సాక్షి, హైదరాబాద్: ఎరువుల ధరలను ఇఫ్కో కంపెనీ భారీగా పెంచింది. 50 కేజీల డీఏపీ బస్తా ధర ఇదివరకు రూ. 1,200 ఉండగా... దాన్ని ఏకంగా రూ.1,900 చేయడం గమనార్హం. అంటే ఒక బస్తాపై రూ.700 పెంచింది. ఈ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వచ్చాయని ఇఫ్కో తెలిపింది. అలాగే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా ఒక్కో బ్యాగుపై రూ. 425 నుంచి రూ. 615 వరకు పెరిగాయి. పాత స్టాకును పాత ధరకే విక్రయించాలని, కొత్త సరుకుకు మాత్రమే పెరిగిన ధరలు వసూలు చేయాలని ఇఫ్కో తెలిపింది. అయితే ఇప్పుడు పాత స్టాకే అందుబాటులో ఉందని, ఇంకా కొత్త స్టాక్ మొదలు కాలేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరుగుతూ అనేక రకాలుగా అన్నదాతలపై భారం పడుతుండగా ఎరువుల ధర భారీగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
పైగా మన రాష్ట్రంలో రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. రాష్ట్రంలో రెండు సీజన్లలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులు వాడుతున్నారు. అయితే వేయాల్సిన దానికంటే ఎక్కువగా వేస్తున్నారు. ఇది కూడా అన్నదాతపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దేశంలో సగటున ఎకరానికి 51.2 కిలోల ఎరువులు వాడితే, రాష్ట్రంలో ఎకరానికి 185 కిలోల ఎరువులు రైతులు వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే ఒక బస్తా ఎరువులు వేయాల్సిన చోట మరో రెండు, మూడు బస్తాలు ఎక్కువ వేస్తున్నారు. దేశంలో యూరియా ధరలపై కేంద్రం నియంత్రణ ఉంది. ధరల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. కానీ మిగతా ఎరువుల విషయానికొస్తే మాత్రం కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి.
ఏమైనా అంటే ముడిసరకుల ధరల పెరుగుదలను కారణంగా చూపుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన ముడిసరకును ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఫాస్పరిక్ ఆమ్లం ధర పెరగడంతో ఎరువుల ధర భారీగా పెంచాల్సి వస్తోందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరగడంతో తాము అనివార్యంగా రైతులపైనే భారం వేయాల్సి వస్తోందంటున్నారు. కాగా ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచాలని నెలన్నర క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
భారీగా పెరిగిన డీఏపీ ధరలు..
Published Fri, Apr 9 2021 2:45 AM | Last Updated on Fri, Apr 9 2021 2:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment