సాక్షి, కాకినాడ : స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వారి స్థానాలను వదిలేందుకు ఇష్టపడడంలేదు. సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉండిపోవడంతో చేయి తడపందే ఏ పనీ జరగడంలేదు. వారు సమయపాలన పాటించకపోవడంతో కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు.సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా చిట్‌ఫండ్, జిల్లా ఆడిట్ కార్యాలయాలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు ‘ఎ’ కేటగిరీలోను, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్, ఆడిట్ కార్యాలయాల ఉద్యోగులు ‘సి’ కేటగిరిలో ఉంటారు.
బదిలీల సందర్భంలో ఎ కేటగిరీలో పని చేసే ఉద్యోగులు సి కేటగిరీలోకి (జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్ కార్యాలయం, ఆడిట్ కార్యాలయాలు) బదిలీ అవుతారు. నెల రోజుల అనంతరం ఏలూరు డీఐజీ కార్యాలయంలో పైరవీలు చేయించుకుని ఆఫీస్ ఆర్డర్ పేరుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని యథాస్థానాలకు చేరిపోతారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని మూడు విభాగాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నవారు సుమారు 15 నుంచి 20 ఏళ్ల పాటు ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు కాకినాడలోని ఈ మూడు విభాగాల్లోనే రంగులరాట్నంలా తిరుగుతున్నారు. ఈ కార్యాలయంలో చాలామంది ఉద్యోగులు సమయ పాలన పాటించిన దాఖలాలు లేవు. డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఏ పనీ జరగదు. ఇప్పుడు బదిలీల్లో మళ్లీ ఇదే తంతు నడుస్తోంది.
ఆఫీస్ ఆర్డర్‌తో బదిలీలు ఇలా...
కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నప్పటికీ గత కౌన్సెలింగ్‌లో వాటిని భర్తీ చేయలేదు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతో ఆఫీస్ ఆర్డర్ పేరుతో ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందుకు ఏడాదికి రూ.2 లక్షల చొప్పున ఒక ఉద్యోగి నుంచి ఉన్నతాధికారులు తీసుకుంటారని, ఆఫీసర్ ఆర్డర్ పేరుతో బదిలీ చేస్తారని ఉద్యోగవర్గాలు చెబుతున్నారు. ఈ బదిలీల కౌన్సెలింగ్‌లోనైనా పైరవీలకు తావులేకుండా సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తారో లేదో వేచి చూడాలి.
బదిలీల జాబితాల్లో అవకతవకలు
ఏళ్ల తరబడి ఉన్న సీనియర్ అసిస్టెంట్లు గ్రూపుగా ఏర్పడి కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా జాబితా తయారు చేసుకుని, ఇతర ప్రాంతాలకు చెందిన సీనియర్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించకుండా చేస్తున్నారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీల జాబితాల్లో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం కాకినాడలోనే ఎ కేటగిరీలో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ సి కేటగిరీగా ఉన్నట్టు బదిలీల జాబితాలో తయారు చేసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment