కూల్చివేతలోనూ నాన్చుడే.. | Town Planning Authorities corruption | Sakshi
Sakshi News home page

కూల్చివేతలోనూ నాన్చుడే..

Published Sat, Aug 19 2017 2:44 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

కూల్చివేతలోనూ నాన్చుడే..

కూల్చివేతలోనూ నాన్చుడే..

► సెల్లార్ల తొలగింపులో అధికారుల వివక్ష
► అధికార పార్టీ నేతల వ్యాపార  సముదాయాల జోలికెళ్లని వైనం
► చిన్న చిన్న వ్యాపారులపైనే ప్రతాపం
►  అనధికార కట్టడాలతో  పెరిగిపోతున్న ట్రాఫిక్‌


సాక్షి, గుంటూరు: పట్టణ ప్రణాళికా విభాగం అంటే అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడం. అయితే కొన్నేళ్లుగా  నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు మాత్రం ఈ అర్థాన్నే మార్చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పట్టణ అవినీతి విభాగం అనే విధంగా తయారు చేశారు. గుంటూరు నగరం అనధికార నిర్మాణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందంటే పూర్తి అవినీతి అధికారుల పనితీరే కారణం.

రాజధాని నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే గుంటూరు నగరంలో మాత్రం గతం కంటే కొత్త మార్పులు ఏమీ జరగకపోగా ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నగరంలో ప్రస్తుతం జరుగుతున్న సెల్లార్ల కూల్చివేతలోనూ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు వివక్షత చూపుతున్నారు. అధికార పార్టీ నేతల హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో కనీసం సెల్లార్‌లు లేకపోయినా వారికి నోటీసులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.  

ఎటూచూసినా ట్రాఫిక్‌ చిక్కులే..
గుంటూరు నగరంలో రాజధాని ప్రకటన నుంచి ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. నగరంలో ఆక్రమణల తొలగించడం దగ్గర నుంచి రోడ్ల విస్తరణ, అనధికారిక కట్టడాల నిర్మూలన, సెల్లార్లలో వ్యాపార సముదాయాల తొలగింపు వంటి ఏ ఒక్క పనినీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సక్రమంగా నిర్వర్తించిన దాఖలాలు లేవు.

అధికారులు ఆదేశించగానే హడావుడిగా చిన్న చిన్న వ్యాపారులు, సామాన్యులకు చెందిన వాటిని తొలగించి తొలగించడం పరిపాటిగా మారింది. ఇటీవల జరిగిన ట్రాఫిక్‌ అడ్వైజరీ కమిటీమావేశంలో సెల్లార్లలో వ్యాపార సముదాయాలు నడుస్తుండటం వల్ల రోడ్లపై వాహనాలను నిలుపుతున్నారనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోన శశిధర్‌ సెల్లార్లలో వ్యాపార సముదాయాలు తొలగించాలని ఆదేశించారు. దీంతో హడావుడిగా గుంటూరు నగరంలోని 124 వ్యాపార సముదాయాలు, ఆసుపత్రులకు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నోటీసులు జారీ చేసి కొన్నింటిని తొలగించారు.

ఇవి కనిపించడం లేదా ?
నగర నడిబొడ్డున అరండల్‌పేట పోలీసు స్టేషన్‌ దగ్గర్లో ఉన్న అధికార పార్టీ నేతకు చెందిన ఓ హోటల్‌ సెల్లార్‌లో ఏకంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నడుస్తున్నప్పటికీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. అధికార పార్టీ నేతల బంధువులతోపాటు వారి అండదండలు ఉన్న అనేక కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సెల్లార్లలోనే ఎక్సెరే కేంద్రాలు, మెడికల్‌ షాపులు నడుస్తున్నా ఇవేమీ పట్టించుకోలేదు. సగం పార్కింగ్‌కు వదిలేసి మిగతా సగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న చోట మాత్రం అడ్డంగా కొట్టి పడేస్తున్నారు. పూర్తిగా సెల్లార్‌ను మూసివేసి వ్యాపారాలు చేసుకుంటున్న వారి జోలికి మాత్రం వెళ్లడం లేదు.

కొన్ని నెలల క్రితం గుంటూరు నగరంలో అనధికారిక నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పురపాలక శాఖ మంత్రి నారాయణను కోరారు. ఆయన ఆదేశాలతో రెండు, మూడు రోజులు హడావుడి చేసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చిన్న చిన్న స్థలాల్లో వ్యాపారస్తులపై జులుం ప్రదర్శించారు. అనధికారిక నిర్మాణాల తొలగింపును బూచిగా చూపి వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకుని మిన్నకున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నట్లు హడావుడి చేసి ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు.
తారస్థాయికి చేరిన

టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అవినీతి
నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనధికారిక నిర్మాణాలు చేపడుతున్న భవన యజమానుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అవినీతి భాగోతానికి ఏకంగా గతంలో ఇక్కడ పని చేసిన ఓ ఐఏఎస్‌ అధికారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇటీవల భారీ స్థాయి అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై కమిషనర్‌ అనురాధ సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement