కరోనాపై హెచ్చరిక.. అప్రమత్తం | Telangana Health Department Alert On Corona Virus Third Wave | Sakshi
Sakshi News home page

కరోనాపై తాజా హెచ్చరిక.. అప్రమత్తం

Published Tue, Jun 15 2021 2:08 AM | Last Updated on Tue, Jun 15 2021 9:25 AM

Telangana Health Department Alert On Corona Virus Third Wave - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ, మలేరియా, ఇతర వైరల్, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు ఏవైనా సీజనల్‌గా వస్తుంటాయి. కానీ కరోనా మాత్రం.. సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా సోకే అవకాశం ఉంటుందని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రతి నిత్యం తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మిగతా వ్యాధులకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోమవారం సీజనల్‌ వ్యాధుల కేలండర్‌ను విడుదల చేసింది. ఏ సీజన్‌లో ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది, ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అన్న సమాచారాన్ని అందజేసింది. జూలై నుంచి అక్టోబర్‌ మధ్య డెంగీ, మలేరియా, సీజనల్‌  జ్వరాలు వ్యాపిస్తాయని.. నవంబర్‌–మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని.. ఏప్రిల్‌– జూన్‌ మధ్య వడ దెబ్బ, మలేరియా వంటివి ఇబ్బంది పెడతాయని తెలిది. కరోనా ఏడాది పొడవునా పట్టి పీడించే అవకాశం ఉందని పేర్కొంది. సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్‌ అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలపాటు నడిచే ప్రత్యేక సెల్‌ను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. దీనికి 040–24651119 ఫోన్‌ నంబర్‌ కేటాయించింది. అంటు వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్‌ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని సూచించింది. 

వానాకాలంలో మరింత జాగ్రత్త 
వైద్యారోగ్య శాఖ క్యాలెండర్‌ ప్రకారం.. ప్రస్తుత సీజన్‌లో కరోనాతోపాటు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, డయేరియా, ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోనియా, సీజనల్‌ జ్వరాలు వచ్చే అవకాశముంది. పాము కాట్లు సంభవిస్తాయి. ఈ అంశాలపై స్థానిక సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. శుక్రవారం డ్రైడే నిర్వహించాలని.. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, బాగా వండిన ఆహారాన్నే తినాలని తెలియజేయాలి. అంటువ్యాధులన్నింటినీ నియంత్రించేందుకు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించేలా చూడాలి. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలి. మురికి కాల్వలు, ఆరు బయట నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, పొదలను శుభ్రం చేయాలి. స్టోరేజీ ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేపట్టాలి. ప్రజల్లోకి వెళ్లి ఫీవర్‌ సర్వే చేయాలి. అవసరమైన మందుల కిట్లు అందజేయాలి. హైరిస్క్‌ ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేయాలి. ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్‌ ఓపీలను నిర్వహించాలి. ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేయాలి. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. యాంటీ బయాటిక్స్, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలి.

చలికాలంలో వైరస్‌ల ప్రమాదం 
చలికాలంలో కరోనాతోపాటు స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ సీజన్‌లో వైరస్‌ల ప్రమాదం అధికం. గాలి నుంచి సోకే వైరల్‌ వ్యాధులను నియంత్రించేందుకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల శుభ్రత తప్పనిసరి. లక్షణాలు లేని కోవిడ్‌ రోగుల కోసం ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వానాకాలం తరహాలో చలికాలంలోనూ ఫీవర్‌ సర్వే చేసి, అవసరమైన మందులు అందజేయాలి. స్వైన్‌ఫ్లూ, కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో ఫీవర్‌ ఓపీ చేయాలి. ఒసెల్టామివిర్‌/డాక్సిసైక్లిన్, యాంటీబయాటిక్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైన ఆక్సిజన్‌ నిల్వ, సరఫరా ఉండాలి. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు ఇబ్బందిపెడతాయి. వాటికి సంబంధించి చికిత్స అందించడంతోపాటు ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలి. 

ఎండాకాలంలో కోవిడ్‌తో పాటు మలేరియా, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎండల కారణంగా వడదెబ్బ, కుక్కకాట్లు వంటివి సంభవిస్తాయి. యథావిధిగా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రజలు ఇళ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపాలిటీలు, పంచాయతీలు పబ్లిక్‌ స్థలాల్లో నీడ వసతి, మంచినీరు అందుబాటులో ఉంచాలి. వైద్య సిబ్బంది ఫీవర్‌ సర్వేను కొనసాగించాలి. కోవిడ్, మలేరియా పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో ఫీవర్‌ ఓపీ, ఐసోలేషన్‌ వార్డులు ఉంచుకోవాలి. ఆక్సిజన్‌ స్టోరేజీ, సరఫరా ఏర్పాట్లు తప్పనిసరి. క్లోరోక్విన్‌/డాక్సిసైక్లిన్‌ సిద్ధంగా పెట్టుకోవాలి, యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచుకోవాలి. 
 
అన్ని కాలాల్లో కరోనా
సీజనల్‌ వ్యాధులు ఆయా కాలాలను బట్టి వస్తూ పోతుంటాయి. కానీ కోవిడ్‌ మాత్రం అన్ని సీజన్లలోనూ వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌ అన్ని కాలాల్లో మనగలుగుతుంది. కాబట్టి సీజనల్‌ కేలండర్‌లో దాన్ని మూడు సీజన్లలోనూ ప్రస్తావించాం. ప్రజలు ప్రతినిత్యం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  
- డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement