Town Planning Authorities
-
పడగొట్టినా.. కడుతున్నారేంటి !
సాక్షి, విజయనగరం : మున్సిపాలిటీ పరిధిలోని రింగ్‌రోడ్ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి ధర్మపురికి వెళ్లే ప్రధాన రోడ్డులో పద్మావతినగర్ మొదటి లైన్ వద్ద సర్వే నంబర్ 109/6లోని 16 సెంట్ల స్థలంలో నాలుగేళ్లుగా జరుగుతున్న అక్రమ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 2011 సంవత్సరంలో మున్సిపాలిటీ నుంచి పొందిన అనుమతి పత్రంతో 2015 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే భవన నిర్మాణ అనమతులు మూడేళ్ల వరకే వర్తిస్తాయి. కానీ అప్పటికే నాలుగేళ్లు గడిచిన అనుమతి పత్రాలతో నిర్మాణ పనులు చేపట్టారు. వాస్తవ పరిస్థితి సంబంధిత అధికారులకు తెలిసినా మున్సిపల్ పాలకవర్గంలోని పెద్ద తలకాయ సదరు భవన నిర్మాణదారునికి అండగా ఉండటంతో చర్యకు వెనుకంజ వేస్తున్నారు. వాస్తవ పత్రాలను సైతం మార్చేసి ఆ స్థలాన్ని జిరాయితీ కింద మార్చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలా స్థలంతో పాటు అందులో నిర్మిస్తున్న భవనంపై వస్తున్న ఆరోపణలపై అటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగం జాప్యం చేయటం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. అక్రమ భవన నిర్మాణాన్ని నిలిపి వేయాలని అప్పట్లో పలువురు లోకాయుక్తను ఆశ్రయించినప్పటికీ నిర్మాణ పనులు ఆగకపోవటంతో గమనార్హం. పాలకవర్గ సభ్యుల అండదండలు పద్మావతినగర్ రోడ్డులో జరుగుతున్న అక్రమ భవన నిర్మాణం వెనుక మున్సిపల్ పాలకవర్గంలోని కీలక సభ్యులు అండదండలున్నాయన్న అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. స్వయానా మున్సిపల్ చైర్మన్ ఇందుకు వత్తాసు పలుకుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే సరైన ధ్రువపత్రాలు లేకున్నా, ప్రభుత్వ భూమిని అక్రమించుకుని నిర్మిస్తున్నా అధికారులు ఆ వైపు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఆ భవన నిర్మాణంపై ఫిర్యాదు చేసిన సమయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు వారి సిబ్బందితో కలిసి వెళ్లి నిర్మించిన గోడలను కూలదోసి వచ్చేస్తారు. కొద్ది రోజులు గడిచాక మళ్లీ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇలా నాలుగేళ్లుగా జరుగుతున్న తంతును నీతి, నిజాయితీ, నిప్పు లాంటి పాలన అంటూ గొప్పలు చెప్పుకొనే టీడీపీ పాలకవర్గ సభ్యులు ప్రోత్సహించటం విశేషం. మరికొద్ది రోజుల్లో కౌన్సిల్ పదవీ కాలం ముగియనుండటంతో ఈ లోపే భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు నిర్మాణదారుడు తొందర పడుతున్నట్టు సమాచారం. -
కూల్చివేతలోనూ నాన్చుడే..
► సెల్లార్ల తొలగింపులో అధికారుల వివక్ష ► అధికార పార్టీ నేతల వ్యాపార సముదాయాల జోలికెళ్లని వైనం ► చిన్న చిన్న వ్యాపారులపైనే ప్రతాపం ► అనధికార కట్టడాలతో పెరిగిపోతున్న ట్రాఫిక్ సాక్షి, గుంటూరు: పట్టణ ప్రణాళికా విభాగం అంటే అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడం. అయితే కొన్నేళ్లుగా నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు మాత్రం ఈ అర్థాన్నే మార్చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పట్టణ అవినీతి విభాగం అనే విధంగా తయారు చేశారు. గుంటూరు నగరం అనధికార నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటే పూర్తి అవినీతి అధికారుల పనితీరే కారణం. రాజధాని నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే గుంటూరు నగరంలో మాత్రం గతం కంటే కొత్త మార్పులు ఏమీ జరగకపోగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నగరంలో ప్రస్తుతం జరుగుతున్న సెల్లార్ల కూల్చివేతలోనూ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు వివక్షత చూపుతున్నారు. అధికార పార్టీ నేతల హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో కనీసం సెల్లార్లు లేకపోయినా వారికి నోటీసులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఎటూచూసినా ట్రాఫిక్ చిక్కులే.. గుంటూరు నగరంలో రాజధాని ప్రకటన నుంచి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. నగరంలో ఆక్రమణల తొలగించడం దగ్గర నుంచి రోడ్ల విస్తరణ, అనధికారిక కట్టడాల నిర్మూలన, సెల్లార్లలో వ్యాపార సముదాయాల తొలగింపు వంటి ఏ ఒక్క పనినీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సక్రమంగా నిర్వర్తించిన దాఖలాలు లేవు. అధికారులు ఆదేశించగానే హడావుడిగా చిన్న చిన్న వ్యాపారులు, సామాన్యులకు చెందిన వాటిని తొలగించి తొలగించడం పరిపాటిగా మారింది. ఇటీవల జరిగిన ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీమావేశంలో సెల్లార్లలో వ్యాపార సముదాయాలు నడుస్తుండటం వల్ల రోడ్లపై వాహనాలను నిలుపుతున్నారనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోన శశిధర్ సెల్లార్లలో వ్యాపార సముదాయాలు తొలగించాలని ఆదేశించారు. దీంతో హడావుడిగా గుంటూరు నగరంలోని 124 వ్యాపార సముదాయాలు, ఆసుపత్రులకు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నోటీసులు జారీ చేసి కొన్నింటిని తొలగించారు. ఇవి కనిపించడం లేదా ? నగర నడిబొడ్డున అరండల్‌పేట పోలీసు స్టేషన్ దగ్గర్లో ఉన్న అధికార పార్టీ నేతకు చెందిన ఓ హోటల్ సెల్లార్లో ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. అధికార పార్టీ నేతల బంధువులతోపాటు వారి అండదండలు ఉన్న అనేక కార్పొరేట్ ఆసుపత్రుల్లో సెల్లార్లలోనే ఎక్సెరే కేంద్రాలు, మెడికల్ షాపులు నడుస్తున్నా ఇవేమీ పట్టించుకోలేదు. సగం పార్కింగ్‌కు వదిలేసి మిగతా సగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న చోట మాత్రం అడ్డంగా కొట్టి పడేస్తున్నారు. పూర్తిగా సెల్లార్‌ను మూసివేసి వ్యాపారాలు చేసుకుంటున్న వారి జోలికి మాత్రం వెళ్లడం లేదు. కొన్ని నెలల క్రితం గుంటూరు నగరంలో అనధికారిక నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పురపాలక శాఖ మంత్రి నారాయణను కోరారు. ఆయన ఆదేశాలతో రెండు, మూడు రోజులు హడావుడి చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు చిన్న చిన్న స్థలాల్లో వ్యాపారస్తులపై జులుం ప్రదర్శించారు. అనధికారిక నిర్మాణాల తొలగింపును బూచిగా చూపి వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకుని మిన్నకున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నట్లు హడావుడి చేసి ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. తారస్థాయికి చేరిన టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు అనధికారిక నిర్మాణాలు చేపడుతున్న భవన యజమానుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అవినీతి భాగోతానికి ఏకంగా గతంలో ఇక్కడ పని చేసిన ఓ ఐఏఎస్ అధికారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇటీవల భారీ స్థాయి అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులపై కమిషనర్ అనురాధ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. -
నిర్మాణం లేకుండానే బీఆర్ఎస్
తీగలాగితే డొంకంతా కదిలినట్లు.. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కార్యవర్గం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అసలు నిర్మాణమే లేకుండా.. ఓ డిజైన్‌ను చూపించి బీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ఎఫ్ఎన్సీసీలో ఆదివారం ఉదయం పోర్టిగో నిర్మాణం కుప్పకూలడంతో.. అనేక కొత్త విషయాలు బయట పడుతున్నాయి. ఎక్కడైనా అక్రమ నిర్మాణాన్ని సక్రమంగా చేసుకోవాలంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీంలో దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా 2015 అక్టోబర్ 28వ తేదీలోపు భవనాలు అయితేనే బీఆర్ఎస్ వర్తిస్తుంది. ఎఫ్ఎన్సీసీలో మాత్రం నిబంధనలకు పూర్తిగా పాతరా వేశారు. ఇక్కడ నిర్మాణం లేకుండానే పోర్టిగో ఉన్నట్లుగా ఊహాచిత్రాన్ని చూపించి బీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న రెండు నెలలుకు ఇక్కడ పోర్టిగో నిర్మాణం చేపట్టారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులను లోబర్చుకొని వాళ్లకు గౌరవసభ్యత్వాలు ఇచ్చి 2015 అక్టోబర్ 28వ తేదీలోపు పోర్టిగో నిర్మించినట్లు దరఖాస్తు అందజేశారు. అయితే దురదృష్టవశాత్తు ఈ పోర్టిగో కుప్పకూలడంతో బీఆర్ఎస్ వ్యవహారం అంతా బట్టబయలైంది. సోమవారం ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) కార్యాలయంలో దీనికి సంబంధించిన దరఖాస్తులను వెలికితీయగా ఎప్పుడో బీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. అంతేకాదు జీహెచ్ఎంసీ అనుమతి లేకుండానే ఇక్కడ నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను కూడా బీఆర్ఎస్లో దరఖాస్తు చేశారు. ఈ ఫంక్షన్‌హాల్‌ను మంత్రి కేటీఆర్‌తో ప్రారంభోత్సవం చేయించారు. ఇక ప్రధాన భవనాన్ని కూడా బీఆర్ఎస్లోనే చేర్చారు. బీఆర్ఎస్లో దరఖాస్తు చేయడం, 10 శాతం ఫీజు చెల్లించడం, మిగతా ఫీజును ఎగ్గొట్టడం ఈ దుర్వినియోగం అంతా సోమవారం అధికారులకు కళ్లకు కట్టింది. -
మాదంటే మాది..
► కార్పొరేషన్ స్థలం తమదంటూ కోర్టుకెళ్లిన కొందరు ► 60 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని నగర పాలక సంస్థకు కోర్టు నోటీసులు ► తమ వద్ద పత్రాలు ఉన్నాయంటున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు నెల్లూరు, సిటీ : 5.27 ఎకరాల ఆ స్థలం విలువ రూ.50 కోట్లు. ఇది తమదంటే తమదని ఓ వర్గం, కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఈ భూ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తోంది. నగర పాలక సంస్థ అధికారుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం మాగుంట లేఅవుట్. 1995 సంవత్సరంలో ఇక్కడ కొందరు 151 ఎకరాలను 8 డివిజన్లుగా చేసి లేఅవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం నగర పాలక సంస్థకు 10 శాతం చొప్పున 15 ఎకరాలు అప్పగించారు. ఇందులో అప్పటి మున్సిపల్ అధికారులు కంచె వేసి కార్పొరేషన్‌కు చెందిన స్థలంగా బోర్డు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం 18 మంది 15 ఎకరాల్లోని 5.27 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై అప్పటి కమిషనర్ చక్రధర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో చక్రధర్‌బాబు బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే స్థలం తమదని చెబుతున్న వారు స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని కోర్టును ఆశ్రయించారు. చక్రదర్‌బాబు తర్వాత వచ్చిన కమిషనర్ దీని గురించి పట్టించుకోలేదు. ఇటీవల కమిషనర్‌గా వచ్చిన వెంకటేశ్వర్లు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నాలుగో నగర పోలీసులకు 18 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే కోర్టు ఆస్థలం 18 మందిదేనని తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కార్పొరేషన్ అధికారులకు సూచించింది. అయితే టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థలం వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని కార్పొరేషన్ వర్గాల్లో విస్త్రతంగా చర్చ జరుగుతోంది. పత్రాలు ఉన్నాయి : ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయి. త్వరలోనే పూర్తి ఆధారాలు కోర్టుకు అందజేస్తాం - వెంకటేశ్వర్లు, కమిషనర్, నెల్లూరు నగర పాలక సంస్థ