పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
విజయనగరం,బొబ్బిలి: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్ల సమస్య వచ్చి పడింది. జిల్లాలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో అర్హత లేని వారిని నియమించి పరీక్షలు జరిపించేస్తున్నారు. ఎక్కువ రూమ్‌లున్న కేంద్రాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షకు సంబంధించిన సబ్జెక్ట్‌ను వారిని కాకుండా ఇతర సబ్జెక్ట్‌లకు సంబంధించిన వారిని నియమించాల్సి ఉంది. వారికి కూడా తగిన విద్యార్హతలుండాలి. ప్రతి ఏటా ఈ విధంగానే నిబంధనల ప్రకారం అర్హులనే ఇన్విజిలేటర్లుగా నియమించగా, ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా అనర్హులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. దిగువ స్థాయి అర్హత ఉన్నవారిని ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 49,078 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరి కోసం 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పలు కళాశాలల్లో వార్డెన్లు, ఇతర తక్కువ స్థాయి విద్యార్హత ఉన్నవారినే ఇన్విజిలేటర్లుగానియమించారు. జరుగుతున్న పరీక్షకు సంబంధించిన వారిని కాకుండా వేరే వారిని ఇన్విజిలేటర్లుగా నియమించాలి. అయితే అంతమంది అందుబాటులో లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కూడా నియమిస్తున్నారు. దీని వల్ల పరీక్షల్లో ఇబ్బందులు లేకపోయినప్పటికీ కాస్తయినా పరిజ్ఙానం ఉండాల్సిన వారు అవసరమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సౌకర్యాలు అంతంతమాత్రం..
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యాలు కూడా పట్టిపీడిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పలు కేంద్రాల్లో మరుగుదొడ్లు లేకపోవడం విచారకరం.
చర్యలు తీసుకుంటాం.
అర్హతగల ఇన్విజిలేటర్ల నియామకానికి అన్ని చర్యలూ తీసుకున్నాం. కొన్ని చోట్ల గదులు ఎక్కువ ఉన్న కారణంగా అంత మందిని సిద్ధం చేయలేకపోయాం. పరీక్షలు సక్రమంగానే జరుగుతున్నాయి. మూడు బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. సిట్టింగ్, ఫ్‌లైయింగ్ స్క్వాడ్‌లతో పాటు నేను కూడా స్థానికంగా పర్యవేక్షిస్తున్నాను. – విజయలక్ష్మి, ఆర్‌ఐఓ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment