పురుగుమందులు, ఎరువుల డీలర్లకు ఇక తప్పనిసరి
15వరకు దరఖాస్తులకు గడువు
కరీంనగర్: దుకాణాల్లో విరామం లేకుండా గడిపే డీలర్లు తరగతి గదిలో కూర్చోవాల్సిందే. ఇక విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లెక్కలతో కుస్తీ పట్టేవారంతా నిపుణుల బోధనలు వినాల్సిందే. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ డీలర్ వ్యవసాయ శాఖ నుంచి డీఏఈఎస్‌ఐ డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం పొందాల్సిందేనని స్పష్టం చేసింది. లేదంటే వారిక విక్రయాలు చేసే అవకాశం ఉండదు.
కట్టుదిట్టమైన శిక్షణ.. తదుపరి డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం, ఆపై రైతులకు విక్రయిస్తున్న వాటిపై నిఘా వంటి ప్రత్యేక కార్యాచరణ ఉండనుంది. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) నేతృత్వంలో డిప్లొమా కోర్సు నిర్వహించనున్నారు. గతంలో జమ్మికుంట కేవీకేలో పలువురు డీలర్లకు డిప్లమా కోర్సు శిక్షణ జరగగా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను సవరించింది. రైతు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు ఇచ్చి ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. డీలర్లు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ పేర్కొన్నారు.
48 వారాలు.. నిపుణులతో బోధన..
డీలర్లకు ఏడాది పాటు శిక్షణనివ్వనున్నారు. వారంలో ఒక రోజు ప్రతీ ఆదివారం తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. కృషి భవన్‌ను శిక్షణకు వేదికగా నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోనే డిప్లమా కోర్సు శిక్షణ ఉండాలని కేంద్రం నిర్దేశించగా తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు శిక్షణ కేంద్రం ఏడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిక్షణలో 48 ఆదివారాలు తరగతి గదిలో దుక్కుల నుంచి విత్తనాలు, సస్యరక్షణ చర్యలు తదితర సమగ్ర అంశాలను వివరించనున్నారు. మిగతా 8 వారాలు క్షేత్రస్థాయి శిక్షణ ఉండనుంది. వివరాలకు 81796 49595 నంబర్‌ను సంప్రదించాలని ఏడీ సూచించారు.
ఒక్కో బ్యాచ్‌కు 40మంది డీలర్లు..
విత్తన క్రిమిసంహారక, ఎరువు విక్రయ డీలర్లకు డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ టు ఇన్‌పుట్ డీలర్స్ (డీఏఈఎస్‌ఐ) డిప్లమా కోర్సుకు ఒక్కో బ్యాచ్‌కు 40 మందిని ఎంపిక చేయనున్నారు. లైసెన్స్ పొందిన డీలర్ల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కలెక్టరేట్ వ్యవసాయ శాఖలోని రైతు శిక్షణ కేంద్రం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. డీలర్ల లైసెన్స్ ప్రతిని సంబంధిత ఏడీఏ ధ్రువీకరణతో సమర్పించాలి. దరఖాస్తుదారు తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు రూ.10వేలు డీడీ చెల్లించి, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు.
పరీక్ష పాసైతేనే ధ్రువీకరణ..
ఏదో మొక్కుబడిగా కాకుండా సమగ్ర అవగాహన కలిగేలా కోర్సును ఏర్పాటు చేశారు. కాలక్షేపం చేస్తే సదరు డీలరుకు ఇబ్బందులు తప్పవు. 48 వారాలు జరిగిన కోర్సుపై పరీక్షలు నిర్వహించనున్నారు. ప్ర తీ అంశంపై పట్టు సాధించాల్సిందే. పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తరగతులు జరుగనుండగా భోజన వసతి కల్పించనున్నారు.
ఫెసిలిటేటర్ నియామకానికి గడువు 15
ఇందుకు ఫెసిలెటేటర్‌ను నియమించేందుకు ఆత్మ ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ(అగ్రికల్చర్) లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివి వ్యవసాయశాఖ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా కేవీకేలో 20 ఏళ్ల అనుభవం ఉన్నవారిని ఫెసిలిటేటర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్దేశించింది. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 గడువు. ప్రతి ఆదివారం జరిగే శిక్షణలో శాస్త్రవేత్తలు, నిపుణులతో తరగతులు నిర్వహించడం వీరి విధి. త్వరలో శిక్షణ ప్రారంభిస్తామని, డీలర్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ వివరించారు.
ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..!
Comments
Please login to add a commentAdd a comment