ఇఫ్కో రూపొందించిన నానో యూరియా బాటిల్
సాక్షి, అమరావతి: సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) దీనిని ఇటీవల ఆవిష్కరించింది. ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కారం. నానో టెక్నాలజీపై కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతుండగా.. ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాను ఇఫ్కో నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది.
ఏమిటీ నానో యూరియా..
తరతరాలుగా మనందరికీ తెలిసిన సంప్రదాయ యూరియా తెల్లటి గుళికల రూపంలో ఉంటుంది. బస్తాలలో వస్తుంది. దీని స్థానంలో ఇప్పుడు ద్రావణం రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు. 45 కిలోల యూరియాను కేవలం 500 మిల్లీలీటర్ల సీసాలో పట్టేలా చేశారు. అంటే బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి వచ్చాయి. పైగా ఇది మహా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సీసాలో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుంది. భావి ఎరువుల మార్కెట్ రంగంలో ఇదో మేలి మలుపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న వేపపూత యూరియా కన్నా ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని భావిస్తున్నారు. సంప్రదాయ యూరియా కన్నా ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా పంటల దిగుబడిని 8 శాతం పెంచుతుంది. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర రూ.240 కాగా.. యూరియా బస్తా ధర రూ.268.
Comments
Please login to add a commentAdd a comment