► కార్పొరేషన్ స్థలం తమదంటూ కోర్టుకెళ్లిన కొందరు
► 60 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని నగర పాలక సంస్థకు కోర్టు నోటీసులు
► తమ వద్ద పత్రాలు ఉన్నాయంటున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు
నెల్లూరు, సిటీ : 5.27 ఎకరాల ఆ స్థలం విలువ రూ.50 కోట్లు. ఇది తమదంటే తమదని ఓ వర్గం, కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఈ భూ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తోంది. నగర పాలక సంస్థ అధికారుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం మాగుంట లేఅవుట్. 1995 సంవత్సరంలో ఇక్కడ కొందరు 151 ఎకరాలను 8 డివిజన్లుగా చేసి లేఅవుట్‌లు వేశారు. నిబంధనల ప్రకారం నగర పాలక సంస్థకు 10 శాతం చొప్పున 15 ఎకరాలు అప్పగించారు. ఇందులో అప్పటి మున్సిపల్ అధికారులు కంచె వేసి కార్పొరేషన్‌కు చెందిన స్థలంగా బోర్డు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం 18 మంది 15 ఎకరాల్లోని 5.27 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేశారు.
ఈ వ్యవహారంపై అప్పటి కమిషనర్ చక్రధర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో చక్రధర్‌బాబు బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే స్థలం తమదని చెబుతున్న వారు స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని కోర్టును ఆశ్రయించారు. చక్రదర్‌బాబు తర్వాత వచ్చిన కమిషనర్ దీని గురించి పట్టించుకోలేదు. ఇటీవల కమిషనర్‌గా వచ్చిన వెంకటేశ్వర్లు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా నాలుగో నగర పోలీసులకు 18 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే కోర్టు ఆస్థలం 18 మందిదేనని తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కార్పొరేషన్ అధికారులకు సూచించింది. అయితే టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థలం వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని కార్పొరేషన్ వర్గాల్లో విస్త్రతంగా చర్చ జరుగుతోంది.
పత్రాలు ఉన్నాయి : ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయి. త్వరలోనే పూర్తి ఆధారాలు కోర్టుకు అందజేస్తాం - వెంకటేశ్వర్లు, కమిషనర్, నెల్లూరు నగర పాలక సంస్థ
మాదంటే మాది..
Published Mon, Apr 4 2016 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM
Advertisement