారు. తమ తండ్రి ఇకలేడన్న విషయం తెలియని ఆ చిన్నారులు ఇంటి బయట తోటి చిన్నారులతో ఆడుకుంటుండడం స్థానికులను కంటతడి పెట్టించింది. చుట్టుపక్కల వారితో కలుపుగోలుగా ఉండే సోమేశ్వరరావు మరణ వార్త స్థానికులను కలచివేసింది. భార్య దుర్గ తన భర్త క్షేమంగా వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది. పిల్లలంటే ఎంతో ప్రాణంగా చూసుకునేవారని, ఆ కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందోనంటూ స్థానికులు విచారం వ్యక్తం చేశారు.
బీటెక్ పూర్తి చేసి..
మృతుడు పుణ్యరాజు బీటెక్ పూర్తి చేశాడు. తండ్రి రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ రాజారావు. తల్లి, ఇద్దరు అక్కలు, ఓచెల్లెలు ఉన్నారు. సైట్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేందుకు సోమేశ్వరరావు వెంట హైదరాబాద్ బయలుదేరాడు. ఉద్యోగంలో చేరేందుకు వెళుతున్న కుమారుడికి కుటుంబ సభ్యులు ఆనందంగా వీడ్కోలు పలికారు. ఉదయం ప్రమాద ఘటన తెలుసుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న రాజారావు సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కొల్లి నిర్మలకుమారి మండపేటకు చేరుకున్నారు. ఫోన్‌లో పరిస్థితిని తెలుసుకున్నారు. తమతో ఎంతో కలివిడిగా ఉండే పుణ్యరాజు ఇక లేడన్న విషయం తెలిసి అతడి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.
ఏడాది క్రితం ప్రేమ వివాహం
తన భర్తకు ఏమైందంటూ నాగభూషణం భార్య భవాని విలపిస్తుండడం, తన బిడ్డ క్షేమంగా వస్తాడని తల్లి భాగ్యలక్ష్మి ఎదురుచూస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. నాగభూషణం, భవాని ఏడాది క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. వారు అన్యోన్యంగా ఉండేవారని, చిన్న వయసులో ఆమెకు ఎంత కష్టం వచ్చిందోనంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భవానీ మాలలో ఉన్న నాగభూషణం ఆదివారం రాత్రి సరదాగా వెళ్లొస్తానని చెప్పి బయలుదేరాడని తల్లి రోదించింది.