గ్రామీణ్ హెల్త్‌కేర్‌లో ఇఫ్కోకు 26% వాటా
న్యూఢిల్లీ: సహకార ఎరువుల తయారీ దిగ్గజం ఇఫ్కో తాజాగా స్టార్టప్ సంస్థ గ్రామీణ్ హెల్త్ కేర్‌లో 26 శాతం వాటాలు దక్కించుకుంది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రామీణ్ హెల్త్ కేర్.. ప్రత్యేక క్లినిక్‌ల ద్వారా అధునాతన వైద్య పరీక్షలు మొదలైన సేవలు అందిస్తోంది. 2016 మే నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్, హరియాణా, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో 30 హెల్త్ కేర్ క్లినిక్‌లు ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి మరో 20 ప్రారంభించాలని సంస్థ యోచిస్తోంది.
ప్రాథమిక వైద్య సేవల కల్పన కోసం నెలవారీ స్వల్ప రుసుములతో హెల్త్ కార్డ్‌లు కూడా జారీ చేసే అంశం పరిశీలిస్తోంది. చౌకగా వైద్య సేవలు అందుబాటులోకి తేవడం ద్వారా గ్రామీణ్ హెల్త్ కేర్ సర్వీసులు రైతాంగంలో ప్రాథమిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఉపయోగపడగలవని ఇఫ్కో ఎండీ యూఎస్ అవస్తి తెలిపారు. తృతీయ శ్రేణి గ్రామీణ హబ్‌లలో ఉండే ఇఫ్కో బజార్ అవుట్‌లెట్స్‌లో కూడా ప్రాథమిక వైద్య కేంద్రాల ఏర్పాటుకు గ్రామీణ్ హెల్త్ కేర్ సంస్థలో పెట్టుబడులు తోడ్పడగలవని వివరించారు.