పద్మావతినగర్ రోడ్డులో అక్రమ భవన నిర్మాణం
సాక్షి, విజయనగరం : మున్సిపాలిటీ పరిధిలోని రింగ్‌రోడ్ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి ధర్మపురికి వెళ్లే ప్రధాన రోడ్డులో పద్మావతినగర్ మొదటి లైన్ వద్ద సర్వే నంబర్ 109/6లోని 16 సెంట్ల స్థలంలో నాలుగేళ్లుగా జరుగుతున్న అక్రమ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 2011 సంవత్సరంలో మున్సిపాలిటీ నుంచి పొందిన అనుమతి పత్రంతో 2015 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే భవన నిర్మాణ అనమతులు మూడేళ్ల వరకే వర్తిస్తాయి. కానీ అప్పటికే నాలుగేళ్లు గడిచిన అనుమతి పత్రాలతో నిర్మాణ పనులు చేపట్టారు.
వాస్తవ పరిస్థితి సంబంధిత అధికారులకు తెలిసినా మున్సిపల్ పాలకవర్గంలోని పెద్ద తలకాయ సదరు భవన నిర్మాణదారునికి అండగా ఉండటంతో చర్యకు వెనుకంజ వేస్తున్నారు. వాస్తవ పత్రాలను సైతం మార్చేసి ఆ స్థలాన్ని జిరాయితీ కింద మార్చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలా స్థలంతో పాటు అందులో నిర్మిస్తున్న భవనంపై వస్తున్న ఆరోపణలపై అటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగం జాప్యం చేయటం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. అక్రమ భవన నిర్మాణాన్ని నిలిపి వేయాలని అప్పట్లో పలువురు లోకాయుక్తను ఆశ్రయించినప్పటికీ నిర్మాణ పనులు ఆగకపోవటంతో గమనార్హం.
పాలకవర్గ సభ్యుల అండదండలు
పద్మావతినగర్ రోడ్డులో జరుగుతున్న అక్రమ భవన నిర్మాణం వెనుక మున్సిపల్ పాలకవర్గంలోని కీలక సభ్యులు అండదండలున్నాయన్న అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. స్వయానా మున్సిపల్ చైర్మన్ ఇందుకు వత్తాసు పలుకుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే సరైన ధ్రువపత్రాలు లేకున్నా, ప్రభుత్వ భూమిని అక్రమించుకుని నిర్మిస్తున్నా అధికారులు ఆ వైపు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఆ భవన నిర్మాణంపై ఫిర్యాదు చేసిన సమయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు వారి సిబ్బందితో కలిసి వెళ్లి నిర్మించిన గోడలను కూలదోసి వచ్చేస్తారు. కొద్ది రోజులు గడిచాక మళ్లీ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇలా నాలుగేళ్లుగా జరుగుతున్న తంతును నీతి, నిజాయితీ, నిప్పు లాంటి పాలన అంటూ గొప్పలు చెప్పుకొనే టీడీపీ పాలకవర్గ సభ్యులు ప్రోత్సహించటం విశేషం. మరికొద్ది రోజుల్లో కౌన్సిల్ పదవీ కాలం ముగియనుండటంతో ఈ లోపే భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు నిర్మాణదారుడు తొందర పడుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment