Demolition of buildings
-
నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం.. కన్నీరు మిగిల్చిన హైడ్రా కూల్చివేతలు
-
Telangana: మూసీ ‘రెడ్ మార్క్’!
సాక్షి, హైదరాబాద్: మూసీ కట్టడాలపై రెడ్ మార్క్ పడింది. పరీవాహకంలోని నివాసితుల గుండెల్లో ఆవేదన రేపుతోంది. పునరావాసం కింద ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకెందుకంటూ చాలా మంది గోడు వెళ్లబోసుకుంటున్నారు. కడుపుకట్టుకుని సొమ్ముదాచుకుని ఇళ్లు కట్టుకున్నామని, ఏళ్లకేళ్లుగా అక్కడే బతుకుతున్న తమను వెళ్లిపొమ్మంటే ఎలాగని ఆందోళన చెందుతున్నారు. పరీవాహకం వెంట సర్వే చేసి, ఇళ్లకు మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి సర్వే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. మొదటి విడతగా నదీ గర్భంలో ఉన్న కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సుమారు 25 ప్రత్యేక బృందాలు గత నివేదికల ఆధారంగా ఇళ్లను గుర్తించి ‘ఆర్బీ–ఎక్స్’ పేరుతో ఎరుపు రంగులో మార్కింగ్ చేస్తున్నాయి. ఆయా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి అక్కడికక్కడే ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నాయి. 12 వేల కట్టడాల గుర్తింపు హైదరాబాద్ నగరంలో సుమారు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ పరీవాహక ప్రాంతంలో 12వేలకుపైగా కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంయుక్తంగా సర్వే నిర్వహించి.. నదీ గర్భంలో ఉన్న, బఫర్‌జోన్‌లో ఉన్న ఇళ్లు, నిర్మాణాలుగా వర్గీకరించారు. నది గర్భంలో 2,166 కట్టడాలు ఉండగా.. అందులో 288 భారీ నిర్మాణాలు ఉన్నాయి. నది సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఉన్న బఫర్‌జోన్ పరిధిలో 7,851 కట్టడాలు ఉండగా.. అందులో 1,032 భారీ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి మొత్తంగా 30వేలకు పైగానే నివాసాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. చావనైనా చస్తాం.. కూల్చనివ్వం ‘‘ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం. కరెంటు, నీటి బిల్లులు కడుతున్నాం. ఇప్పుడు కూల్చుతామంటే ఎలా? చావనైనా చస్తాం కానీ ఇళ్లను కూల్చనివ్వం.. ఇంత విషం ఇచ్చి ఆ పుణ్యంకూడా మీరే కట్టుకోండి..’’ అంటూ మూసీ పరీవాహకం పరిధిలోని చైతన్యపురి వినాయకనగర్ కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ రివర్బెడ్, బఫర్జోన్లలోని ఇళ్లను మార్కింగ్ చేయడానికి వచ్చిన సర్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి రంగు డబ్బాలను లాక్కుని పారబోశారు. వేసిన మార్కింగ్స్‌ను తుడిపేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారంటూ అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్వే బృందాలు వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ అధికారులకు ఇదే తరహా నిరసన ఎదురైంది.కడుపు కట్టుకుని కొనుక్కున్నాం.. ఇక్కడే సమాధి అవుతాం ‘‘మావి కబ్జా చేసుకుని కట్టుకున్న ఇళ్లు కావు.. కడుపు కాల్చుకుని దాచుకున్న డబ్బులతో కట్టుకున్న ఇళ్లు మావి. కరెంట్, నీటి, ఇంటి పన్నులు చెల్లిస్తున్నాం. స్థలాలు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నాం. వీటిని వదిలి వసతులేవీ లేనిచోట ఎక్కడో అడవులలో కట్టిన డబుల్ బెడ్రూమ్లను ఇస్తామంటే వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడే ఉంటాం. ఇంట్లోనే సమాధి అవుతాం..’’ అంటూ అత్తాపూర్ డివిజన్ భరత్‌నగర్ వాసులు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు ఆక్రమించి విల్లాలు నిర్మించుకున్న బడాబాబుల ఫాంహౌస్‌లు కూల్చివేయకుండా సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఏమిటంటూ మండిపడ్డారు.తొలివిడతగా నది గర్భంలో.. మూసీ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో నది గర్భంలో ఉన్న నివాసాల తొలగింపుపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,595, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కట్టడాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మూసీ పరీవాహకంలో ఇళ్లు తొలగిస్తున్న నేపథ్యంలో.. బాధితులకు పునరావాసం కోసం 15వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది గర్భం, బఫర్ జోన్లలో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు. బఫర్ జోన్లో తొలగించే ఇళ్లు, నిర్మాణాలకు సంబంధించి.. పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నష్టపరిహారం చెల్లించి, భూసేకరణ చేపడతామని వివరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు కూడా అందజేస్తామని అంటున్నారు.ఎక్కడో దూరంగా ఇళ్లు ఇస్తుండటంపై.. మూసీ పరీవాహకంలో తొలి విడతగా ఇళ్ల తొలగింపుతో రెండు వేలకుపైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్, రెవెన్యూ ఉన్నతాధికారులు సైదాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో గతంలో కొందరు మూసీ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించినా.. తిరిగి వెనక్కి వచ్చినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నాయి. నదీ గర్భం నుంచి తరలింపు ప్రారంభం మూసీ పరీవాహకంలోని కొత్తపేట భవానీనగర్ రోడ్డు నంబర్ 10లో నివాసం ఉంటున్న పదకొండు కుటుంబాలను అధికారులను తరలించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి వారితో ఆ కుటుంబాలతో మాట్లాడారు. వారి సమ్మతితోనే వనస్థలిపురం, ప్రతాపసింగారం, తిమ్మాయి గూడలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వ ఖర్చులతో డీసీఎంలలో సామగ్రిని తరలించారు. -
నాగార్జునకు ఊరట.. కూల్చివేత ఆపేయండి.. హైకోర్టు ఆర్డర్స్
-
కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలే లక్ష్యంగా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు ముకుతాడు వేసింది. అధికారుల దుందుడుకు చర్యలను అడ్డుకునే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి అతిక్రమణలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ప్రజల భద్రతకు ప్రమాదకారిగా మారినప్పుడు మాత్రమే కూల్చివేతలు చేపట్టవచ్చని, అయితే అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు అధికారులు ఎంత మాత్రం భవనాల కూల్చివేతలకు దిగరాదని హైకోర్టు ఆదేశించింది. అధికారులు తమ విచక్షణ, అధికారాన్ని వినియోగించే సమయంలో నిష్పాక్షికంగా, వాస్తవ దృక్పథంతో చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. పార్టీ కార్యాలయాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం తమకున్న ప్రత్యామ్నాయాలన్నింటినీ వైఎస్సార్సీపీ వర్గాలు సంబంధిత అధికారుల వద్ద ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. చట్ట ప్రకారం వ్యవహరించేందుకు వీలుగా నేటి నుంచి రెండు వారాల్లోపు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు, అదనపు డాక్యుమెంట్లు, వివరణ, అదనపు వివరణలను అధికారులకు సమర్పించవచ్చని పేర్కొంది. రెండు వారాల గడువు ముగిసిన తరువాత వైఎస్సార్ సీపీ సమర్పించిన ఆధారాలు, అదనపు వివరణలు, డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుని విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. వైఎస్సార్సీపీ వాదనను కూడా వినాలని ఆదేశించింది. అంతేకాకుండా రికార్డులు, సంబంధిత భవనాలను పరిశీలించిన తరువాతే పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పింది. ప్రతి దశలోనూ వైఎస్సార్సీపీ వాదనలు వినాలని, ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట నిబంధనల కింద అవసరమైనప్పుడల్లా వారి వాదనను వినాల్సిందేనని తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు వైఎస్సార్ సీపీ కార్యాలయాల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై వైఎస్సార్సీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం తీర్పు వెలువరించారు.కూల్చివేతల నోటీసులపై పిటిషన్లు..రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాల కూల్చివేత నిమిత్తం పురపాలక శాఖ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులు, ప్రాథమిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్ సీపీ, పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కూల్చివేతలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.నిర్మాణ సమయంలో అధికారులు సందర్శించలేదు..‘రాష్ట్ర విధానంలో భాగంగా అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీ కార్యాలయాల నిర్మాణం నిమిత్తం భూముల కేటాయింపు జరిగింది. భూములను స్వాధీనం కూడా చేశారు. ఆ ఖాళీ స్థలాలకు ఆస్తి పన్నులు కూడా చెల్లించారు. భవన నిర్మాణాలకు అనుమతి కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. కొన్ని చోట్ల బిల్డింగ్ పర్మిట్లు కూడా వచ్చాయి. అత్యధిక చోట్ల భవన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అధికారులు ఎప్పుడూ నిర్మాణ సమయంలో భవనాలను సందర్శించ లేదు. ఇప్పుడు అత్రికమణలు ఉన్నాయంటూ కూల్చివేతలకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత కూల్చివేతల కోసం నోటీసులు జారీ చేశారు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలుభవన నిర్మాణాల్లో ఎలాంటి అతిక్రమణలు లేవని, చట్ట నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టామన్న వైఎస్సార్ సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం పెనాల్టీ విధించి నిర్మాణాలను క్రమబద్ధీకరించే అధికారం కమిషనర్లకు ఉందన్న వాదనను కూడా పరిగణలోకి తీసుకున్నారు. భవనాల కూల్చివేత వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ లేదని, తమకు మాత్రం ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, అధికారులు ప్రస్తావించిన అతిక్రమణలు సైతం సరిచేసేందుకు అవకాశం ఉన్నవేనన్న వాదనను కూడా న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. -
రేపు మీ ఇంటిని కూల్చివేస్తాం.. బీజేపీ చీఫ్‌కు వార్నింగ్
దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్లు హాట్ టాపిక్‌గా మారాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలతో ఢిల్లీలో ఆందోళనలు చేటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ బీజేపీ చీఫ్‌కు తన ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వివరాల ప్రకారం.. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి తన ఇంటిని, కార్యాలయాన్ని నిర్మించారని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే శనివారం(రేపు) ఉదయం 11 గంటలలోపు గుప్తా అక్రమ నిర్మాణాలను తొలగించకుంటే బుల్డోజర్లతో ఆయన ఇంటికి వెళ్తామని ఆప్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇదిలా ఉండగా.. గురువారం ఆగ్నేయ ఢిల్లీలో కూల్చివేతలను ఆపేందుకు మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ప్రయత్నించడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. దేశ రాజధానిలో 63 లక్షల ఇళ్లను కూల్చివేయాలని బీజేపీ యోచిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. ఇక, బుల్డోజర్లతో ప్రజలను బెదిరించి బీజేపీ ప్రజల నుండి లక్షల రూపాయాలు వసూలు చేస్తోందని పౌర సంస్థల ఆప్ ఢిల్లీ ఇన్ఛార్జ్ దుర్గేష్ పాఠక్ అన్నారు. ఇది కూడా చదవండి: దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనకు గురి చేస్తోంది.. సోనియా గాంధీ -
ఓయూ వివాదాస్పద స్థలంలో నిర్మాణాల కూల్చివేత
అంబర్‌పేట(హైదరాబాద్): ఓయూలోని వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు. డీడీ కాలనీ ఉస్మానియా యూనివర్సిటీ మధ్యలో ఉన్న స్థలంపై ఓ రిటైర్డ్ న్యాయమూర్తికి, ఉస్మానియా యూనివర్సిటీ వారికి మధ్య వివాదం తలెత్తింది. ఇటీవల రిటైర్డ్ న్యాయమూర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసి వారి బందోబస్తుతో వివాదాస్పద స్థలంలో గోడను నిర్మించారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఆ నిర్మాణానికి అనుమతిలేదని కూల్చివేయాలంటూ స్థానిక సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు అందాయి. సర్కిల్–16 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ నర్సింగ్‌రావు నేతృత్వంలో వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను సోమవారం జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. గత కొన్నేళ్ల క్రితం ఈ స్థలంలో నిర్మాణం కోసం రిటైర్డ్ న్యాయమూర్తి కుటుంబం అనుమతులు పొందారని, ప్రస్తుతం వాటి కాలపరిమితి ముగిసిందని ఏసీపీæ తెలిపారు. తాజాగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేశామన్నారు. తిరిగి నిర్మాణాలకు వారు దరఖాస్తు చేసుకుంటే అందుకు నిబంధనలు పాటిస్తూ పరిశీలిస్తామన్నారు. ఈ కూల్చివేతల బృందంలో టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సాయిబాబా, చైన్మన్లు బాబామియా, రజ్వీలు కూడా ఉన్నారు. -
భవనాల కూల్చివేతకే మొగ్గు..!
సాక్షి, హైదరాబాద్: సచివాలయ ప్రాంగణం లోని భవనాల కూల్చివేతకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. సచివాలయంలోని కట్టడాలన్నింటినీ కూల్చేసి నేలను సమాంతరంగా చదును చేశాకే కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుత సచివాలయం మొత్తం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని చుట్టూ ఉన్న ఇతర భవనాలను సైతం స్వాధీనం చేసుకొని కూల్చేయాలని భావిస్తోంది. సచివాలయం వెలుపల ఉన్న ఈ భవనాల స్థలాలను కలిపేసుకోవడం ద్వారా వాస్తుదోషాల్లేకుండా కొత్త సచివాలయ నిర్మిత స్థలాన్ని చతురస్రాకార రూపంలో అభివృద్ధిపరచాలని యోచిస్తోంది. ప్రస్తుత సచివాలయం 10 బ్లాకులుగా విస్తరించి ఉండగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ఒకే సమీకృత భవనంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. హుస్సేన్ సాగర్‌కు అభిముఖంగా (లేక్‌వ్యూ) దాదాపు 4 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త భవన సముదాయం ఎదురుగా ఖాళీగా ఉండే సువిశాల స్థలంలో వనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దనుంది. కొత్త సచివాలయ నిర్మాణంపై రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ భవనాల కూల్చివేతపై తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. కూల్చివేతలకు మార్గం సుగమం... ప్రస్తుత సచివాలయంలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సర్వహిత బ్లాక్ (జీ–బ్లాక్) శిథిలావస్థకు చేరడంతో గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంచారు. సైఫాబాద్ ప్యాలెస్‌గా ఖ్యాతి గడించిన ఈ భవనాన్ని 1888లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ నిర్మించారు. ఈ భవనానికి ఉన్న వారసత్వ సంపద హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చట్ట సవరణ జరపడంతో దీని కూల్చివేతకు మార్గం సుగమమైంది. ఇక సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులు 35,818 చదరపు మీటర్ల స్థలంలో విస్తరించి ఉండగా జే, కే, ఎల్, హెచ్ నార్త్, సౌత్ బ్లాక్‌లు 49,342 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్నాయి. వీవీఐపీలకు రక్షణ, ఇతర భద్రతా ప్రమాణాల రీత్యా ఈ భవనాలు సురక్షితం కాదని రాష్ట్ర పోలీసు, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే అధ్యయనం జరిపి నివేదికలు సమర్పించినట్లు తెలిసింది. దీంతో ఈ బ్లాకులను సైతం కూల్చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. కొత్త సచివాలయానికి నలువైపులా రోడ్లు... కొత్త సచివాలయాన్ని 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సచివాలయం చుట్టూ ఉన్న కొన్ని భవనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. సీ–బ్లాక్ వెనుక భాగంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మింట్ కాంపౌండ్, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ మినహా మిగిలిన భవనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటితోపాటు ఎన్టీఆర్ గార్డెన్స్‌కు ఆనుకొని ఉన్న దారిలోని తెలంగాణ గేట్ పక్కనున్న విద్యుత్ సంస్థల భవనాలు, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, ఇతర భవనాలను కొత్త సచివాలయ ప్రాంగణంలో కలిపేసుకోనున్నారు. కొత్త సచివాలయ నిర్మిత ప్రాంతానికి చతురస్రాకార రూపు కల్పించడం ద్వారా వాస్తుదోషాలను నివారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సచివాలయం చుట్టూ నలువైపులా రోడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఏకకాలంలో రెండింటి నిర్మాణాలు... కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఏకకాలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చేసి కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించనుంది. మూడేళ్ల కింద అదే ప్రాంతంలో నిర్మించిన రోడ్లు, భవనాలశాఖ భవనాన్ని కొత్తగా నిర్మించనున్న శాసనసభ కార్యాలయంగా వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధ భవనాన్ని కూల్చాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం ఏయే భవనాలను స్వాధీనం చేసుకోవాలి? ఏయే భవనాలను కూల్చేయాలి? ఏయే భవనాలను మనుగడలో ఉంచాలన్న అంశాలపై అధ్యయనం జరపడానికి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వశాఖల తరలింపుపై కసరత్తు ముమ్మరం... ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఇక్కడున్న వివిధ శాఖల కార్యాలయాలను వేరే ప్రాంతాల్లోని భవనాలకు తరలించడంపై కసరత్తు ముమ్మరం చేసింది. సచివాలయంలో వివిధ శాఖలు వినియోగిస్తున్న స్థలం, ఆయా శాఖల తరలింపునకు సంబంధించిన కార్యాచరణ, సచివాలయం వెలుపలి ప్రాంతాల్లో ఉన్న ఆయా శాఖల హెచ్ఓడీ కార్యాలయాల భవనాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల సమాచారాన్ని సాధారణ పరిపాలనశాఖ సేకరించింది. సచివాలయానికి దగ్గరలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలన కార్యాలయం, ఆర్థికశాఖ కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయానికి వచ్చింది. మిగిలిన శాఖలను ఆయా శాఖల హెచ్ఓడీ కార్యాలయాలకు తరలించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
పడగొట్టినా.. కడుతున్నారేంటి !
సాక్షి, విజయనగరం : మున్సిపాలిటీ పరిధిలోని రింగ్‌రోడ్ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి ధర్మపురికి వెళ్లే ప్రధాన రోడ్డులో పద్మావతినగర్ మొదటి లైన్ వద్ద సర్వే నంబర్ 109/6లోని 16 సెంట్ల స్థలంలో నాలుగేళ్లుగా జరుగుతున్న అక్రమ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 2011 సంవత్సరంలో మున్సిపాలిటీ నుంచి పొందిన అనుమతి పత్రంతో 2015 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే భవన నిర్మాణ అనమతులు మూడేళ్ల వరకే వర్తిస్తాయి. కానీ అప్పటికే నాలుగేళ్లు గడిచిన అనుమతి పత్రాలతో నిర్మాణ పనులు చేపట్టారు. వాస్తవ పరిస్థితి సంబంధిత అధికారులకు తెలిసినా మున్సిపల్ పాలకవర్గంలోని పెద్ద తలకాయ సదరు భవన నిర్మాణదారునికి అండగా ఉండటంతో చర్యకు వెనుకంజ వేస్తున్నారు. వాస్తవ పత్రాలను సైతం మార్చేసి ఆ స్థలాన్ని జిరాయితీ కింద మార్చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలా స్థలంతో పాటు అందులో నిర్మిస్తున్న భవనంపై వస్తున్న ఆరోపణలపై అటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగం జాప్యం చేయటం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. అక్రమ భవన నిర్మాణాన్ని నిలిపి వేయాలని అప్పట్లో పలువురు లోకాయుక్తను ఆశ్రయించినప్పటికీ నిర్మాణ పనులు ఆగకపోవటంతో గమనార్హం. పాలకవర్గ సభ్యుల అండదండలు పద్మావతినగర్ రోడ్డులో జరుగుతున్న అక్రమ భవన నిర్మాణం వెనుక మున్సిపల్ పాలకవర్గంలోని కీలక సభ్యులు అండదండలున్నాయన్న అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. స్వయానా మున్సిపల్ చైర్మన్ ఇందుకు వత్తాసు పలుకుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే సరైన ధ్రువపత్రాలు లేకున్నా, ప్రభుత్వ భూమిని అక్రమించుకుని నిర్మిస్తున్నా అధికారులు ఆ వైపు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఆ భవన నిర్మాణంపై ఫిర్యాదు చేసిన సమయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు వారి సిబ్బందితో కలిసి వెళ్లి నిర్మించిన గోడలను కూలదోసి వచ్చేస్తారు. కొద్ది రోజులు గడిచాక మళ్లీ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇలా నాలుగేళ్లుగా జరుగుతున్న తంతును నీతి, నిజాయితీ, నిప్పు లాంటి పాలన అంటూ గొప్పలు చెప్పుకొనే టీడీపీ పాలకవర్గ సభ్యులు ప్రోత్సహించటం విశేషం. మరికొద్ది రోజుల్లో కౌన్సిల్ పదవీ కాలం ముగియనుండటంతో ఈ లోపే భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు నిర్మాణదారుడు తొందర పడుతున్నట్టు సమాచారం. -
వెనకడుగు వేసేది లేదు..
బడా నిర్మాణాలనూ కూల్చివేస్తాం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఆక్రమణపై సమగ్ర సర్వే చేపడతాం మేయర్ నన్నపునేని నరేందర్ సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పాలకవర్గం, అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ఈ సందర్భంగా మేయర్ నన్నపునేని నరేందర్ తేల్చిచెప్పారు. అయితే, పేదలకు డబుల్ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే పేదల ఇళ్లు కూల్చివేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా మూడో రోజైనశుక్రవారం బొందివాగు, వడ్డేపల్లి నాలాలపై 28 కట్టడాలను కూల్చివేశారు. ముందుగా వడ్డేపల్లి, బొందివాగులు అక్రమ కట్టడాల కూల్చివేత మూడో రోజు శుక్రవారం హంటర్‌రోడ్డు దగ్గర రైల్వే బ్రిడ్జి కింద నుంచి ప్రవహిస్తున్న బొందివాగు నాలాపై ఉన్న అక్రమణలను కూల్చివేతను మేయర్ నన్నపునేని నరేందర్ స్వయంగా పరిశీలించారు. బొందివాగు, వడ్డేపల్లి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కారణంగానే నగరంలో 60 శాతం ప్రాంతం ముంపుకు గురైయిందని తెలిపారు. ఈ నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ రెండు నాలాల తర్వాత నగరంలో ఉన్న మిగిలిన నాలాలు, మురుగు కాల్వలు, చెరువుల ఫుల్ టాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ ఏరియాలో ఉన్న నిర్మాణాలను గుర్తించి తొలగిస్తామన్నారు. నాలాల అక్రమణల తొలగింపుతో పెద్దవారి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నామని మేయర్ నన్నపునేని నరేందర్ తెలిపారు. పునరావాసం పేదల నిర్మాణాలను కూల్చక తప్పని పరిస్థితి నెలకొంటే, ప్రత్యామ్నాయ పునరావాసం కల్పిస్తామని మేయర్ నరేందర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు పడక గదుల ఇళ్లను కేటాయించడంతో పాటు ప్రభుత్వపరంగా ఇతర సహాయం అందేలా చూస్తామని అన్నారు. కూల్చివేతల సందర్భంగా తమ నిర్మాణాలు కూల్చివేయెుద్దంటూ ఎన్టీఆర్ కాలనీలో పేదలు మేయర్‌కు మొర పెట్టుకోగా ప్రస్తుతానికి క్లియర్ కట్‌గా ఉన్న అక్రమణ కట్టడాలనే కూల్చివేస్తున్నామని ఆయన బదులిచ్చారు. పేద ప్రజలకు భవిష్యత్తులో వరద వల్ల ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఒకవేళ తప్పనిసరిగా కూల్చివేయాల్సి వస్తే నష్టపోయిన పేదలకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని మేయర్ అన్నారు. అలాంటి వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామన్నారు. మూడో రోజు మూడో రోజు బొందివాగు, వడ్డేపల్లి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హంటరు దగ్గర బొందివాగు వెంట 23 నిర్మాణాలను కూల్చివేయగా ఇందులో 12 ప్రహరీలు, పది టాయిలెట్లు, ఒక పునాది నిర్మాణం ఉంది. ఇక వడ్డేపల్లి నాలాను అక్రమిస్తూ నిర్మించిన ఐదు ప్రహారి గోడలను కూల్చివేశారు. మూడు రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు 79 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలపై యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వాకాటి కరుణ, నగర పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు, మేయర్ నన్నపునేని నరేందర్, గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సాగునీటి శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయగా... చివరి నిమిషంలో ఈ సమావేశం రద్దయ్యింది. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు – మేయర్ æనన్నపునేని నరేందర్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు చందాలు ఇవ్వనందుకే తమ నిర్మాణాలను కూల్చివేశారంటూ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ సి.పురుషోత్తంరెడ్డి చేసిన అరోపణలు పస లేనివని మేయర్ నరేందర్ కొట్టిపారేశారు. వడ్డేపల్లి నాలాపై చైతన్య విద్యాసంస్థలకు చెందిన సిబ్బంది భవనాలు ఉండడం వల్లే కూల్చివేశామన్నారు. దాస్యం వినయ్‌భాస్కర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని.. గత నాలుగేళ్లుగా ఆయన చందాలు కోసం వేధిస్తుంటే ఆ విషయాన్ని పురుషోత్తంరెడ్డి ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. నాలాలు, చెరువులు భూ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని మేయర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
కూల్చివేత బాధితులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: నగరంలోని నిర్మాణాల కూల్చివేత బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. నిజాంపేటలోని ధరణి వెల్ఫేర్ అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారంటూ అసోసియేషన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు... నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను తొలగించరాదని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. -
కూల్చివేతలను పరిశీలిస్తున్న మేయర్
హైదరాబాద్: నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపు మూడోరోజు కొనసాగుతోంది. ఈ కూల్చివేతలను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలిస్తున్నారు. మల్కచెరువు, రాయదుర్గం చెరువుల్లో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. అలాగే, చెరువు లోతట్టు ప్రాంతంలోని బఫర్ జోన్లో నిర్మించిన పెద్ద షెడ్డును కూల్చివేస్తున్నారు. మేయర్ వెంట జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి కూడా ఉన్నారు. -
మూడో రోజు కొనసాగుతున్నకూల్చివేతలు
హైదరాబాద్: నగరంలోని నాలాలపై గల అక్రమ కట్టడాల కూల్చివేతలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రామాంతపూర్, గచ్చబౌలి, కొండాపూర్, గోకుల్‌ప్లాట్స్, ఇందిరానగర్, మంజీరారోడ్, మాతృశ్రీనగర్, సురక్ష కాలనీలో గల అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ కూల్చివేతలు కొనసాగుతుండగా.. ఈ రోజు మరిన్ని భవనాలు కూల్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు యత్నిస్తున్నారు. కుషాయి గూడలో జరుగుతున్న కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. అదేవిధంగా చర్లపల్లిలో కూల్చివేతలను కూడా స్థానికులు అడ్డుకుని, మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లో నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. కేపీహెచ్‌బీ రోడ్ నెం2 లో కూడా కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ భవనాలపై జీహెచ్ఎంసీకి పలు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా పీవీ ఎక్స్ ప్రెస్ హైవేను ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలపై కూడా జీహెచ్ ఎంసీ దృష్టి సారించింది. మరో వైపు మూడు రోజు జరగుతున్న నిర్మాణాల తొలగింపుపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
ఒత్తిళ్లకు తలొగ్గవద్దు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నాలాలపై అక్రమంగా వెలిసిన కట్టడాల కూల్చివేతను కొనసాగించాలని.. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని జీహెచ్ఎంసీ అధికారులను పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. నాలాలపై ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన సూచనలను, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపు పురోగతిని సమీక్షించేందుకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్‌రావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు బి.జనార్దన్‌రెడ్డి, చిరంజీవులు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్‌మిట్టల్ తదితరులతో భేటీ అయ్యారు. వర్షాలతో నగరంలో ఏర్పడిన పరిస్థితులను జీహెచ్ఎంసీ అధికారులు మంత్రికి వివరించారు. నగరంలో తక్షణమే రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అవసరమైన సహకారాన్ని జీహెచ్ఎంసీకి ప్రభుత్వం అందిస్తుందని.. ఇతర శాఖల్లోని ఇంజనీర్లను తాత్కాలికంగా జీహెచ్ఎంసీకి కేటాయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 30 మంది ఇంజనీర్లను జీహెచ్ఎంసీకి డిప్యుటేషన్‌పై పంపాలని వివిధ ఇంజనీరింగ్ శాఖల అధిపతులను సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఆ ఇంజనీర్లను సర్కిళ్ల వారీగా నియమించుకుని.. బుధవారం నుంచే నగరంలో రోడ్ల మరమ్మతు పనులకు వినియోగించుకోవాలని సూచించారు. రోడ్ల మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలన్నారు. కూల్చివేతలపై కేసీఆర్ ఆరా హైదరాబాద్ నగరంలో నాలాలను ఆక్రమించి, నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలోనే కేటీఆర్‌కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయవద్దని సూచించారు. కూల్చివేతల వివరాలను రోజువారీగా తనకు పంపించాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులుతో సైతం కేసీఆర్ మాట్లాడి కూల్చివేతల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గవద్దని సూచించారు.