సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దక్షిణాదిన బెంగళూరులో తొలి ప్లాంట్ నెలకొల్పిన భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) రెండో ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ప్లాంట్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వంతో ఇఫ్కో సంప్రదింపులు జరుపుతోంది.
ఎందుకింత ఆదరణ....?
సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా దవ్ర రూపంలో ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియాకు విశేష ఆదరణ లభిస్తోంది. యూరియా బస్తాతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, మెరుగైన పనితీరు, ద్రవరూప యూరియా బాటిళ్లను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుండటం, రవాణా ఖర్చులు ఆదా కావడం దీనికి ప్రధాన కారణాలు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నానో యూరియా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రూ.250 కోట్లతో ఏపీలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ఇఫ్కో నిర్ణయించింది. కోటి లీటర్ల సామర్థ్యంతో నెల్లూరు అగ్రి సెజ్‌లో ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో ఆసక్తి చూపుతోంది. కనీసం 20 ఎకరాల్లో ప్లాంట్ నెలకొల్పేందుకు భూ కేటాయింపుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.
బస్తా యూరియాతో సమానం..
45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియాను బాటిళ్లలో ఇఫ్కో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. బస్తా యూరియా ధర మార్కెట్‌లో రూ.266.50 ఉండగా నానో యూరియా బాటిల్ రూ.240కే లభిస్తోంది. సంప్రదాయ ఎరువుల్లో ఉండే పోషకాలన్నీ కలిగి ఉండడం, అన్ని పంటలకు అనుకూలమైనది కావడం, 80–90 శాతం యూరియా మొక్కకు అందడం, భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని రుజువు కావడంతో ‘నానో’ పట్ల రైతుల్లో ఆదరణ పెరుగుతోంది. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా సుమారు 20 వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17,064 లీటర్లు) కొనుగోలు చేశారు.
వచ్చే ఏడాది డీఏపీ, జింక్, కాపర్ కూడా..
నానో యూరియా విక్రయాలను ప్రోత్సహిస్తూ రిటైల్ మార్కెట్లతో పాటు ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత రబీ సీజన్ కోసం 5.25 లక్షల బాటిల్స్ (2.65 లక్షల లీటర్లు) అందుబాటులో ఉంచగా రికార్డు స్థాయిలో 4.35 లక్షల బాటిళ్ల (2.17 లక్షల లీటర్లు) విక్రయాలు జరిగాయి. డిమాండ్‌ను బట్టి నిల్వ పెంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేస్తోంది. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ కూడా మార్కెట్‌లోకి తెచ్చేందుకు ఇఫ్కో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ఉత్పత్తులతో ట్రయిల్ రన్ నిర్వహించింది. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి వీటిని మార్కెట్‌లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
కలుపు తగ్గింది.. దిగుబడి పెరిగింది
ఖరీఫ్‌లో ఆరు ఎకరాల్లో ఎం–7 వరి రకం సాగు చేశా. 30వ రోజు, 60వ రోజు నానో యూరియాను రెండుసార్లు లీటర్ నీటిలో 4 ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేశాం. కలుపు సమస్య, ఖర్చు తగ్గింది. దిగుబడి సరాసరిన రెండు బస్తాలు అధికంగా వచ్చింది.
– అశోక్‌కుమార్, ఎల్లాయపాడు, నెల్లూరు జిల్లా
త్వరలో ప్లాంట్‌కు పునాది
రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇఫ్కో అంగీకరించింది. నెల్లూరులో భూములను కేటాయించడంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో ప్లాంట్‌కు పునాదిరాయి వేసే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
– వై.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment