కళాశాల ఎదుట బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు
దుండిగల్: ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడి భవిష్యత్ అంధకారమైందని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు జేఈఈ పరీక్ష కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరికి పరీక్ష రాసేందుకు వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలపడంతో ఉద్రికత్త నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7, 8, 9 తేదీల్లో దేశ వ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దుండిగల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి బిక్కుమల్ల విష్ణుసాయి ఉదయం షిప్ట్‌లో పరీక్షకు హాజరయ్యాడు. ఆన్‌లైన్‌లో 3 గంటల పాటు జరిగిన ఈ పరీక్షలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రతి ప్రశ్నకు జవాబు రాబట్టేందుకు వీలుగా విద్యార్థులు రఫ్ పేపర్లను వినియోగిస్తారు.
అయితే విష్ణుసాయి పరీక్ష కేంద్రంలో ముందుగా రెండు అడిషనల్ షీట్ లు తీసుకున్నాడు. అనంతరం అదనంగా అడిషనల్ షీట్ కావాలని కోరగా ఇన్విజిలేటర్ అందుకు నిరాకరించాడు. కేవలం నాలుగు పేపర్లను మాత్రమే ఇవ్వడంతో సదరు విద్యార్థి పరీక్ష సరిగా రాయలేక పోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వీరికి మద్దతు తెలపడంతో పరీక్షా కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడికి వచ్చిన కళాశాల ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అబ్జర్వర్ రాము మాట్లాడుతూ సిబ్బంది పొరపాటు కారణంగా తప్పిదం జరిగిందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించి మరోసారి విద్యార్థికి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయినా తల్లిదండ్రులు శాంతించకపోవడంతో తమ ఇన్విజిలేటర్ తప్పిదం ఉందని అంగీకరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
ఐదేళ్లుగా కష్టపడుతున్నా..
జేఈఈ పరీక్ష కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నా. ఎంట్రన్స్ పరీక్షలో 75 ప్రశ్నలకు జవాబులు రాయాలంటే కనీసం 20 రఫ్ పేపర్లు అవసరముంటుంది. అయితే ఇన్విజిలేటర్ సార్‌ను ఎంత బతిమాలినా కేవలం నాలుగు పేపర్లే ఇవ్వడంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను. దయచేసి నేను మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలి.–విష్ణుసాయి, విద్యార్థి
భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది
మా కుమారుడు విష్ణుసాయి టెన్త్‌లో 88 శాతం మార్కులు సాధించాడు. రెండు సార్లు ఒలంపియాడ్‌లో విన్నర్‌గా నిలిచాడు. అతడికి 8వ తరగతి నుంచి ఐఐటీ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఎంతో కష్టపడి చదివి ఎంట్రన్స్‌లో పాస్ అవుతాడన్న నమ్మకం ఉంది. అయితే ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల మా కుమారుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. –శ్రీకాంత్, విద్యార్థి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment