యాంటీజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే ఆ ఫలితాన్ని నమ్మలేం. కచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. కానీ చాలా మంది చేయించుకోవట్లేదు. అందుకే మరిన్ని ఆర్టీపీసీఆర్ కేంద్రాలు. వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రామగుండం, భువనగిరి, జనగాం, వికారాబాద్ జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు.
సాక్షి, హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు కొత్తగా 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తు న్నారు. ప్రస్తుతం 17 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా థర్డ్‌వేవ్ వస్తుందన్న హెచ్చరికలతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దీనికోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిర్ధారణకు 2 రకాల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ర్యాపిడ్ యాంటిజెన్, రెండోది ఆర్‌టీపీసీఆర్. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ద్వారా పావు గంటలోనే ఫలితం వస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే, అది పూర్తిగా కరెక్టే. కానీ నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం దాని ఫలితాన్ని పూర్తిగా నమ్మలేం. మళ్లీ ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనేది నిబంధన.
చాలామంది యాంటిజెన్ పరీక్ష చేయించుకొని అందులో నెగటివ్ వచ్చి.. లక్షణాలున్నా కూడా సాధారణంగా తిరిగేస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం లేదు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు అంతగా అందుబాటులో లేకపోవడం కూడా దీనికి కారణం. ఇలా అనేక కేసులు మిస్ కావడం, సీరియస్ అవుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. అంతేకాదు రాష్ట్రంలో 90 శాతంపైగా ర్యాపిడ్ పరీక్షలే జరుగుతున్నాయని కేంద్రం ఇటీవల వెల్లడించింది. 10 శాతంలోపే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయంది. దీంతో ఆర్‌టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. యాంటిజెన్ పరీక్ష ద్వారా పాజిటివ్ ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించడానికి వీలుంది. ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించాలంటే ఇప్పుడు రెండుమూడు రోజులకు కూడా ఫలితం రావడంలేదు. ఒక్కోసారి వారం సమయం కూడా పడుతోంది. అందుకే వైద్యాధికారులు, ప్రజలు యాంటిజెన్ పరీక్షలకే మొగ్గుచూపుతున్నారు. కొత్తగా ఆర్‌టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో తక్కువ సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి వీలుపడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
Covid Test: 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలు
Published Wed, Jun 23 2021 3:55 AM | Last Updated on Wed, Jun 23 2021 3:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment