సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో రోజురోజుకూ వెలుస్తున్న కొత్త ఆవాసాలు, కాలనీలకనుగుణంగా చెత్త కూడా పెరుగుతోంది. ఈ చెత్త ఒకేచోట గుట్టలుగా పేరుకుపోకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే చిన్న మొత్తాల్లో నిల్వ చేసేందుకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా సర్కిల్‌కు మూడు వంతున 30 సర్కిళ్లకు 90 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్‌ఫర్ పాయింట్స్(ఎస్‌సీటీపీ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
కొన్ని సర్కిళ్లలో మూడు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు దొరకకపోవడం.. కొన్ని ప్రాంతాల్లో దొరికినా స్థానికుల నుంచి ఎదురైన వ్యతిరేకతతో ఎలాగోలా 24 ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటు చేయగలిగారు. స్థల సమస్య కారణంగా మిగతా 66 ఎస్‌సీటీపీలను ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ చెత్త నిర్వహణ పకడ్బందీగా సాగాలంటే ఏరోజుకారోజు తరలించేందుకు వీలుగా ఎస్‌సీటీపీలు లేని ప్రాంతాల్లో మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచి వాటి ద్వారా చెత్త తరలిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
మరో ఆరు వాహనాలు అదనంగా ఉంచి 72 (రెఫ్యూజి కంటైనర్) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. వీటినే మొబైల్ ఎస్‌సీటీపీలుగా చెబుతోంది. కనీసం వెయ్యి చదరపు మీటర్ల స్థలం ఉన్నా ఎస్‌సీటీపీలను ఏర్పాటు చేయగలమని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. అందుకోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి ఎస్‌సీటీపీలతోపాటు మొబైల్ ఎస్‌సీటీపీల వల్ల సర్కిళ్లనుంచి చెత్తను ఎప్పటికప్పుడు జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకుతరలిస్తునట్లు తెలిపింది.
డంపింగ్‌యార్డుకు తరలించేవాహనాల్లో పోర్టబుల్ సెల్ఫ్ కాంపాక్టర్, స్టాటిక్ కాంపాక్టర్, సీల్డ్ కంటైనర్ సదుపాయాలున్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తుండటంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment