సాక్షి, హైదరాబాద్: ఎరువుల నుంచి విత్తనాలు, పురుగుల మందులు ఇలా అన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. రైతులకు అవసరయ్యే సేవలు విస్తరించేందుకు ‘వన్‌స్టాప్ షాప్’ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాస్ (పీఎంకేఎస్‌కే) పథకంలో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇది ఇక్కడ కూడా అమలులోకి వస్తే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ‘వన్‌స్టాప్ షాప్’ కేంద్రాలుగా మార్చుతారు.
ఒకేచోట అన్ని సేవలు...
దేశవ్యాప్తంగా లక్ష ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఉన్నాయి. వాటిల్లో 73,098 ప్యాక్స్‌లు ఎరువుల లైసెన్స్ కలిగి ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా లైసెన్స్ పరిధిలోకి తీసుకొస్తారు. తెలంగాణలో 1,423 ప్యాక్స్ ఉన్నాయి. అందులో 1,261 చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16,915 ఎరువుల రిటైల్ దుకాణాలుండగా, 14,870 చురుగ్గా పనిచేస్తున్నాయి.
అన్ని ప్యాక్స్‌లను ఎరువుల వ్యాపారంలోకి తీసుకొచ్చి అవన్నీ చురుగ్గా పనిచేసేలా కృషి చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్యాక్స్‌ల ద్వారా రైతులకు యూరియా, డీఏపీ వంటి ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి వాటిల్లో అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా అన్ని రకాల వ్యవసాయ ఉపకరణాలు అందించాలనేదే ఉద్దేశం.
నాణ్యమైన సేవలు అందించవచ్చు
దేశంలో సహకార వ్యవసాయ పద్ధతులు అనుసరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ప్రైవేట్‌లో ఎరువులు, పురుగు మందులు, విత్తన వ్యాపారుల ద్వారా అనేకచోట్ల కల్తీ, నకిలీ రాజ్యమేలుతోంది. ఆ దందాకు చెక్ పెట్టాలంటే ‘వన్‌స్టాప్ షాప్’ విధానం మేలని కేంద్రం చెబుతోంది. ప్యాక్స్ ద్వారా యూరియా వెళ్లడం వల్ల బ్లాక్ మార్కెట్ జరగకుండా చూసుకోవచ్చు.
అంతేగాకుండా కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రైతులకు అంటగట్టకుండా నిరోధించవచ్చు. తక్కువ ధరల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు , సేంద్రీయ ఎరువులు కూడా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో ప్యాక్స్ ద్వారానే మార్కెటింగ్ వసతి కల్పించే ఆలోచనలో కూడా ఉన్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అయితే ప్యాక్స్‌ల్లో అనేకం అప్పుల్లో కూరుకుపోయాయని, అవి ప్యాక్స్ రాజకీయాల్లో మునిగిపోవడం వల్ల వాటిల్లో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయన్న చర్చ జరుగుతోంది. వాటిని అన్ని రకాలుగా బలోపేతం చేస్తే ‘వన్‌స్టాప్ షాప్’ విధానం విజయవంతమవుతుందని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment