సాక్షి, వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహరచనతో వెళ్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణను నియమించిన పార్టీ అధిష్టానం.. ఇక్కడి నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలోనూ ఆర్థిక, కుల, స్థానిక, పరిచయాలు ఉన్న వారిని ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పావులు కదుపుతోంది. కొద్ది రోజులుగా వరంగల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కొండేటి శ్రీధర్ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశముందని వార్తలొచ్చాయి. తాజాగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు రిటైర్డ్ ఎస్పీ, ఎస్సీ మాల వర్గానికి చెందిన కేఆర్ నాగరాజు పేరు వినిపిస్తోంది.
ఇందులో భాగంగానే మామునూరు క్యాంపులో ఆదివారం జరిగిన ‘క్యాంప్ లైన్స్ బాయ్స్’ ఆత్మీయ సమ్మేళనం ఈయన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేసింది. మీకు మేం అండగా ఉంటాం.. మీరు రాజ కీయాల్లోకి రండి’ అంటూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో మిత్రులందరూ ప్రతిపాదించడాన్ని బట్టి చూస్తుంటే నాగరాజు వర్ధన్నపేట గడ్డ వేదికగా పోరుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
కొల్లాపూర్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, మరికొందరు నేతలతోపాటు కేఆర్ నాగరాజు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లనుండడంతో ఆయన చేరిక లాంఛనమేనని స్థానిక నేతలు అంటున్నారు.
మళ్లీ వర్ధన్నపేట నుంచే...
స్థానికుడితోపాటు వర్ధన్నపేటలోనే ప్రొహిబిషనరీ ఎస్సైగా 1990లో పోలీస్ కెరీర్ ప్రారంభించిన నాగరాజు.. ఇప్పుడు అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. స్పెషల్ పార్టీలో పని చేసిన సమయంలోనూ ఇక్కడ చాలామందితో పరిచయం ఉంది. స్కూలింగ్ మామునూరు పోలీస్ క్వార్టర్స్‌లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, ఆ తర్వాత పది వరకు రంగశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు హనుమకొండలో చదివారు. ఉమ్మడి వరంగల్‌లో వర్ధన్నపేట ప్రొహిబిషనరీ ఎస్సై, నెక్కొండ, కేయూసీ, మొగుళ్లపల్లి, స్పెషల్ పార్టీ, మిల్స్ కాలనీ, పరకాలలో ఎస్‌ఐగా, ములుగు, సుబేదారి, సీఐడీ వరంగల్, పాలకుర్తిలో సీఐగా, డీఎస్‌పీగా వరంగల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, జనగామలో పనిచేశారు.
ఆతర్వాత హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో పనిచేసి మళ్లీ వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, ఆ తర్వాత ఐపీఎస్ వచ్చాక నిజామాబాద్ కమిషనర్‌గా పనిచేసి 2023 మార్చి 21న రిటైర్డ్ అయ్యారు. హాకీలోనూ జూనియర్, సీనియర్ నేషనల్స్ ఆడిన కేఆర్ నాగరాజు ఎక్కువ సమయం మాత్రం మామునూరుకే కేటాయించారు. ఇప్పటికే మామునూరు క్యాంప్‌నకు ఆనుకొని ఉన్న లక్ష్మీపురంలో ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ, ఎమ్మెల్యే అరూరిపై ఉన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్‌కి ఉన్న బలం, తన వ్యక్తిగత పరిచయాలు, బంధువులు, పోలీసు శాఖలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న పరిచయాలు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఓ దఫా వర్ధన్నపేట నియోజకవర్గంలో సర్వే పూర్తిచేసినట్లు తెలిసింది.
గతంలోనూ పేరు వినిపించినా..
ఇప్పటికే కేఆర్ నాగరాజు పేరు కొన్నేళ్లుగా పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీనుంచే వరంగల్ ఎంపీగా పోటీచేస్తారని గుసగుసలు వినిపించినా.. చివరకు హస్తం పార్టీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు వల్ల ఎంపీగా పోటీ చేస్తే ప్రయోజనం ఉండదనుకున్న కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనుంచి నమిండ్ల శ్రీనివాస్ వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోవడం కూడా కేఆర్ నాగరాజుకు కలిసిరానుంది. ఇప్పటికే కేఆర్ నాగరాజు బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన సంకేతాలు ఇస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ఇంకోవైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరు కూడా పార్టీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు దంపతులు కూడా పార్టీని గెలిపించేవారికే సై అంటున్నట్టుగా ఉన్నారని తెలిసింది. దీంతో త్వరలోనే అభ్యర్థి ఎవరనేది తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment