vardhannapet
-
బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి! అరూరికి కష్టకాలమేనా?
సాక్షి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలనుకుంటున్న బీఆర్ఎస్కు జిల్లాలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కొందరు పార్టీ ముఖ్యులతోపాటు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఇందుకు ఉదాహరణే ఇటీవల నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో పుట్టిన ముసలమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లో కార్పొరేటర్ల అనైక్యతా రాగాలు ఆ పార్టీకి బీటలు పడేలా చేస్తున్నాయి. చైర్మన్ల ఒంటెద్దు పోకడలు, ఏ విషయంలోనూ తమను పట్టించుకోవడం లేదని అప్పట్లో తమ ఎమ్మెల్యేల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. ఇప్పుడు వారే గళమెత్తుతుండడంతో ఆ పార్టీకి ఏంచేయాలో పాలుపోవడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు మాజీలు కావడంతో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గుంటి రజనిపై అవిశ్వాసం వీగిపోయినా కూడా ఆ పార్టీలో అలజడి చెలరేగింది. ఏకంగా 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో గులాబీ పార్టీకి ఊహించని దెబ్బ తగిలినట్లయ్యింది. అదేకోవలో ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం ఎటువైపు దారి తీస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. 12 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 9 మంది చైర్పర్సన్ ఆంగోతు అరుణపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ జనవరి 11న కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం సృష్టించిన రగడ ఆ పార్టీలో పెద్ద కలకలం రేపుతుండగా.. ఇక వర్ధన్నపేటలో రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందోనని గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అప్పట్లో అధికారం అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లను నియంత్రించారు. ఇప్పుడు వారు మాజీలు కావడంతో ఎవరిని నియంత్రించలేక పోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అరూరికి కష్టకాలమేనా? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను నియంత్రించడం కత్తిమీద సాముగా మారింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం కూడా ఆయనను టెన్షన్ పెట్టిస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి పేరును కూడా బీఆర్ఎస్ పరిగణనలోకి తీసుకునే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు పార్టీ జిల్లా బాధ్యతలు ఆయనకు తలనొప్పిగా మారాయని సమాచారం. ఒక్కొక్కరు సొంత పార్టీ వారిపైనే అవిశ్వాసం పెడుతుండడంతో అరూరితోపాటు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా పరిణమించిందని తెలుస్తోంది. ఈ ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా ముఖ్య నాయకులు ఏకతాటిపైకి వచ్చి అసంతృప్తులను నిలువరిస్తేనే పార్టీకి ఎంపీ ఎన్నికల్లో అవకాశాలుంటాయని, లేకపోతే పెద్ద మొత్తంలో ఎదురు దెబ్బతగిలే అవకాశముందని శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఎరబ్రెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లాకు చెందిన వారు కావడంతో బీఆర్ఎస్ బలోపేతంపై దృష్టిసారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇవి చదవండి: వినతులు పెండింగ్ ఉండొద్దు! : మంత్రి పొంగులేటి -
నా పెళ్లి జరగనివ్వండి.. మహా ప్రభో
సాక్షి, వరంగల్: ట్రాఫిక్ జామ్ కావడంతో పెండ్లి ముహూర్తం దాటిపోతోందని వరుడు కారు నుండి దిగి అధికారులను ట్రాఫిక్ క్లియర్ చేయాలని వేడుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మూడు భారీ క్రేన్లతో ఆయిల్ ట్యాంకర్ లారీని తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలను నిలిపి లారీని తీస్తుండగా వరంగల్ నుండి తొర్రూర్‌కు వెళ్తున్న పెండ్లి కొడుకు కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం ఉండటంతో పెండ్లి కుమారుడు ముహూర్తం దాటిపోతోందని ట్రాఫిక్ క్లియర్ చేయాలని కారు దిగి రోడ్డుపై నడిచాడు. భారీ క్రేన్ల వద్దకు చేరుకొని అధికారులను త్వరగా వాహనాలను పంపించాలని పెండ్లి ముహూర్తం దాటిపోతుందని వేడుకున్నాడు. దీంతో అధికారులు పెట్రోల్ ట్యాంకర్ ఉండటంతో ఇబ్బంది ఏర్పడిందని కాస్త సమయం కావాలని సూచించారు. ట్రాఫిక్ క్లియర్ కావడం లేదని భావించిన పెండ్లి కుమారుడు కారును మళ్లీ వెనక్కి తిప్పి కొంత దూరం ప్రయాణించాడు. ఇంతలోనే వాహనాలు కదిలి ముందుకు వెళ్లడంతో మళ్లీ వెనక్కి వచ్చి తొర్రూర్‌కు వెళ్లిపోయాడు. చదవండి: ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్ -
ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండంలోని ఇల్లంద వద్ద వరంగల్-ఖమ్మం నేషనల్ హైవేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐడు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా మరో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. కాగా, వీరంత తేనే తీసి అమ్ముకునే వారిగా స్థానికులు గుర్తించారు. ఇది కూడా చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు -
వర్ధన్నపేట బరిలో రిటైర్డ్ ఐపీఎస్ కేఆర్ నాగరాజు
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహరచనతో వెళ్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణను నియమించిన పార్టీ అధిష్టానం.. ఇక్కడి నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలోనూ ఆర్థిక, కుల, స్థానిక, పరిచయాలు ఉన్న వారిని ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పావులు కదుపుతోంది. కొద్ది రోజులుగా వరంగల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కొండేటి శ్రీధర్ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశముందని వార్తలొచ్చాయి. తాజాగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు రిటైర్డ్ ఎస్పీ, ఎస్సీ మాల వర్గానికి చెందిన కేఆర్ నాగరాజు పేరు వినిపిస్తోంది. ఇందులో భాగంగానే మామునూరు క్యాంపులో ఆదివారం జరిగిన ‘క్యాంప్ లైన్స్ బాయ్స్’ ఆత్మీయ సమ్మేళనం ఈయన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేసింది. మీకు మేం అండగా ఉంటాం.. మీరు రాజ కీయాల్లోకి రండి’ అంటూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో మిత్రులందరూ ప్రతిపాదించడాన్ని బట్టి చూస్తుంటే నాగరాజు వర్ధన్నపేట గడ్డ వేదికగా పోరుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కొల్లాపూర్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, మరికొందరు నేతలతోపాటు కేఆర్ నాగరాజు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లనుండడంతో ఆయన చేరిక లాంఛనమేనని స్థానిక నేతలు అంటున్నారు. మళ్లీ వర్ధన్నపేట నుంచే... స్థానికుడితోపాటు వర్ధన్నపేటలోనే ప్రొహిబిషనరీ ఎస్సైగా 1990లో పోలీస్ కెరీర్ ప్రారంభించిన నాగరాజు.. ఇప్పుడు అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. స్పెషల్ పార్టీలో పని చేసిన సమయంలోనూ ఇక్కడ చాలామందితో పరిచయం ఉంది. స్కూలింగ్ మామునూరు పోలీస్ క్వార్టర్స్‌లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, ఆ తర్వాత పది వరకు రంగశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు హనుమకొండలో చదివారు. ఉమ్మడి వరంగల్‌లో వర్ధన్నపేట ప్రొహిబిషనరీ ఎస్సై, నెక్కొండ, కేయూసీ, మొగుళ్లపల్లి, స్పెషల్ పార్టీ, మిల్స్ కాలనీ, పరకాలలో ఎస్ఐగా, ములుగు, సుబేదారి, సీఐడీ వరంగల్, పాలకుర్తిలో సీఐగా, డీఎస్పీగా వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జనగామలో పనిచేశారు. ఆతర్వాత హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో పనిచేసి మళ్లీ వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, ఆ తర్వాత ఐపీఎస్ వచ్చాక నిజామాబాద్ కమిషనర్‌గా పనిచేసి 2023 మార్చి 21న రిటైర్డ్ అయ్యారు. హాకీలోనూ జూనియర్, సీనియర్ నేషనల్స్ ఆడిన కేఆర్ నాగరాజు ఎక్కువ సమయం మాత్రం మామునూరుకే కేటాయించారు. ఇప్పటికే మామునూరు క్యాంప్‌నకు ఆనుకొని ఉన్న లక్ష్మీపురంలో ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే అరూరిపై ఉన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్‌కి ఉన్న బలం, తన వ్యక్తిగత పరిచయాలు, బంధువులు, పోలీసు శాఖలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న పరిచయాలు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఓ దఫా వర్ధన్నపేట నియోజకవర్గంలో సర్వే పూర్తిచేసినట్లు తెలిసింది. గతంలోనూ పేరు వినిపించినా.. ఇప్పటికే కేఆర్ నాగరాజు పేరు కొన్నేళ్లుగా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీనుంచే వరంగల్ ఎంపీగా పోటీచేస్తారని గుసగుసలు వినిపించినా.. చివరకు హస్తం పార్టీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు వల్ల ఎంపీగా పోటీ చేస్తే ప్రయోజనం ఉండదనుకున్న కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనుంచి నమిండ్ల శ్రీనివాస్ వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోవడం కూడా కేఆర్ నాగరాజుకు కలిసిరానుంది. ఇప్పటికే కేఆర్ నాగరాజు బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన సంకేతాలు ఇస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ఇంకోవైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరు కూడా పార్టీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు దంపతులు కూడా పార్టీని గెలిపించేవారికే సై అంటున్నట్టుగా ఉన్నారని తెలిసింది. దీంతో త్వరలోనే అభ్యర్థి ఎవరనేది తేలనుంది. -
సమీప బంధువే నమ్మించి మోసం చేశాడు!
సాక్షి, వర్ధన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఓ యువతి తనకు న్యాయం కావాలంటోంది. యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేశాడని చెబుతోంది. తన సమీప బంధువే నమ్మించి మోసం చేశాని అంటోంది. తనకు ఉండటానికి ఇళ్లు కూడా లేదని.. యాకయ్య అనే యువకుడితో తన వివాహం చేయించాలంటోంది బాధితురాలు. అతడి తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడంలేదని వాపోతోంది. -
ఎండిన పంట ఆగిన గుండె
సాక్షి,వర్ధన్నపేట: పండిన పంట ఎండిపోవడంతో రైతు గుండె ఆగిపోయింది. నీటి కోసం బోర్లు వేస్తే కన్నీరే మిగిలింది. చేసిన అప్పుల భారం పెరగడంతో ఆయువు తీసుకున్న ఘటన వర్ధన్నపేటలో శనివారం జరిగింది. వర్ధన్నపేట మునిసిపాలిటీ పరిధిలోని డీసీ తండా శివారు గుబ్బెటి తండాకు చెందిన ఆంగోతు మొగిళి(50) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో గతంలో ఉన్న బోరుబావి ఎండిపోయింది. నీటి వసతి లేక పోవడంతో మూడు బోరు బావులు తవ్వినా నీరు రాలేదు. దీంతో పాటు రాయపర్తి మండలం తిర్మాలాయపెల్లికి చెందిన వశపాక నర్స ఎల్లయ్యకు చెందిన 30 గుంటల భూమి కౌలుకు తీసుకుని వ్యసాయం చేస్తున్నాడు. ఈ రబీలో బోరులో నీరు ఎక్కువగా రాదని గ్రహించి తన భూమిలోని 30 గుంటల్లో వరి నాటు వేశాడు. వేసవి రాక ముందే నీరు పోసే బోరు ఎండి పోవడంతో వరి పంట ఎండి పోతుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొగిళికి భార్య కౌసల్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పిల్లలు పుట్టడం లేదని నగ్నంగా పూజలు!
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సంతానం కలగడం లేదనే కారణంతో కొంత మంది మహిళలను గ్రామ శివార్లకు తీసుకెళ్లి నగ్నంగా క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షుద్రపూజలను అడ్డుకుని ఇద్దరు మంత్రగాళ్లను సహా అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఐదుగురు గర్భం దాల్చక పోవడంతో.. పర్వతగిరికి చెందిన ఓ మహిళను సంప్రదించగా.. పూజలు నిర్వహించాలని చెప్పింది. దీంతో స్థానిక ఎస్సారెస్పీ కాలువ వద్దకు బాధితురాళ్లను పిలిపించి ప్రత్యేక పూజల పేరిట వారిని నగ్నంగా చేసి ఏవో మంత్రాలు చదివిస్తుండగా.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రాలు చేస్తున్న ఇద్దరిలో ఓ మహిళతో పాటు ఓ పురుషుడు ఉన్నాడు. కాగా బాధితురాళ్లలో ఓ యువతి భర్త జైళ్ల శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తుండటం గమనార్హం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.