
అక్రమార్కులకు అండ!
♦ కార్పొరేషన్ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
♦ ఫిర్యాదు చేసినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ యంత్రాంగం
♦ హైకోర్టు ఉత్తర్వులు సైతం అమలు చేయడంలో నిర్లక్ష్యం
♦ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకోని వైనం
సాక్షి ప్రతినిధి, కడప : అక్రమార్కులకు అండగా నిలవడమే లక్ష్యమని కార్పొరే షన్ అధికారులు వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. నిర్మాణపు అనుమతులు లేకపోయినా టౌన్ ప్లానింగ్ విభాగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో చేతులు బరువెక్కుతే చాలనే రీతిలో వ్యవహరిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు నాగరాజుపేటలో తాజాగా చోటుచేసుకున్న ఘటన రూఢీ చేస్తోంది. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేసినా చలనం లేదు. హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వైనమిది. నగరంలోని నాగరాజుపేటకు చెందిన అబ్దుల్‌రౌవుఫ్ డోర్ నెంబర్ 2/392 పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గృహ నిర్మాణం చేపట్టాడు. ఎలాంటి అనుమతులు లేకుండా తన గృహానికి ఆటంకం కల్గిస్తూ నిర్మాణం చేపట్టారని న్యాయవాది ఎం బాలదస్తగిరిరెడ్డి కార్పొరేషన్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం వారికి ఫిర్యాదు చేశారు.
ఏమాత్రం స్పందన లేకపోవడంతో నోటీసు జారీ చేశారు. ఆపై హైకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఆ మేరకు హైకోర్టు ఈనెల 15న ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాలను ఆపాల్సిందిగా మున్సిపాలిటిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఏకైక కారణం టౌన్ ప్లానింగ్‌లో కీలకంగా ఉన్న అధికారికి నిర్మాణం సాగిస్తున్న వ్యక్తి సన్నిహితుడు కావడమేనని తెలుస్తోంది. పైగా పెద్ద ఎత్తున చేతులు తడిపినట్లు సమాచారం. అందువల్లే ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయినట్లు తెలిసింది. హైకోర్టు ఉత్తర్వులను సైతం టౌన్ ప్లానింగ్ అధికారులు ఖాతరు చేయడం లేదని బాధితుడు నాగదస్తగిరిరెడ్డి వాపోతున్నారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి సిటీ ప్లానర్ శైలజ వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు, హైకోర్టు ఉత్తర్వులు అందాయని, ఆ మేరకు ఇప్పటికే రెండు నోటీసులు జారీ చేశామని చెప్పారు. చర్యలు తీసుకోవడంలో ఆలస్యమైన మాట వాస్తవమేనని, త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.